రాష్ట్ర అప్పు 2లక్షల 5వేల కోట్లు

  • రాష్ట్ర విభజన నాటికి ఏపీ అప్పు 96వేల కోట్లు
  • ఈ మూడున్నరేళ్లలో లక్ష 9వేల కోట్లు అప్పు చేసిన టీడీపీ
  • టీడీపీ పరిపాలనను చూస్తే భయమేస్తోంది
  • సొంత పనులకు బాబు కోట్లాది రూపాయలు దుబారా
  • చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన ఫైర్
హైదరాబాద్ః టీడీపీ పరిపాలనను చూస్తే భయమేస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు  రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన వల్ల రాష్ట్రానికి అన్యాయం జరగడం కాదని...బాబు చేసిన దోపిడీ కార్యక్రమాల మూలంగా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు. టీడీపీ సర్కార్ దుబారా ఖర్చులు, దోపిడీ పాలనను హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బుగ్గన ఎండగట్టారు.  చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే....

కాగ్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రామాణికమైనవి. రాష్ట్రం తరపున అకౌంట్స్ మేనేజ్ చేసేది కూడ కాగే. కాగ్ సమర్పించే అంకెల్లో పొరపాట్లకు తావుండదు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ జరిగి 41మాసాలు పూర్తయ్యింది. టీడీపీ సర్కార్ ఈ 41 మాసాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ పరిస్థితికి తీసుకొచ్చిందో చూస్తే భయమేస్తోంది. ఎంత భయమేస్తోందంటే....ఇలాగే  కొనసాగితే రాష్ట్రాన్ని కాపాడగలగడం వీలవుతుందా అన్నంత భయమేస్తోంది. 2014 ఎన్నికల్లో నా అంత అనుభవజ్ఞుడు లేడంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టాడు. ప్రజలు కూడ నమ్మి ఓటేశారు. కానీ, బాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దారుణమైన పరిస్థితికి తీసుకుపోతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. దేశంలో ఇటువంటి ఆర్థిక పరిస్థితి ఏ రాష్ట్రానికి ఉండదు. జూన్ 2 -2014 నాటికి ఉమ్మడి రాష్ట్ర అప్పు లక్ష 66వేల కోట్లు. జనాభా నిష్పత్తి ప్రకారం ఏపీ 58 శాతం, తెలంగాణ 42 శాతం పరంగా లెక్కేసుకుంటే...ఏపీ 13 జిల్లాల భాగానికి 96వేల కోట్ల అప్పు మనకి సంక్రమిస్తుంది. ఆగష్టు 2017 నాటికి కాగ్ అప్ లోడ్ చేసిన అంకెల ప్రకారం రాష్ట్ర అప్పు 2లక్షల 5వేల కోట్లలో ఉంది. 

1956 నుంచి 2014 జూన్ వరకు లెక్కేసినట్లయితే 13 జిల్లాల అప్పు  96వేల కోట్లు. ప్రస్తుతం 13 జిల్లాల అప్పు 2లక్షల 9వేల కోట్లు. 60 ఏళ్లలో వివిధ ప్రభుత్వాలు 96వేల కోట్లు అప్పు చేస్తే....ఈ మూడున్నరేళ్లలో టీడీపీ లక్ష 9వేల కోట్లు అప్పు చేసింది. వంద రూపాయల అప్పుకు వంద ఆస్తి ఉంటే సేఫ్టీ. వంద రూపాయల అప్పుకు 150 ఆస్తి ఉంటే ఇంకా సేఫ్టీ. కానీ ఇప్పుడు వంద రూపాయలకు అప్పుకు రూ. 46 రూపాయల ఆస్తి మాత్రమే ఉంది. 1994లో బాబు ముఖ్యమంత్రయ్యే నాటికి వంద రూపాయల అప్పుకు ఆస్తి 151 రూపాయలుండేది.  2004లో బాబు  దిగిపోయేటప్పటికి వంద అప్పుకు 46 రూపాయలు మాత్రమే ఉంది. 2004 నుంచి 2014కు వైయస్ఆర్, రోశయ్య, కిరణ్ ప్రభుత్వంలో వంద అప్పుకు 103 ఆస్తి చేయడం జరిగింది.  1991లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మన అప్పు 21 శాతం ఉండేది. బాబు తొమ్మిదేళ్లలో దాన్ని 32 శాతానికి పెంచాడు. 2004 నుంచి 2014కు వచ్చేనాటికి అప్పటి ప్రభుత్వాలు దాన్ని 22కు తగ్గించాయి. 1956 నుంచి బాబు వచ్చేనాటి దాక రెవెన్యూలోటు అన్నదే ఎరుగదు.  బాబు తన తొమ్మిదేళ్ల పాలనలో 22వేల కోట్ల రెవెన్యూ లోటు ఇచ్చారు. 2004 నుంచి 2014కు వచ్చేనాటికి రెవెన్యూలోటు పూడ్చేది కాకుండా 11వేలు రెవెన్యూ ఆధిక్యత పెట్టాడు. ఆనాడు అప్పు చేయకుండానే, రెవెన్యూ లోటు లేకుండానే శ్రీశైలం, నాగార్జున సాగర్ లు కట్టారు. 

