ప్రజా సమస్యలపై దృష్టి లేదు పరిష్కరించాలన్న ధ్యాసే ఉండదు సీటును కాపాడుకునే యత్నం హైదరాబాద్, 2012 ఆగస్టు 24 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరు నీరో చక్రవర్తిని తలపిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నట్టుగానే, రాష్ర్ట ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కిరణ్ మంత్రివర్గ సభ్యులు కూడా ఆయనకు తక్కువేం తినలేదన్నట్లు వారూ తమ తమ పదవులను కాపాడుకునేందుకో, పెద్ద పదవుల కోసమో ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారంనాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.ముఖ్యమంత్రి, మంత్రుల నిర్వాకం వల్లే రాష్ట్రంలో దౌర్భాగ్యం తాండవిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విద్యుత్ సమస్యతో రాష్ట్రం అల్లాడిపోతుంటే పట్టించుకోకుండా ప్రజలు ఇంటి కిటికీ తలుపులు తెరిచిపెట్టుకోవాలని కిరణ్‌కుమార్‌రెడ్డి సలహా ఇవ్వడం సిగ్గుచేటు అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్కన విద్యుత్ కోతలతో పరిశ్రమలు మూతపడిపోతున్నాయని, దీనితో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని ప్రభుత్వ పెద్దలు తుంగలో తొక్కేశారని అంబటి ఆరో్పించారు. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ అందించడంలేదని, తద్వారా అన్నదాత అప్పుల్లో కూరుకుపోతున్నాడని ఆయన విచారం వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్‌రెడ్డికి ముందుచూపు లేకే మన రాష్ట్రాన్ని చీకట్లు పరిపాలిస్తున్నాయని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ బెయిల్‌ను అడ్డుకునేందుకే..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నానా పాట్లూ పడుతోందని అంబటి వ్యాఖ్యానించారు. జగన్‌ను దోషిగా నిలబెట్టాలనే ఆ పార్టీ అధిష్ఠానం మంత్రులను కూడా దోషులను చేసి చూపిస్తోందని ఆయన విమర్శించారు. మోపిదేవి వెంకట రమణను చంచల్‌గూడ జైలుకు పంపండం, ఈ కుట్రలో భాగమే అన్నారు.