పొద్దు తిరుగుడు



’ఓ...రామన్నా..యాటికి పోతన్నావ్‌...’ 
’నేన్యాటికి పోతానప్పా...ఆ చేనుకాడ ఏదో పంచాయితీ పెట్టారంట. ఆ సెంద్రయ్య ఆడ దూరాడంట. ఆయప్ప గానీ దూరాడంటే...దూరిన కొంపకు నిప్పుపెట్టినట్టే బాబు...అందుకే ఆయాసపడుతూ పరుగులు పెడుతున్నా...నువ్వు కూడా రాకూడదా...బాలన్నా, తోడుంటవ్‌.
’నువ్వంతగా పిలవాలప్పా...పద పద నేనూ వస్తా... ఆ సెంద్రయ్య దూరాడంటే కనిపెట్టుకుని వుండాల్సిదే...’
’అదేందో బాలన్నా...ఆ సెంద్రయ్య కథ అర్థమయ్యే సావదు. తన కొంప, తనోళ్లు తప్పా ...అవకాశం దొరికితే ఊరంతటికీ అగ్గిపెట్టాలని చూస్తానే వుంటాడు. ఇట్లా వాళ్లని ఊర్నుంచి ఎలేసేన ఏమీ కాదప్పా. కోప్పడితే ఆ కాసింత సేపు కాళ్లు పట్టుకుంటాడు. కాళ్ల దగ్గర కూర్చుని మాట్లాడతాడు. ఇంత సందించి యామారామా...దూరిపోతాడు. కాళ్లుగుంజేస్తాడు. భలేటోడు..ఊరికి సీడలా పట్టుకున్నాడు...’
’యాడ బాధపడతావులే రామన్నా...ఆయప్ప కథ ఈ నాటిదా...పిల్లనిచ్చిన మామనే ఏం చేశాడో నీకు తెలవదా? బామ్మర్దులను దొడ్లో పశువుల్ని కట్టేసినట్టు కట్టేసుకున్నాడు? ఉండేది ఒకటే ఒకడు లింగులిటుక్కుమంటూ...ఆడికి ఊరంతా దోసిపెట్టాలనే సూస్తాన్నాడు కానీ...మంచి చెడ్డా అనేది ఏమన్నా వుందా మనిషికి? భూమీద పుట్టామంటే పుట్టామనుకుంటే సరిపోద్దా? బతుక్కు ఒక్క నీతి వుండాలప్పా...అది లేకుంటే గొడ్డుకు, మనిషికి తేడా ఏందుంటాది?’
’ ఏందో నప్పా ఆయప్ప కథ. అరవయి ఎనిమిదేళ్లయిపోయా. సన్నప్పటి నుంచి చూస్తానే వున్నా. ఆయప్ప కథే అర్థం కాకుండా వుంది. ఎవుడితో ఎప్పుడు బాగుంటాడో తెలీదు. ఎవడి కొంప ఎప్పుడు ముంచుతాడో తెలీదు. ఊర్లో జనం కాడికి వచ్చేసరికి..ఆడ కథలు, ఈడ కథలు చెప్పి...నమ్మించేస్తాడు. మనలాంటోళ్లు నోరెళ్లబెట్టి విన్నంతసేపు పట్టదు..మన నోట్లో దుమ్ముకొట్టి పోయాడని తెలుసుకోవడానికి. కానీ ...భలే బతికేస్తున్నాడప్పా...వాడి వీడి పేరు చెప్పుకుని...ఏం మడిసో..’
’ ఎంత యాష్టపోయినా ఆయప్ప కథ అంతేకానీ..పదప్ప... ఆచేనుగాడ ఎవడి కొంపకు ఏమి చిచ్చుపెడుతున్నాడో....’
’ఓహో...రామన్నా,బాలన్నా ఈడికి భలే వచ్చినారే...రండన్నా, రండి...ఈడ ఏం జరుగుతోందో తెలుసా...’
