కోడి కత్తి కాదు..నారా కత్తి డ్రామా 

వైయస్‌ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి

వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనలో కుట్ర కోణం బయటకు వస్తుంది

నిందితుడికి బిర్యానీ పెట్టి విచారణ చేయిస్తారా?

రాష్ట్రంలోని ఎన్‌ఐఏను కూడా రాకుండా అడ్డుకుంటారేమో?

చంద్రబాబూ..చిల్లర రాజకీయాలు మానుకో..

ఓటుకు కోట్లు కేసులో దొరికి పోయిన చంద్రబాబు కేసీఆర్‌కు దాసోహం 

కేసీఆర్‌కు అనంతపురంలో స్వాగతం పలికింది మీ పార్టీ నేతలు కాదా

కేసీఆర్‌ యాగంలో మీరు పాల్గొనింది నిజం కాదా

ఓట్ల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు

పొత్తులు లేకుండా పోటి చేస్తామని వైయస్‌ జగన్‌ ఎప్పుడో చెప్పారు

హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో కుట్రకోణం త్వరలోనే బయటకు వస్తుందని వైయస్‌ఆర్‌సీసీ తాజా మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది కోడి కత్తి డ్రామా కాదని, నారా వారి కత్తి డ్రామా అని పేర్కొన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని విమర్శించారు. మదనపల్లిలో ఎమ్మెల్యే తిప్పారెడ్డి పంపిణీ చేస్తున్న గోడ గడియారాలపై చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన అరగంటలోనే డీజీపీ ప్రెస్‌మీట్‌ పెట్టి వైయస్‌ఆర్‌సీపీ అభిమానే చేశారని, నిందితుడు ఎస్సీ కులస్తుడని చెప్పారన్నారు. ఆయన కింద పని చేసిన పోలీసులు కూడా అవే చెబుతారని ఏ సమాన్యుడికైనా తెలుస్తుందన్నారు. సిట్‌ కార్యాలయానికి తాళం వేసి ఇది కోడికత్తి డ్రామా అన్నారని, కానీ ఇది నారా కత్తి డ్రామా అన్నారు. కుట్రదారులుందరూ కూడా జవాబు చెప్పాలన్నారు. ఇంతపెద్ద కుట్ర కోణం జరిగితే ఒక లెటర్‌ ఉందని సాయంత్రం చెప్పారన్నారు. అందులో కూడా నాలుగు విధాలుగా చేతిరాతలు ఉన్నాయన్నారు. ఈ ఘటనలో శ్రీనివాస్‌ తప్ప మరొకరిని అరెస్టు చేయలేదన్నారు. నిందితుడికి బిర్యానీ పెట్టి ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు డైరెక్షన్‌లో జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఎన్‌ఐఏ విచారణలో నిజాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నామన్నారు.

ఏపీకి సీబీఐ, ఐటీ అధికారులు వస్తే మేం సహకరించమని చంద్రబాబు చెప్పారని, రేపుపొద్దున ఎన్‌ఐఏకి కూడా సహకరించమంటారేమో అన్నారు. హైకోర్టు విషయంలో కూడా ద్వంద్వ ప్రమాణాలు అవలంభించారన్నారు. ఈ కేసులో కుట్రకోణం వెలుగులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం స్థాయి మరిచి ప్రభుత్వ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెట్టి చిల్లరగా మాట్లాడారన్నారు. మదనపల్లి ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఆగస్టు మొదటి నుంచి ఇంటింటా ప్రచారం చేస్తున్నారన్నారు. గడిగాయం వెనుక కేసీఆర్‌ ఫోటో ఉందని చిల్లరగా మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. తిప్పారెడ్డి సొంత డబ్బుతో గడియారాలు పంపిణీ చేస్తుంటే, సప్లైయర్‌ ఏదో తప్పు చేస్తే దాన్ని భూతంలో పెట్టి విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు.

అనంతపురంలో జరిగిన పరిటాల శ్రీరామ్‌ వివాహ వేడుకలకు హాజరైన కేసీఆర్‌ను మీ పార్టీ నేతలు అధికారికంగా ఆహ్వానించింది మరిచిపోయారా అని ప్రశ్నించారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది నిజం కాదా అన్నారు. కేసీఆర్‌ను  అమరావతి శంకుస్థాపనకు పిలిచింది వాస్తవం కాదా? కేసీఆర్‌ యాగానికి వెళ్లి పట్టు వస్త్రాలు ఇచ్చింది నిజం కాదా అన్నారు. ఏ కార్యాలయం కూడా నిర్మించకుండా రాత్రికి రాత్రి అమరావతికి పారిపోవడానికి అవసరం ఏమొచ్చిందన్నారు. ఓటుకు కోట్లు కేసులో మీరిచ్చిన డబ్బులు ఎవరివని ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డి ఇచ్చింది మీ డబ్బు కాదా? ఆంధ్రలో లూటీ చేసిన డబ్బు కాదా అన్నారు. హరికృష్ణ శవం వద్ద పొత్తు కోసం ప్రయత్నం చేసింది మీరు కాదా అన్నారు. శవాన్ని పెట్టుకొని రాజకీయాలు చేయడం మీకే అలవాటు అన్నారు. మీ స్వప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించింది నిజం కాదా అన్నారు. 2014లో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ అని ప్రచారం చేసింది మీరు కాదా అన్నారు. ఈ మధ్య మీ అవసరాల కోసం కాంగ్రెస్‌ను కలుపుకొని, మీపై ఎక్కడ కేసులు బయటకు వస్తాయో  అన్న భయంతో కాంగ్రెస్‌తో జట్టు కట్టారన్నారు. జూన్‌లో కాంగ్రెస్‌ పార్టీ మీపై చార్జీషిట్‌ అంటూ పుస్తకాన్ని విడుదల చేసిందని గుర్తు చేశారు. ఐదు నెలల వ్యవధిలోనే మీరు, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయడం మీ నిజాయితీ ఎంటో తెలుస్తుందన్నారు. కుమ్మక్కు రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని విమర్శించారు.

ఓటుకు కోట్లు కేసులో భయపడి మీరు కేసీఆర్‌కు వణికిపోతున్నది నిజం కాదా అన్నారు. పొత్తులు లేకుండా మేం పోటీ చేస్తామని మా నాయకుడు ఇప్పటికే చెప్పారన్నారు. అదే పంథా కొనసాగిస్తామన్నారు. మీ పాత పేపర్లు తిరిగేసుకుంటే మోడీతో ఉన్న ఫోటోలు బయటకు వస్తాయన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీని అదే పార్టీలో కలిపింది నిజం కాదా అన్నారు. ఓట్ల కోసం ఏ స్థాయికైనా దిగజారుతారన్నారు. తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫోటోతో ఓట్లు అడిగింది వాస్తవం కాదా అన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌లకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 
 

 

Back to Top