'అనంత' కష్టాలు తీర్చింది మహానేత వైయస్సే

అనంతపురం, 31 అక్టోబర్‌ 2012: వర్షాలు లేక దేశంలోనే అత్యంత తీవ్ర దుర్భిక్ష ప్రాంతంగా మారిన అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు మహానేత దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి నిరంతరం కృషి చేశారని వైయస్‌ఆర్‌సీపీ రాప్తాడు నియోజకవర్గం ఇన్‌చార్జి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి గుర్తుచేశారు. జిల్లా వాసుల కష్టాలు తీర్చడానికి ఆయన ఎంతగానో తపనపడ్డారని ఆయన అన్నారు. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో పిల్లిగుండ్ల కాలనీలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబు సేద్యాన్ని నిర్వీర్యం చేశారని, అప్పుడు రైతు కుటుంబాలు చిన్నాభిన్నమై పొట్ట చేతబట్టుకుని వలస వెళ్లాయని ప్రకాశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.‌ దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రైతులను అన్నివిధాలా ఆదుకున్నారన్నారు. సేద్యానికి పెద్దపీట వేసి రైతు కుటుంబాల్లో మళ్లీ వెలుగులు నింపారని కొనియాడారు. పీఏబీఆర్‌కు పది టీఎంసీల నీటిని కేటాయించి తాగు, సాగునీటి కష్టాలను తీర్చారన్నారు. మహానేత ఉండి ఉంటే ఈ పాటికి హంద్రీ-నీవా పూర్తయ్యేదని, పేరూరు డ్యాంకు నీళ్లు వచ్చేవని, పది వేల ఎకరాల ఆయకట్టు సాగయ్యేదన్నారు.

జిల్లాలో ఫ్యాక్షన్‌ను వైయస్ ఉక్కుపాదంతో అణచివేసి శాంతియుత వాతావరణం నెలకొనేలా చేశా‌రని తోపుదుర్తి గుర్తుచేశారు. వైయస్ రెక్కలకష్టంతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం చంద్రబాబు పాలనను తలపిస్తోందని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్‌ఆర్‌సీపీ విజయఢంకా మోగిస్తుందన్నారు.

తాజా వీడియోలు

Back to Top