ఆర్టీసీని పరిరక్షించింది మహానేతే

అమలాపురం:

నష్టాల బాటలో ఉన్న ఏపీయస్ ఆర్టీసీని రాయితీలు ఇచ్చి పరిరక్షించడమే కాకుండా కార్మిక సంక్షేమానికి ముఖ్యమంత్రిగా మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కృషిచేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి కొనియాడారు. పార్టీకి అనుబంధంగా అమలాపురం ఆర్టీసీ డిపోలో రాష్ట్రీయ మజ్దూర్ ఫెడరేషన్ (ఆర్‌ఎంఎఫ్) యూనియన్ ప్రారంభ సందర్భంగా ఆర్‌ఎంఎఫ్ యూనియన్ డిపో గౌరవాధ్యక్షుడు కుడపూడి అశోక్ అధ్యక్షతన జరిగిన సభలో చిట్టబ్బాయి ప్రసంగించారు. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల ఊబిలో ఉందన్నారు. శ్రీ వై.యస్. జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రయితే ఆర్టీసీని పరిరక్షించి కార్మికులకు మేలు చేకూరుస్తారన్నారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కార్మికులది అజేయమైన శక్తనీ, ప్రభుత్వాన్ని కూలదోసే శక్తి వారికుందనీ చెప్పారు. పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బుచ్చి మహేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయితేనే కార్మిక, కర్షకుల సమస్యలు తీరుతాయన్నారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరమని, కార్మికులు ఆర్‌ఎంఎఫ్ యూనియన్‌ను పటిష్టం చేయాలన్నారు.

Back to Top