ఏపీని మద్యాంద్రప్రదేశ్ గా మార్చారు

()మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు
()ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు
()బాబు, లోకేష్ కనుసన్నల్లో అవినీతి
()వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పద్మ ఫైర్

హైదరాబాద్ః రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేద ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఇప్పటికే ఏపీని అవినీతిలో, నేరాల్లో నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చిన చంద్రబాబు, రాష్ట్రాన్ని మద్యాంద్రప్రదేశ్ గా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులను రద్దుచేస్తానని చెప్పి ఐదు సంతకాల్లో ఓ సంతకం చేసిన చంద్రబాబు ఊరూరా మరింతగా బెల్ట్ షాపులను విస్తరిస్తూ పేదల జీవితాల్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. మద్యం అమ్మకాలు మరితంగా పెంచాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఆదేశాలివ్వడం దారుణమన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నారని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. 

పేదలతోనే 75 శాతం అమ్మకాలు జరుగుతున్నాయని, బాబు వారి కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం అన్యాయమన్నారు. మద్యం అమ్మకాల వల్లే క్రైం రేటు కూడా విపరీతంగా పెరుగుతోందని పద్మ వాపోయారు. మత్తులో నేరాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు. అలాంటి పరిస్థితుతుల్లో  క్రైం రేటును తగ్గించాల్సిందిపోయి పనిగట్టుకొని మద్యం అమ్మకాలను పెంచడం ఘోరమన్నారు. చిన్న చిన్న ఊళ్లలో సైతం 10 బెల్ట్ షాపులున్నాయని, కిల్లీ కొట్లలో కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని  పద్మ ఆరోపించారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఆఖరికి గుడి, బడి, ఆస్పత్రిలలో కూడా మద్యాన్ని తీసుకొస్తారన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రజలను మత్తుకు బానిసలను చేయడమే బాబు 2029 విజన్ గా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. గ్రోత్ రేట్, రెవెన్యూ అంతా బాగుందన్నప్పుడు మద్యం అమ్మకాలను పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశారు. మద్యపాన నిషేదంను అమలు చేసిన రాష్ట్రం ఏపీ అని, అలాంటి పేరున్న మన రాష్ట్రంలో చంద్రబాబు ఊరూరా బెల్ట్ షాపులను విస్తరిస్తూ పేదల రక్తం తాగుతున్నారని నిప్పులు చెరిగారు.  

బెల్ట్ షాపులపై యాక్షన్ తీసుకోవాల్సిన ముఖ్యమంత్రే పనిగట్టుకొని డిస్టలరీలు పెంచి వాటిని విస్తరించాలనుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర గ్రోత్ రేటు 12.5 శాతం ఉందని చంద్రబాబు చెప్పిన విషయాన్ని పద్మ గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు పేదల రక్తాన్ని పీల్చుతూ వారి కాపురాల్ని ఎందుకు కూల్చుతున్నారని బాబును సూటిగా ప్రశ్నించారు.  ప్రజల సంక్షేమం పూర్తిగా పక్కదారి పట్టిందని, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారని బాబు తీరుపై మండిపడ్డారు. ఓ సారి రెవెన్యూ లేదని చెబుతారు. దాన్ని పూడ్చుకునేందుకు  కేంద్రం నుంచి రావాల్సిన నిధులను మాత్రం రాబట్టరు. ఆర్థిక లోటుందని ప్రజల మీద భారం వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ లపై వ్యాట్ వేశారు. 4 శాతం అదనంగా పన్నులు రాబడుతున్నారు. ఖజనాకు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. దోపిడీని పూడ్చుకోవడం కోసం ప్రజల చేత మద్యం తాగిస్తున్నారని వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

చంద్రబాబుకు మద్యం అమ్మకాల మీద ఉన్న దృష్టి ఇరిగేషన్ పై లేకపోవడం దురదృష్టకరమన్నారు. పక్కరాష్ట్రం తెలంగాణ సర్కార్ కృష్ణా, గోదావరిలపై అక్రమ ప్రాజెక్ట్ లు కడుతున్నా, నీటి వాటాలో ఏపీకి అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు నీమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. అబద్ధాలతో కాలం వెళ్లదీయం తప్ప ప్రజలకు పలానా చేశామని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి కూడా బాబుకు లేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా తీసుకురాకపోయినా ప్రతిపక్షాలపై మాత్రం బాగా ఎదురుదాడి చేయాలని, దబాయించాలని బాబు టీడీపీ శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు సందేశమివ్వడం విడ్డూరమన్నారు. ఐదు సంతకాల్లో ముఖ్యమంత్రిగా పెట్టనవి ఎక్కడ అమలు కావడం లేదని దుయ్యబట్టారు.  విభజన చట్టంలో కేంద్రం నుంచి  రాష్ట్రానికి రావాల్సిన వాటిని రాబట్టడం లేదని స్పష్టం చేశారు. 

ఏ పొలంలో ఎంత పంట పండింది, ఏ పూవు పూసిందంతా నాకు తెలుస్తుందన్న బాబుకు ఎక్సైజ్ కమీషనర్ నుంచి ఎంత ముడుతుందన్నది తెలీదా అని నిలదీశారు. బాబు, లోకేష్ లకు తెలిసే అవినీతి జరుగుతోందని పద్మ అన్నారు. ఎక్సైజ్ కమిషనర్ కు రూ.4 వేలు, సూపరిండెంట్ కు రూ.3వేలు, సర్కిల్ ఇన్స్ పెక్టర్ కు రూ.1500, ఎస్సైకి రూ. వేయి ప్రతీ నెల మద్యం షాపులనుంచి ముడుపు అందుతోందని అన్నారు. ఇదంతా కళ్లముందు కనబడుతున్నాఅడగాల్సింది పోయి ...మీరెంతైనా దండుకోండి మా వాటా ఇవ్వండి, ప్రజల చేత మద్యం తాగించండి అని  సర్కార్ ఆదేశాలివ్వడం దారుణమన్నారు. సీఎం పేషీ మొదలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాటాల పద్దతిలో మద్యం దందాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇంతవరకు అవినీతి, అక్రమాలపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నదే లేదని దుయ్యబట్టారు. మద్యం మీద చూపే విజన్ ప్రజల కనీస అవసరాల మీద చూపించాలని బాబుకు హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీల మీద సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

Back to Top