వైయస్ఆర్ హయాంలో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కట్టారు. కానీ బాబు వాటిని ఓర్వలేదు. ఆనాడు వైయస్ఆర్ పూర్తి చేసిన 90శాతం కెనాల్ ను వాడుకుంటూ, మిగిలిన పదిశాతం పూర్తి చేసేదానికి ఇంత లోటు చూపిస్తున్నారంటే బాబు పరిపాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.  బాబు వ్యవస్థ అంతా భయాందోళన కూడే పరిస్థితి. రూ. లక్ష 9వేల కోట్ల అప్పులో 46వేల కోట్లు మాత్రమే వాడారు. మిగిలిన 63వేల కోట్లు రెవెన్యూ లోటు పూడ్చేదానికి వాడారు. మాట్లాడితే ఎంఏ ఎకనామిక్స్, నాకు పీహెచ్ డీ ఇచ్చారు, నా అంత ఎక్స్  పర్ట్స్ లేరు, నేను బస్సులో పడుకుంటాను. పూరి, ఉప్మాతింటానని బాబు మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని ఏమార్గంలో తీసుకుపోతున్నారంటే ఇవన్నీ చెబుతున్నారు. ప్రజలు అమాయకులు, వీరికి లెక్కలన్నీ అర్థం కావు,  ఏం చెప్పినా వింటారని ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. లెక్కలతో సహా  మా నాయకుడు వస్తే బాబు తట్టుకోలేక అభివృద్ధికి ఆటంకమని బురదజల్లుతున్నాడు.  స్థూల ఉత్పత్తి పెరిగితే ఆదాయం పెరుగుతుందని ఇంటర్ పిల్లోడని అడిగినా చెబుతాడు. కానీ బాబు మాత్రం ప్రతి రోజు స్థూల ఉత్పత్తి పెరుగుతుంది, దేశంలోనే నంబర్ వన్ అంటారు. మరోపక్క, ఆదాయం లేదని చెబుతాడు. ఇది భావ్యమేనా...?

 బాబు అన్నీ అనవసర ఖర్చులు పెడుతున్నాడు.  పట్టిసీమకు 1600కోట్లు  పెట్టారు.  దీంట్లో వేయి కోట్లు దుబారా అయిందని కాగ్ రిపోర్ట్ లోనే ఉంది. దుబారా జరిగిందని మేం చెబితే ప్రాజెక్ట్ లకు అడ్డం అని మాట్లాడుతారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం అన్నీ టెంపరరే. విచ్చలవిడిగా ప్రజాధనం దుర్వనియోగం చేస్తున్నారు.  నా అంత రాజధాని ఎవరూ కట్టలేరంటూ టర్కీ, సింగపూర్, మలేషియా అంటూ అన్ని దేశాలు తిరిగివచ్చారు. ఇప్పుడు మళ్లీ రాజమౌళి, బోయపాటి శ్రీనుల డిజైన్లు అంటున్నారు. వెలగపూడిలో 4 బిల్డింగ్ లకు వేలకోట్లు ఖర్చు చేశారు. వర్షం పడితే పైన ఉండే నీళ్ల కంటే లోపల నీళ్లు ఎక్కువగా కనబడుతున్నాయి. జీవో 22 తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు ఎక్కువ రేట్లు ఇచ్చి ముడుపులు తీసుకొంటున్నారు. జీవో 22 మీద 2014 నుంచి కట్టడంలో ఉన్న ప్రాజెక్ట్ లకు ఎంత పేమెంట్ ఇచ్చారంటే అది చెప్పరు. మేం వాస్తవాలతో ప్రభుత్వ అవినీతిని ఎండగడుతుంటే....అభివృద్ధికి అడ్డమని బాబు అభాండాలు వేస్తున్నారు. ఈ ప్రభుత్వం  జలాన్ని కూడ భోంచేస్తోంది. 

