బాబు కలలో కూడా జగన్ నామస్మరణ ఏనుగుకు కూడా అందరిలాగే పడుకోవాలని ఉంటుంది. కానీ కలలో సింహం కనపడితే గుండె ఆగిపోతుంది. చావుకంటే నిద్రలేకపోవడమే నయం అన్నది ఏనుగు సిద్ధాంతం. తెలిసినవారు, తెలియని వారు దీనినే `` సింహస్వప్నం `` అంటున్నారు. కలలో సింహం కనబడి ఎన్ని ఏనుగులు చనిపోయాయి ? సింహం కలలో కనపడ్డం వల్లే ఫలానా ఏనుగు చనిపోయిందని ఖచ్చితంగా చెప్పడానికి ఏ ప్రమాణాలను పాటిస్తారు ? లాంటి చిల్లర మల్లర ప్రశ్నలకు ఇప్పుడెక్కడ సమాధానాలిస్తారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాబుకు కంటిమీద కునుకు లేదు. ఆత్రేయ చెప్పిపోయాడు కూడా. ``..... కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది...కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటుంది....`` అని. దాంతో కునుకు తీస్తే ఎక్కడ కలలొస్తయో? ఆ కలలో ప్రతిపక్ష నాయకుడు జగన్ వస్తాడని బాబు బజ్జోవడం మర్చిపోయారు. శాస్త్రమెప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కళ్లు మూయకుండా కునుకు తీసే వారుంటారు. పగటి కలల్లో పండుగ చేసేకునే వారుంటారు. నిన్న చెప్పింది ఈ రోజు చెప్పలేదనే వారుంటారు. అన్నటికీ వైద్యం ఉంది. శాస్త్ర పరిభాష ఉంది. కానీ చాలా మంది పట్టించుకోరు. బంగారంలా పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో ఉండమంటే (ఓటుకి కోట్లు కేసులో ఇరుక్కొని ఒప్పందం చేసుకొన్న వెంటనే) వద్దు వద్దంటూ వెళ్లిపోయింది నారా బాబే- దానికి జగన్ ఏమి చేస్తారు?కష్టాల్లో ఉన్న దిక్కులేని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు- పదిహేనేళ్లు కావాలి అని కళ్లెగరేస్తూ, వేలు పెట్టి చూపుతూ అడిగింది బాబే - దానికి జగన్ ఏమి చేస్తారు ? ప‌్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ ఓట్లు చీలకుండా బాబును సి.ఎం చేయడానికి ఉపయోగపడ్డ కాన్సెప్టు వారు - సమాధానాలతో సంతృప్తి పడి మురిసిపోతుంటే - జగన్ ఏమి చేస్తారు? కాపులకు రిజర్వేషన్ తో కాపు కాస్తామని అధికారంలోకి వచ్చాక బి.సీ లతో చిక్కొస్తోందని మొహం చాటేసింది బాబే - దానికి జగన్ ఏమి చేస్తారు ? ముద్రగడ దీక్షతో ప్రభుత్వం, అధికార పార్టీకి దిక్కుతోచకపోతే - దానికి జగన్ ఏమి చేస్తారు? మెడకాయ మీద తలకాయ ఉన్న వారికెవరికైనా ఇవన్నీ సులభంగా అర్థమవుతాయి. అయితే అర్థం కాకూడదన్నదే బాబు ప్రయత్నం. అధిక వడ్డీలతో అధికార పార్టీ తమ్ముళ్లు కాల్ మనీ సెక్సు రాకెట్ కు పాల్పడి అతివల మానప్రాణాలు హరించినా, ప్రధాని మోదీ రెండు చెంబుల్లో నీళ్లో, మట్టి చల్లి వెళ్లి పోయినా, పుష్కరం మెట్లమీద షూటింగ్ మోజులో బాబు పుణ్యాన మామూలు జనం ప్రాణాలు గాలిలో కలిసినా, చేతిలో చెయ్యేసి రుణమాపీ చేస్తానని చెయ్యక పోవడం వల్ల రైతుల ఊపిరి ఆగిపోతే - దానికి జగన్ ఏమి చేస్తారు? రాజధానిలో టవర్లు కట్టడానికి ఇటుకలు కొని, త్యాగాలు చేసి, పిల్లల హుండీ డబ్బులు కూడా నా హుండీలో వెయ్యండి అంటూ బీద అరుపులు అరిచే బాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడానికి మాత్రం ఒక్కొక్కొరికి 20,30 కోట్లు ఖర్చుపెడతారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు - పాలనతో అవినీతి అక్రమాలు, వైఫల్యాలు బయటపడకుండా జగన్ వల్లే ఏవేవో అయిపోతున్నాయన్న చిత్రాన్ని ప్రచారంలో పెట్టాలన్నది బాబు వ్యూహం. చేయాల్సిన చెత్త పనులన్నీ తానే చేస్తున్న చంద్రబాబు... ఫలితాన్ని మాత్రం వైయస్ జగన్ అకౌంట్లో వేయాలని తెగ తాపత్రయ పడుతున్నారు. పిల్లి కూడా కళ్లుమూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడ్డం లేదని అనుకుంటుంది.