ఆదాయం పెరిగినా సబ్సిడీ ఇవ్వరా?: సోమయాజులు

హైదరాబాద్, 05 ఏప్రిల్ 2013:

రాష్ట్ర ఆర్థిక ఆదాయ వనరులు రూ.43 వేల కోట్లు పెరిగినా విద్యుత్తు రంగానికి అదనంగా ఇచ్చే రాయితీ రూ. 200 కోట్లేనా? అని వైయస్ఆర్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ. సోమయాజులు ప్రశ్నించారు. కరెంటు సత్యాగ్రహం దీక్షా శిబిరం వద్ద ఆయన కొణతాల రామకృష్ణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గడిచిన మూడేళ్లుగా రాష్ర్ట ప్రభుత్వం ఇంధన సర్‌చార్జి రూపంలో ప్రజలపై రూ.18 వేల కోట్ల భారం వేసిందనీ, మొత్తం రూ.30 వేల కోట్లను విద్యుత్తు చార్జీల రూపంలో వసూలు చేశారనీ చెప్పారు. 2013-14 సంవత్సరానికి రూ.12 వేల కోట్లు తేడా వస్తుందని చెప్పి, అందులో రూ.6,500 కోట్ల భారం ప్రజలపై వేయాలని విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్‌కు ప్రభుత్వం సూచించిందని విమర్శించారు. గత ఏడాది విద్యుత్తు రంగానికి ఇచ్చిన రాయితీ రూ.6,045 కోట్లు కాగా, ఈ ఏడాది అది రూ.5,450 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇపుడు తగ్గిస్తామంటున్న రూ.830 కోట్లు కలిపినా ఆ రాయితీ రూ.6,200 కోట్లు దాటడం లేదని సోమయాజులు పేర్కొన్నారు.

Back to Top