టీడీపీలో చేరలేదు మద్దతిస్తున్నానని బుట్టా రేణుక చెబుతోంది. బాబులో అనుభవం ఉందని వెళ్లిందట. మరి మీరు సాధారణ గృహిణి నుంచి  వైయస్సార్సీపీ టికెట్ తరపున డైరెక్ట్ గాఎంపీ అయ్యారు. ఎన్నికలప్పుడు లేని అనుభవం ఆమెకు ఇప్పుడు గుర్తుకువచ్చిందా..? ఇప్పుడు సడన్ గా కనుక్కున్నారా. ఇదేనా అభివృద్ధి. ఎలక్షన్ అయిపోయాక వారం రోజుల్లోనే ఎస్పీవై రోడ్డి వెళ్లిపోయారు. కాంగ్రెస్ లో ఎంపీగా ఉన్నప్పుడు కనబడని అనుభవం ఆయనకు వారం రోజుల్లోనే కనబడిందట.  బాబుకు అనుభవం ఉన్నప్పుడు టీడీపీలో పోటీ చేయకుండా మా టికెట్ పై ఎందుకు పోటీ చేశారు. వైయస్సార్సీపీ సీటు నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించడం ఏమైనా మాట్లాడితే అభివృద్ధి అని మాట్లాడడం ప్రతి ఒక్కరికి బాగా అలవాటైపోయిందని బుగ్గన మండిపడ్డారు. పదవులకు  రాజీనామా చేయాలని ఫిరాయింపుదారులను డిమాండ్ చేశారు.  టీడీపీ తెలుగు ఎంపీ ఎమ్మెల్యేల సంక్షేమ పథకం అనే కొత్త పథకాన్ని చేపట్టిందని బుగ్గన ఎద్దేవా చేశారు. ఆర్థిక నష్టాలు, ఇబ్బందుల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలను  ఈ ఫథకంలో మనీ బ్యాక్ గ్యారంటీ స్కీమ్ కింద తీసుకుంటున్నారేమనని ఎద్దేవా చేశారు. 

2014-15 లెక్కల ప్రకారం చూస్తే  చూస్తే ఏపీకి 16వేల కోట్లు లోటు బడ్జెట్ అంతా బాబు సృష్టించిన కథ అని బుగ్గన అన్నారు. ఖర్చులు ముఖ్యమంత్రికి ముందే ఎలా తెలుస్తుంది. ఏపీకి మొదటి సంవత్సరం లోటు 4వేల కోట్లుంటే కేంద్రం భర్తీ చేశామని చెబుతోంది. 10వేల 500 కోట్లు ఇచ్చామని చెబుతోంది. ఇవి గాక వేయిన్నర వెనుకబడిన జిల్లాలకు, 2500 రాజధానికి, 2900పోలవరంకి ఇచ్చామని చెబుతున్నారు, ఇవన్నీ ఎక్కడపోయాయి. విభజన వల్ల కాదు అన్యాయం జరిగింది, బాబు చేసిన దోపిడీ వలన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఘంటాపథంగా చెబుతున్నాం. మేం వాస్తవాలను చెబుతున్నాం. ఏపీలో ఓ పౌరునిగా చెబుతున్నా. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మనం, మన పిల్లలు బతికేదెలా అనే బాధతో చెబుతున్నాం. మాట్లాడితే లోటు అంటారు. ఖర్చులు చెప్పమంటే చెప్పరు. విజయవాడ, తిరుపతి, విశాఖ ఎటువెళ్లినా  ప్రైవేటు హెలికాప్టర్ లో వెళ్లడమేంటని బాబును ప్రశ్నించారు.   వైయస్ఆర్ కూడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇండిగో ఫ్లైట్ లో ఎన్నోసార్లు ఫస్ట్ క్లాస్  లేనప్పుడు కూడ తిరిగారు. మనకన్నా బాగున్న మహారాష్ట్ర, కర్నాటక ముఖ్యమంత్రులే కమర్షియల్ హెలికాప్టర్ లో తిరుగుతుంటే బాబు మాత్రం ప్రైవేటు హెలికాప్టర్ లలో తిరుగుతున్నారు. వీటికి తోడు  హైదరాబాద్ లో, వెలగపూడిలో ఇంటికీ, ఆఫీసుకు కోట్లాది రూపాయలు దుబారా చేశారు. బాబు పెట్టే ఖర్చులన్నీ లెక్కేస్తే రైతు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అవుతాయి. బాబుది బ్లండర్, ప్లండర్ ల ప్రభుత్వం. ఈ పద్ధతి మానేయాలని బుగ్గన హెచ్చరించారు.

Back to Top