ఉత్సవాలూ... ఊరేగింపులూ 

ఉత్సవాలు ఊరికే చేస్తారేంటి? ఊరంత పందిరీ, ఊరంతా రాండ్రీ అని పిలిచి చేస్తున్నారంటే ఏదో జరుగుతోందనేగా అర్థం. ఉత్సవాలన్నాక ఊపూ గీపూ అంటూ ఉండాలి. అంతేగానీ ఉసూరుమని ఉండకూడదు. అందుకే ఉప్పు పంచినా, పప్పు పంచినా, చెక్కిచ్చినా, హ్యాండిచ్చినా ఉత్సవమే. అవసరమైతే మొన్నట్లా అడపాదడపా సన్మానాలు, సత్కారాలు వంటి సత్క్యార్యాలు కూడా జరిపించేయాలి. పాలాభిషేకాలు, పేడ అభిషేకాలు జరిపించేసుకోవాలి. మళ్లీ మళ్లీ రావు పండగలు పబ్బాలు. వాటికెలాగూ ఉంటాయి మన డప్పు కొట్టే డబ్బాలు. కానీ ఇవి ప్రత్యేకం. ఎండాకాలంలో మంచినీళ్లలాగా ఎన్నికల కాలంలో హామీల ఉత్సవం జరుగుతూనే ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజూ పండుగే అంటూ పూటకో ఫెస్టివల్ జరిపలేదా? కొత్త యువమంత్రిగారు చెప్పినట్టు జయంతికి వర్థంతికీ తేడాలేకుండా వేడుకలు జరిపి, రికార్డింగ్ డాన్సులు పెట్టలేదా??!!  గాలి మాటలకు తగ్గట్లు వేడి గాలి బుగ్గలు ఆకాశంలో వదిలి చప్పట్లు కొట్టించలేదా!!?! కాస్తలో తప్పింది కానీ విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ కూడా చేసుంటే ప్రపంచవ్యాప్తంగా ఏపీలో జరిగే ఉత్సవాల పేరు మారుమోగిపోయేది.  ఒరిగేదీ తరిగేదీ ఏంటనే లెక్కలు జనాలు అడగడం మానేస్తే, మిగిలేది మనదేదీ అనే లెక్కలు పెద్దలు చూసుకుంటారు. ఇహ ఉత్సవాల్లో ఉత్సాహం కొద్దీ ఏమైనా విపత్తులు జరిగితే అందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమో, అధికారుల అసమర్థతో, వీవీఐపీల వ్యవహారమో కారణమని మాత్రం అనరాదు. అయినా ఇంకెన్నిరోజులీ భోగం, వైభోగం...మూన్నాళ్ల ముచ్చట...మూణ్ణెళ్ల మోసపుచ్చుట...అంతేగదా...ఆనక మిగిలేది ఉత్సవం తర్వాత జరిగే ఊరేగింపే. ఆ ఊరేగింపు చివరిమజిలీ నిమజ్జనం అని మళ్లీ చెప్పాలా ఏంటి? అందుకు సరైన చోటు కృష్ణా తీరమా, సముద్రగర్భమా అన్నది ప్రజాభీష్టం. అభిమానుల ఇష్టం. 
 

Back to Top