తిరుపతి : ప్రజల భూములను అక్రమంగా కబ్జా చేసే భూకబ్జాదారులపై కఠినంగా వ్యవహరిస్తామని వైయస్ఆర్‌సీపీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి హెచ్చరించారు. “నేను ఉండగా ఒక అంగుళం భూమిని కూడా ఆక్రమణకు గురికానివ్వను… ఖబడ్దార్!” అంటూ భూకబ్జాదారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భూకబ్జాదారుల వేధింపులకు గురైన బాధితురాలు తులసమ్మకు అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజల ఆస్తులపై కన్నేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. సామాన్య ప్రజల హక్కులను కాపాడేందుకు వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజానికి పాల్పడే వారిపై చట్టపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. “ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే రౌడీల తాట తీస్తాం” అంటూ హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.