అనంతపురం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో 23 నెలల్లోనే రూ.3.61 లక్షల కోట్లు అప్పు చేశారని.. ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు తెలియజేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం అనంతపురంలోని హెచ్‌ఎల్‌సీ కాలనీలో ఉన్న వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే రూ.10 లక్షలు చేశారంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డాయి. వైయస్ఆర్‌సీపీఐదేళ్ల పాలనలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, డీబీటీ ద్వారానే రూ.2.73 లక్షల కోట్లు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. నాన్ డీబీటీతో కలుపుకుంటే రూ.4.58 కోట్లు ప్రజలకు లబ్ధి కలిగిందన్నారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక 23 నెలల్లోనే రూ.3.61 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు సూపర్‌సిక్స్ హామీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పి.. ఇప్పుడు గత ప్రభుత్వంలో అమలైన పథకాలను కూడా నిలిపివేశారన్నారు. సూపర్ సిక్స్‌లోని నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీని కూడా అమలు చేయలేదన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ వ్యవస్థ పూర్తిగా నీరుగారిపోయిందని, నెట్‌వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పుగా తెచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే వైయస్ఆర్‌సీపీని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పోలీసు శాఖను అడ్డుపెట్టుకొని పరిపాలన సాగిస్తోందని, ప్రజా సమస్యలు బయటకు రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్నా జిల్లాలో రైతాంగ సమస్యలపై ప్రజాప్రతినిధులు కనీస సమీక్ష కూడా నిర్వహించడం లేదన్నారు. హంద్రీనీవా కాలువను 11 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరించాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 780 అడుగుల నుంచే రోజుకు 7 టీఎంసీలకు తెలంగాణ తీసుకెళ్తోందన్నారు. 11 వేల క్యూసెక్కులతో హంద్రీనీవాను విస్తరిస్తే 40 రోజుల్లో 40 టీఎంసీలను తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. 2012 నుంచి కృష్ణా జలాలు వస్తున్నా ఆయకట్టుకు నీరందించలేని పరిస్థితి ఉందన్నారు. తక్షణం ఆయకట్టును స్థిరీకరించి 3.50 లక్షల ఎకరాలకు నీరందించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, జిల్లా కేంద్రమైన అనంతపురంలోనే శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. అమరావతి చంద్రబాబుకు క్రెడిట్ కార్డుగా మారిందని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు తాత్కాలిక సచివాలయం, హైకోర్టు పేరుతో నిధులు దోపిడీ చేశారని, ఇప్పుడు కూడా అమరావతిలో అభివృద్ధి పేరుతో దోపిడీ కొనసాగుతోందన్నారు. అమరావతి మాత్రమే కాకుండా వెనుకబడిన ప్రాంతాల వైపు కూడా చూడాలని సూచించారు. అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఎండిపోతున్న పంటలకు రక్షకతడులు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 70 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కుటుంబాలకు రూ.7 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరారు. కేంద్ర నిధులు వెనక్కి వెళ్లకుండా చూడండి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం నగరంలో కేంద్ర ప్రభుత్వ సహకారం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రూ.310 కోట్లతో పంగల్ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు నాలుగు లైన్ల విస్తరణ చేపట్టినట్లు అనంత వెంకటామిరెడ్డి తెలిపారు. బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తి చేశామన్నారు. కొన్ని చోట్ల భూసేకరణకు సంబంధించి మొదట్లో కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి గడ్కరీ, ఇతర అధికారులను కలిసి ఒప్పించామని తెలిపారు. ఇందులో భాగంగా టవర్ క్లాక్ వద్ద సర్వీస్ రోడ్డు, సప్తగిరి సర్కిల్ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.40 కోట్లు మంజూరు చేయించుకొచ్చినట్లు తెలిపారు. ఎన్నికలకు ముందే టవర్ క్లాక్ వద్ద సర్వీస్ రోడ్డు పూర్తి చేశామని గుర్తు చేశారు. అయితే ఎన్నికల తర్వాత సప్తగిరి సర్కిల్ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు. రెండేళ్లయినా పట్టించుకునే వారు లేరన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మంజూరు చేసిన నిధులు వెనక్కువెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ విషయంపై గతంలోనే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎన్‌హెచ్ అధికారులుతో తాను మాట్లాడినట్లు చెప్పారు. పనులు చేపట్టి నిధులు వెనక్కి వెళ్లిపోకుండా చూస్తామని అధికారులు చెప్పినా ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు చొరవ తీసుకుని ఉన్న నిధులు వినియోగించి అభివృద్ధి పనులు చేయాలని కోరారు.