’నువ్వున్న కాడ యాదో వకటి జరగకుండా ఎట్లా వుంటాదిలేప్పా...ఈ చేను కాడ పంచాయితీ పెట్టద్దు లేప్పా...అందరికీ తెలుసు. ఓబులేసూ..నువ్వెన్నయినా చెప్పు ఈ చేను యాదిరెడ్డన్నదే. ఆయప్పా...ఆయప్ప నాయన ఎట్లా బతికేనోళ్లప్పా. నువ్వు...రిజిస్ట్రార్‌ ఆఫీసులో రికార్డులు మార్చేసుకుని వచ్చి నాదంటే లోకం వప్పదప్పా.. యాదన్న విషయంలో ఊరంతా ఒకటవుతుంది. నేను గుండెమీద చెయ్యేసి చెబుతున్నా...ఈ సెంద్రయ్య మాటలు విని...ఆడబిడ్డలున్న యాదన్నకు ద్రోహం చేయాలని చూస్తే...ఊరంతా ఉమ్మేస్తాది.. .ఆ తర్వాత నీ ఇష్టమప్పా...అప్పుడు మేము చేసేది కూడా ఏమీ వుండదు...సెంద్రయ్యను నమ్ముకుంటావో..న్యాయం పక్క వుంటావో నువ్వే తేల్చుకో....’
అంత ఆవేశంగా సెబుతావేంది రామన్న. ఏదో పెద్ద మనిషిగా రమ్మంటే వచ్చినా. నామీద పడతావేంది. ఓబుళేసు నీ మేలుకోసం వచ్చినా. అన్నోళ్లు కాదంటున్నారు. నన్నే అన్నాయంగా మాట్లాడుతున్నారు. నాకేమొచ్చిందిలేప్పా...ఢిల్లీకాడికే ఫోను చేసేటోడిని. ఈ ఊరి పంచాయితీ నాకెందుకు. అప్పుడు దూరమయినా..మా వాళ్లతో ఇప్పుడు కలిసిపోతానప్పా...నేను ఢిల్లీకి పోతానప్పా...’
’సెంద్రయ్య పోతే పోయావుగానీ...ఢిల్లీకి కాకపోతే..సింగపూరుకు పోప్పా...ఇట్లా ఇక్కడుండి ఊరికి చేటు తేవద్దప్పా’
’పైకి మెత్తగా కనపడతావు గానీ రామన్నా...ఏదన్నా చెప్పాలనుకుంటే మాత్రం గట్టిగానే సెబుతావప్పా. నాది కూడా అదే మాట సెంద్రప్పా. ఢిల్లీకి కాకపోతే యాటికన్నా పోయి నీ ఆటలాడుకో. ఊర్లో మాత్రం వద్దప్పా. ఇప్పటికే నీ దయతో ఊరు ముక్కలైంది. నీవు ఆడే∙వుండిపోతే...ఊరు బాగుపడుతుంది...’
ఏంప్పా...బాలన్నా నువ్వు కూడా గట్టిగా మాట్లాడతాండావే. ఢిల్లీకి పోయిరానీ సెబుతా. ఏందో మీలాంటోళ్లను ఉద్దరిద్దామనుకుంటే...ఊరంతా పట్టుకొస్తామంటారు. అది అయ్యేపనేనా..అందర్నీ వుద్దరించడం. ఆ రామన్నకు ఈ రోజుకు పంటేయాలంటే..అప్పులకోసం తిరగాల్సిందే. నీ కథ సెప్పేదేముంది...మీసాలు తిప్పుతూనే వుంటాడు. కడుపులో  ఎంత బాధుంటాదో నాకు తెల్వదా? నేనైతే మీలాగా వుండలేనప్పా...
నేను ఢిల్లీకి పోతా...సింగపూరూ పోతా...ఊరోళ్లను ఉద్దరించాలని చూస్తాపోతే...నా కొడుక్కి విమానమాడ కొనిస్తా...’
’కడుపులో మాట దాచిపెట్టకుండా చెప్పావు పో సెంద్రయ్యా...పాపం ఓబుళేసు గాడి దగ్గర ఏమన్నా కొట్టేసినావేమో...అదిచ్చిపో...వాడ్నెందుకు రెంటికీ చెడ్డ రేవడి చేస్తావు...’
’సర్లేప్పా రామన్నా నీ మాటలు ఇన్నవే గానీ...సెంద్రయ్యా...సెంద్రయ్యా అని దొరికినప్పుడల్లా నాలుగు మాటలు అంటానే వుంటావు...’
ఆడున్న పొద్దుతిరుగుడు తోటలోని పూలన్నీ ...సీకటి పడుతోందనో, సెంద్రయ్య మాటలినో...సిగ్గుతో తలలు వాల్చేశాయి. 
 

తాజా వీడియోలు

Back to Top