సర్కారుకే శాశ్వత హక్కులు

అంగీకారపత్రం ఇచ్చిన రైతులకు భూమిపై హక్కులేనట్లే
కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
బాబుగారి రాజధాని కుట్రలు
భూ సమీకరణ చేపట్టింది ఎవరి కోసం..? రాజధాని రైతుల ప్రయోజనాల కోసమే... చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఊదరగొట్టింది ఇదే. అయితే భూ సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చిన రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా బాబుగారి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆ భూములపై వారికి ఇక ఏమాత్రం హక్కులు లేకుండా చేయడానికి వీలుగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. భూములపై ప్రభుత్వానికి శాశ్వత హక్కులు లభించేలా రైతులతో డెవలప్‌మెంట్ కమ్ ఇర్రివోకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఒకసారి ఒప్పందం జరిగాక దాన్ని తిరగదోడడానికి వీలు లేని) ఒప్పందం కుదుర్చుకోవాలని సీఆర్‌డీఏ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఒప్పందం చేసుకున్న తర్వాత భూ యజమాని చనిపోయినా, దివాలా తీసినా ఆ భూమిపై సంబంధిత రైతుకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి హక్కు ఉండదని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా పలు తిరకాసులు పెట్టింది. భూములు ఇవ్వడానికి సిద్ధపడిన రైతుల కౌలులో మెలికపెట్టింది. రైతులకు చెల్లించే కౌలుకు, వారు తీసుకున్న రుణాలకూ లంకె పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి భూములు తనఖా పెట్టి రైతులు తీసుకున్న అప్పుల కింద కౌలును జమ చేసుకోవాలని నిర్ణయించింది. ఏటా మే 1 లోగా పదేళ్లపాటు రైతులకు కౌలు చెల్లించనున్నట్లు తాజా మార్గదర్శకాలలో పేర్కొంది. ఈ మార్గదర్శకాలలోని మరికొన్ని ముఖ్యాంశాలేవంటే...
  • సర్కారుకు ఇచ్చిన భూముల్లో రైతులు సాగు చేసిన పంటలకు ఈ ఒప్పందంలో భాగంగానే నష్టపరిహారం చెల్లిస్తారు. ముందుగా అంగీకరించిన మొత్తం కన్నా ఎక్కువ పరిహారం చెల్లించాలని అడిగే హక్కు రైతులకు ఉండదు.  ఎక్కువ పరిహారం కోరుతూ కోర్టులను ఆశ్రయించే హక్కు కూడా రైతులకు ఉండదు.
  • ఒప్పందం చేసుకునే సమయంలోనే ఆ భూమికి సంబంధించి రైతులు చెల్లించిన శిస్తు రసీదులు, వినియోగ పత్రాలను ప్రభుత్వానికి సమర్పించాలి.
  • భూముల లీజు, లెసైన్సులపై గతంలో కుదుర్చుకున్న అవగాహన పత్రాలు, ఉమ్మడి కుటుంబ హక్కులు ఒప్పందం కుదుర్చుకున్న నాటి నుంచి రద్దవుతాయి.
  • రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత భూములను ఎవరూ కొనుగోలు చేయరాదని, రిజిస్ట్రేషన్లు కూడా చేయరాదని పేర్కొంటూ సీఆర్‌డీఏ ప్రకటనలు ఇవ్వాలి.
  • భూములను అభివృద్ధి చేసే సమయంలో ఎలాంటి అవాంతరాలు సృష్టించే హక్కు గానీ, స్టే తెచ్చుకునే అవకాశం గానీ రైతులకు ఉండదు.
  • రైతులతో కుదుర్చుకునే ఒప్పందాన్ని ఎలాంటి కారణం లేకుండా ఎప్పుడైనా రద్దు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
Back to Top