విగ్రహప్రతిష్ఠ ఆగదు : చెవిరెడ్డి

తిరుపతి: వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఏర్పాటులో పోలీసులవల్లే శాంతిభద్రతల సమస్య తలెత్తనుందని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ చంద్రగిరి ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా విగ్రప్రతిష్ఠ ఆగదని స్పష్టం చేశారు.

అనుమతి లేకుండా వైయస్‌ విగ్రహాలను ప్రతిష్ఠిస్తే క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తామంటూ పోలీసులు చేస్తున్న హెచ్చరికలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు.

మహానేత విగ్రహాలను ప్రజలే స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటుంటే పోలీసులకు వచ్చిన ఇబ్బందులేమిటో చెప్పాలని ఆయన డిమాండు చేశారు. అధికార పార్టీ నేతల మెప్పు కోసమే ఇలా అనవసర ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.

మహానేత విగ్రహాలను మహిళలు, ప్రజలే ప్రతిష్ఠించి తీరుతారని స్పష్టం చేశారు.

వైయస్‌ ఆకస్మిక మరణానికి ముందు నారావారి పల్లెలో, తిరుపతి టౌన్‌క్లబ్‌సర్కిల్‌లో నెలకొల్పిన ఎన్టీఆర్‌విగ్రహాలకు అనుమతులు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అయితే తమ పార్టీ ఆ విగ్రహాలను ఎన్నడూ అడ్డుకోలేదని, అలా చేయడం తమ నైజం కాదని చెప్పారు .

ఆదివారం నిర్వహించే వైయస్సార్‌ సంస్మరణ కార్యక్రమాల్లో విగ్రహాల ప్రతిష్ఠను అడ్డుకున్నా.. తాము నెలంతా చంద్రగిరి నియోజకవర్గంలో సంస్మరణ సభలు ఏర్నాటు చేసి విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని హెచ్చరికగా చెప్పారు.

Back to Top