21న 'ప్రాణహిత' ఫలకానికి పాలాభిషేకం

హైదరాబాద్, 16 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక అయిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రాంతాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈనెల 21న సందర్శిస్తారని పార్టీ అధికార ప్రతినిధి  జనక్ ప్రసాద్ వెల్లడించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. 2008 డిసెంబర్ 16న ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలం, తుమ్మిడిహెట్టి గ్రామం దగ్గర డాక్టర్ వైయస్ఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుగా దీనికి పేరుపెట్టారన్నారు. మహానేత శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటైన శిలాఫలకానికి శ్రీమతి విజయమ్మ పాలాభిషేకం చేస్తారని తెలిపారు. స్థానికులతో ఆమె మాట్లాడతారని చెప్పారు. అనంతరం సిర్పూర్ కాగజ్ నగర్లో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. సత్వరం ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారన్నారు.

నాలుగేళ్ళయినా కదలని పనులు
శంకుస్థాపన చేసి నాలుగేళ్ళు గడిచినప్పటికీ పనులు చేపట్టలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు మేలు చేకూరుతుందని జనక్ ప్రసాద్ చెప్పారు. మొత్తం 16లక్షల 40వేల ఎకరాలకు నీరందుతుందన్నారు. వెనుకబడిన తెలంగాణ జిల్లాల్లో  వ్యవసాయానికి నీరందించాలనే ఆలోచనతో మహానేత ఈ పథకానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. దీనివల్ల 88 మండలాలకు, 1565 గ్రామాలకు మేలు ఒనగూరుతుందన్నారు. 16 ఎత్తిపోతలతో 28 ప్యాకేజీలుగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని వివరించారు. 160 టీఎంసీల నీరు అందుతుందన్నారు. 38,500కోట్ల రూపాయల ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారన్నారు. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఆయన చెప్పారు. ప్రాజెక్టు పూర్తికోసం అవసరమైతే ప్రజా పోరాటాలకు కూడా తమ పార్టీ సిద్ధమని జనక్ ప్రసాద్ ప్రకటించారు.

Back to Top