కాసేప‌ట్లో ఏపీ కేబినెట్ భేటీ

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కాబోతోంది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, సమగ్ర భూ సర్వేపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం వైయ‌స్ జగన్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కీలక నిర్ణయాలను తీసుకోనుంది. ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం ఈ నెల 25న ముహూర్తం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంపై కేబినెట్‌ ప్రధానంగా చర్చించనుంది. వరుసగా రెండో విడత మళ్లీ  వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన జగనన్న అమ్మ ఒడి పథకం కింద అర్హులైన తల్లులకు రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గ సమావేశంలో అమోదించనున్నారు.

అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, కార్యక్రమ విజయవంతంపై మంత్రులు చర్చించనున్నారు. ఇది ప్రతిష్ఠాత్మక కార్యక్రమం కావటంతో ప్రభుత్వం దీనిని ప్రతీ జిల్లాలో పండుగ తరహాలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందు కోసం జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు కేటాయించనున్నారు. ఈ నెల 21 నుంచి సమగ్ర భూ సర్వే ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సమగ్రంగా భూముల సర్వే చేయనుంది. దీంతో ఈ రెండు కార్యక్రమాలపైనా కేబినెట్‌ చర్చించనుంది.  

 

ఆమోదించనున్న అంశాలు:
►ఆంధ్రప్రదేశ్‌  పర్యాటక పాలసీని ఆమోదించనున్న కేబినెట్‌
►6 జిల్లాల్లో వాటర్‌షెడ్‌ల అభివృద్ధి పథకం అమలుకు ఆమోదం తెలపనున్న కేబినెట్‌
►ఏపీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్
►సర్వే అండ్‌ బౌండరీ చట్ట సవరణకు ఆమోదం తెలపనున్న కేబినెట్‌
►రైతు భరోసా మరో విడత చెల్లింపులపై చర్చించే అవకాశం ఉంది. 

Back to Top