సమైక్యాంధ్ర కోసం పార్టీలన్నీ ఏకం కావాలి

కడప :

‘సమైక్యాంధ్ర ఆవశ్యకతపై ముఖ్యమంత్రి బాగానే మాట్లాడాడు. సంతోషమే! అయితే మాటలు చేతల్లో చూపాలి. అధిష్టానాన్ని ధిక్కరించేలా మాట్లాడినందుకు కాంగ్రెస్ ఏ క్షణమైనా ‌కిరణ్‌కుమార్‌రెడ్డిని తొలగించవచ్చు. ఆ లోపు ఆయన అసెంబ్లీని సమావేశపరచాలి. సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలి. దానికి మేము మద్దతిస్తాం. అప్పుడు అన్నిపార్టీల రంగు బయటపడుతుంది. పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ‘సమైక్య తీర్మానం’ చేస్తే ఆ నోట్‌ను సోనియా గాంధీకి పంపిద్దాం. అప్పుడు విభజన నిర్ణయం మారుతుంది. సమైక్య ఆశయం నెరవేరుతుంది’ అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎం‌.వి. మైసూరారెడ్డి అన్నారు.

‘ఆంధ్రప్రదే‌శ్ రాష్ట్ర సమైక్య వేదిక’ పేరుతో వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారంనాడు వైయస్ఆర్‌ జిల్లా కడపలో అన్ని జిల్లాల జెఎసిల నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్యోగులుగా తాము కొన్ని పరిమితులకు లోబడి, జీతాలు లేకున్నా రెండు ‌నెలలుగా ఉద్యమం కొనసాగిస్తున్నామని ఎపిఎన్జీవో, ఆర్టీసీ, విద్యుత్, న్యాయవాదులు, ఉపాధ్యాయులు వివరించారు. అయితే తాము ఎన్ని నిరసనలు చేసినా కేంద్రం చులకనగా చూస్తోందని, ఓ రాజకీయ పార్టీ అండగా ఉంటే ఉద్యమానికి ఫలితం ఉంటుందని చెప్పారు.

ఉద్యమానికి జగన్ నాయకత్వం వహించాలి: జేఏసీలు

తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించారని, సీమాంధ్రలో శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సారథ్యం వహించి ఉద్యమాన్ని ముందుకు నడపాలని జెఎసిల నేతలు విన్నవించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచిన శక్తి మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి అని, ఆ తర్వాత అలాంటి వ్యక్తి‌ శ్రీ జగన్ మాత్రమే అని వారు స్పష్టం చేశారు. వారి ప్రతిపాదనపై మైసూరా‌రెడ్డి స్పందించారు. ‘తెలంగాణ ఉద్యమం రాజకీయ అండతో సాగింది. కానీ ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అండ లేకుండా గొప్ప ఉద్యమం నడుస్తోంది. జీతాలను పణంగా పెట్టి ఉద్యమించిన ప్రతి ఒక్కరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు. సమైక్య ప్రకటన వెలువడక ముందే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేశారు. అయితే కొందరు నేతలు.. ముందుగా రాజీనామాలు చేశారు. విభజన నిర్ణయం మీకు ముందే తెలుసు అంటూ అవివేకంగా మాట్లాడారు. విభజన నిర్ణయం వస్తోందని ప్రజలందరికీ తెలుసు. ఆ మాత్రం తెలీనివారు రాజకీయ నాయకులు ఎలా అయ్యారు? ప్రజల భవిష్యత్తుకు వీరేమి భరోసా ఇస్తారు? సమైక్యానికి అండగా శ్రీమతి విజయమ్మ దీక్ష చేశారు. శ్రీ జగన్ జైల్లోనే ఆమరణ దీక్ష చేశారు. దీనికి చాలా ఇబ్బందులు ఉంటాయి. గాంధీజీ తర్వాత జైల్లో దీక్ష చేసిన వ్యక్తి‌ శ్రీ జగన్ మాత్రమే..’ అ‌న్నారు.

సమైక్యవాదాన్ని ముందుకు తీసుకెళతాం :
సమైక్య ఉద్యమానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్ అండగా ఉండి ముందుకు నడిపించాలని అందరూ కోరుతున్నారని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సమైక్యవాదాన్ని భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్లే బాధ్యత వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌దే అని మైసూరారెడ్డి హామీ ఇచ్చారు. తమతో పాటు సిపిఎం, ఎంఐఎం కూడా సమైక్యానికి అండగా ఉన్నాయని తెలిపారు. టిడిపి, కాంగ్రెస్‌లు కూడా తమ వైఖరి స్పష్టం చేయాలన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జెఎసి నేతలు ఓ లేఖ రాస్తే దానిపై మొదటి సంతకం శ్రీ జగన్‌తో పెట్టిస్తామని, అలాగే సిపిఎం, ఎంఐఎంతో పాటు చంద్రబాబు, బొత్స కూడా సంతకం చేసేలా జెఎసి నేతలు ప్రయత్నించాలని సూచించారు. తెలంగాణపై కేబినెట్ నో‌ట్ సిద్ధమయ్యే లో‌గానే ఈ ప్రక్రియ పూర్తికావాలన్నారు. అప్పుడు ప్రజాభిప్రాయం మేరకు, ప్రజాప్రతినిధుల నిర్ణయం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తుతుంది, 60 రోజుల ఉద్యమ ఫలితం 6 గంటల్లోనే తేలిపోతుందని మైసూరా వివరించారు.

ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి రైల్‌రోకోలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత, సకల జనుల సమ్మె చేయాలని జెఎసి నేతలు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా రూపొందిస్తే అలా నడుచుకోవడానికి ‌వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు సిద్ధంగా ఉన్నారని మైసూరారెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కడప మాజీ మేయ‌ర్ రవీంద్రనా‌థ్‌రెడ్డి, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అలీ, ఎపిఎన్జీవోల సంఘం జిల్లా నేత గోపాల్‌రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడు రా‌మ్మూర్తినాయుడు, ఇతర జెఎసిల నేతలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top