ఆ రెండూ దుకాణాలు మూసుకోవాల్సిందే: షర్మిల

అనంతపురం, 29 అక్టోబర్‌ 2012: జగనన్న బయట ఉంటే కాంగ్రెస్‌, టిడిపిలు దుకాణాలు మూసుకోవాల్సిందే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. జగనన్న బయట ఉంటే ఆ రెండు పార్టీలకూ మనుగడే ఉండబోదని ఆమె అన్నారు. ఎండనకా, వాననకా... రేయనకా, పగలనకా నిరంతరం జనం మధ్యనే ఉండి, జనం సమస్యల కోసం పోరాడుతున్న జగన్‌ అంటే ఆ రెండు పార్టీల్లోనూ దడ, వణుకు పుడుతోందని షర్మిల ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్‌, టిడిపిలు సిబిఐని వాడుకొని జగనన్నపై అన్యాయంగా కుట్ర చేసి జైలుకు పంపించాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా జగన్ పక్షాన దేవుడు ఉన్నాడని, ఒక రోజున జగనన్న బయటికి వస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అధర్మం ఎక్కువ కాలం నిలబడదని అన్నారు.
షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా సోమవారం సాయంత్రం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. ఇదే వేదికపైన షర్మిల, పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమక్షంలో తరిమెల శరత్‌ చంద్రారెడ్డి పార్టీలో చేరారు. షర్మిల బహిరంగ సభకు అనంతపురంలో ప్రజాభిమానం ఉప్పొంగిందా అనే రీతిలో భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్కిల్‌ వద్ద ఉన్నవైయస్‌ఆర్‌ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించారు.
జగనన్న బయటికి వచ్చిన రోజున రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తాడని షర్మిల భరోసా ఇచ్చారు. ఆ రోజున జగనన్న రైతులకు ఇబ్బందులు లేకుండా రూ. 3 వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాడని హామీ ఇచ్చారు.  ఆ రోజున రాష్ట్రంలో గుడిసె అన్నదే లేకుండా చేసి అందరికి పక్కా ఇళ్ళు కట్టించి ఇస్తారన్నారు. ఆ రోజున డబ్బులు లేకుండా మన విద్యార్థుల చదువూ ఆగిపోకుండా చూస్తాడని అన్నారు. పిల్లలను బడికి పంపినందుకు విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు 'అమ్మ ఒడి' పథకాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఆ రోజున మన మహిళలకు వడ్డీ లేని రుణాలు అందేలా చూస్తాడని చెప్పారు. ఆ రోజున మన వృద్ధులకు నెలకు రూ. 700 పింఛన్‌ అందిస్తారని భరోసా ఇచ్చారు. వికలాంగులకు వెయ్యి రూపాయల పింఛన్‌ అందేలా చూస్తారన్నారు. జగనన్న బయటికి వచ్చిన రోజున తాను చెప్పినవీ, చెప్పనివి కూడా చేస్తారన్నారు. మన మైనార్టీలు, మన బీసీల అభివృద్ధికి పలు మేళ్ళు చేస్తారని చెప్పారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌, టిడిపిలకు బుద్ధి చెప్పాలని, జగనన్నను ఆశీర్వదించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. జగన్‌ను అన్యాయంగా జైలులో పెట్టినందుకు నిరసనగా ప్రతి ఒక్కరూ నల్ల బ్యాడ్జీలు ధరించి తనతో పాటు కదంతొక్కాలని బహిరంగ సభకు అశేషంగా హాజరైన అభిమానులు, పార్టీ శ్రేణులకు షర్మిల పిలుపునిచ్చారు.
దేశంలోనే రాజస్థాన్‌ తరువాత అత్యంత తక్కువ వర్షపాతం కురిసే ప్రాంతం అనంతపురం అని షర్మిల విచారం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఏన్నో కరవు కాటకాలను చవిచూసిందని చలించిపోయారు. అందుకే అనంతపురం జిల్లా అంతే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి ప్రత్యేక అభిమానం ఉండేదన్నారు. జిల్లాను కరవు బారి నుంచి తప్పించాలనే ఆయన జలయజ్ఞంలో అత్యంత ప్రాధాన్యం కల్పించారన్నారు. ఈ ప్రాంత ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన హంద్రీ నీవా పథకానికి టిడిపి రెండు సార్లు శిలా ఫలకాలు వేసి వదిలిపెట్టేసిందని షర్మిల దుయ్యబట్టారు. అనంతరం అధికారంలోకి వచ్చిన మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి రూ.4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 95 శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. మరో 45 కోట్లు వ్యయం చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 400 గ్రామాలకు నీటి సౌకర్యం కలుగుతుందన్నారు. మిగిలిన ఐదు శాతం పనులు పూర్తి చేసి అనంత వాసులకు నీటి సౌకర్యం కల్పించడానికి ప్రస్తుత ప్రభుత్వానికి మూడేళ్ళు సరిపోలేదని దుయ్యబట్టారు.
