లోటు బడ్జెట్‌లో ‘ప్రత్యేక’ విమానాల్లో ప్రయాణాలా?

హైదరాబాద్: ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉందని అంటున్న చంద్రబాబు, ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తగదని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.  ఈ మేరకు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి దుబారా ఖర్చులు చూస్తుంటే ఆయన చంద్రబాబు కాదు దుబారా బాబు అనిపిస్తోందని విమర్శించారు. విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్ర రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవని చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారన్నారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఖర్చులు తగ్గించుకోవాలని గతంలో జీవోలు జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణానికి విరాళాల సేకరణ, హుండీలు పెట్టడం వంటివి చేశారని అన్నారు. ఇన్ని విధాల పొదుపు చర్యలు పాటించాలని జీవోల ద్వారా ఉపదేశించిన ముఖ్యమంత్రి తానే స్వయంగా వాటిని ఉల్లంఘించడం ఆయనకు తగదన్నారు. చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే చెప్పేందుకే నీతులు ఉన్నాయి.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవాచేశారు. ఢిల్లీ వెళ్లడానికి అనేక రవాణా సదుపాయలు అందుబాటులో ఉండగా, ఆయన తన తాబేదార్లతో కలిసి ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌లో వెళ్లడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ఇంత భారీ మొత్తం చెల్లించి ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా అని నిలదీశారు. ప్రత్యేక సందర్బాలు ఉంటే వెళ్లారేమో గానీ, చంద్రబాబులాగా పదేపదే అద్దె విమానాలకు ప్రజాధనాన్ని భారీ మొత్తంలో చెల్లించి ఎవరూ వెళ్లలేదని స్పష్టం చేశారు. ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి ప్రయాణం కేవలం దేశ రాజధాని పర్యటనకే పరిమితం కాలేదని హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం, విజయవాడకు కూడా ప్రత్యేక విమానాల్లో కలిసి వెళ్లడమేంటని ప్రశ్నించారు. అధికారులను విమానం ఎగ్జిక్యూటివ్ క్లాసులో కాకుండా ఎకానమీ క్లాసుల్లో ప్రయాణం చేయాలని చెబుతున్న చంద్రబాబు తాను మాత్రం ఇలా ప్రత్యేక విమానాల్లో వెళ్లడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. ఇక సింగపూర్, జపాన్ పర్యటనలకు వెళ్లి వచ్చినందుకు ఒకసారి రూ.70 లక్షలు, మరోసారి రూ.1.25 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వాస్తవానికి అయిన ఖర్చును దాచి పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. పొదుపు చర్యలు పాటించడం అంటే ఇదేనా? అని సూటి ప్రశ్న సంధించారు. 13 జిల్లాల్లో 15 మంది సలహాదారులను నియమించడం ఎంతవరకు సబబు అని అన్నారు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెబుతూనే యోగా శిక్షణ కోసం రూ.2 కోట్లు ఖర్చు చేయడంలో ఔచిత్యాన్ని ప్రశ్నించారు. ఆర్థికస్థితి బాగాలేదని పదే పదే చెప్పడం ఉద్యోగుల పీఆర్సీనీ ఎగ్గొట్టేందుకేనని స్పష్టమవుతోందని అంబటి అన్నారు.
Back to Top