గత రెండేళ్ళుగా రిజర్వాయర్‌కు ప్రస్తుత ప్రభుత్వం నీటి చుక్క కూడా సరఫరా చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ కారణంగా ఇక్కడి అన్ని రకాల పంటలూ ఎండిపోయాయన్నారు. సుమారు 30 వేల బోర్లు కూడా ఎండిపోయాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులు, పేదలు కూడా రోగం వస్తే కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలన్న సదాశయంతో స్వయంగా వైద్యుడైన రాజశేకరరెడ్డి 'ఆరోగ్య శ్రీ' పథకం ఏర్పాటు చేశారన్నారు. డబ్బులు లేకుండా ఏ విద్యార్థీ చదువు ఆగిపోకూడదనే ఆయన ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకం ద్వారా పూర్తి ఫీజు చెల్లించారని చెప్పారు. ప్రస్తుత పథకం ఈ పథకానికి కత్తెర వేస్తోందని షర్మిల నిప్పులు చెరిగారు. ప్రతి ఇంటిలో ఒక డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో ఉండాలని రాజన్న కలలు కని ఈ పథకం రూపొందించారన్నారు.
అన్నివిధాలా అసమర్థంగా, ప్రజా వ్యతిరేకంగా మారిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించగల శక్తి ప్రధాన ప్రతిపక్షం టిడిపికి ఉందన్నారు. అయితే, మూడేళ్ళుగా టిడిపి చోద్యం చూస్తోందని విమర్శించారు. టిడిపి అవిశ్వాసం పెడితే వైయస్‌ఆర్‌ సిపి మద్దతు ఇస్తుందని చెబుతున్నా ఆ దిశగా టిడిపి కదలడంలేదన్నారు. రాజన్నకు, జగనన్నకు ఉన్నది, చంద్రబాబుకు లేనిదే విశ్వాసం అన్నారు. తన హయాంలో గ్యాస్‌ ధర పెంచలేదని నిన్న చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని షర్మిల తీవ్రంగా ఖండించారు. ఆయన హయాంలో 145 రూపాయలు ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర 305 రూపాయలు అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంత నిస్సిగ్గుగా చంద్రబాబు అందరి ముందూ అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకున్న చంద్రబాబుకు నిజం చెప్పడం చేతకాదని ఎద్దేవా చేశారు. ఐదేళ్ళ పాలనలో ఒక్క రూపాయి కూడా గ్యాస్‌ ధర పెరగకుండా చూసిన ఘనత దివంగత మహానేత వైయస్‌దే అన్నారు. టిడిపిని అధికారంలోకి తీసుకువచ్చిన కిలో రెండు రూపాయల బియ్యం పథకం, పూర్తి మద్యపాన నిషేధం హామీల్లో ఏ ఒక్కదాన్నీ చంద్రబాబు నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.
టిడిపి హయాంలో విద్యుత్‌ ఛార్జీలు ఎనిమిదిసార్లు పెంచారని, బిల్లులు కట్టలేకపోయిన రైతులను జైళ్ళపాలు చేసిన చరిత్ర చంద్రబాబుదే అని షర్మిల ఆరోపించారు. విద్యుత్‌ సంక్షోభంపై వైయస్‌ రాజశేఖరరెడ్డి దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యుత్‌ సమస్యపై ఉద్యమించిన అన్నదాతలపై పోలీసు కాల్పులు జరిపించి చంపించిన దుష్ట చరిత్ర చంద్రబాబుది అన్నారు. తొమ్మిదేళ్ళ తన పరిపాలనలో ఏమీ చేయని ఆయన ఇప్పుడు పాదయాత్ర పేరుతో అది చేస్తా, ఇది చేస్తా అంటూ జనం ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. ఇబ్బందులతో మరణించిన రైతన్నలకు లక్ష రూపాయలు నష్ట పరిహారం చెల్లించిన ఘనత వైయస్‌దే అన్నారు. 

Back to Top