ఆన్ లైన్ బాబు

చంద్రబాబు గ్రామాల పర్యటనకి వెళ్లాడు
కూరగాయలమ్మే అవ్వదగ్గరకెళ్లి "కిలో వంకాయలెంత?" అని అడిగాడు
బాబును చూసి అవ్వ జడుసుకొని "ముప్పయి రూపాయలు సార్" అని చెప్పింది.
వెంటనే బాబు డెబిట్ కార్డ్ తీసి ఇచ్చాడు. అవ్వ దాన్ని ఎగాదిగా చూసింది.
"ఏందిసార్, ఇది ఆధార్ కార్డా?" అని అడిగింది
"నీ దగ్గర స్వయిప్ మిషన్ లేదా?" అని బాబు గర్జించాడు
"నాకు సోప్ అలవాటు లేదు సార్, స్నానానికి సున్నిపిండి వాడుతా" అని చెప్పింది అవ్వ
"అందుకే గ్రామాలన్ని వెనుకబడిపోతున్నాయి. ఈ కార్డుని గోకడానికి ఒక మిషనుంటుంది. అది తెలియదా?"
"ఓహో, దురదొస్తే ఈ కార్డుతో గోక్కోవాలా? నాకు గోళ్లున్నాయి సార్ గోటితే పోయేదానికి కార్డెందుకు చెప్పు"
"అయ్యో, అవ్వా, నీకు ఆన్ లైన్ తెలియదా?"
"సెలైన్ తెలుసు, మొన్న జ్వరమొస్తే పెట్టినారు. క్యూలైన్ తెలుసు పాత ఐదొందలు నోటు మార్చడానికి పోస్టాఫీస్ ముందర నిలబడినాను. ఈ ఆన్ లైన్ ఏంది స్వామీ?"
"ఆన్ లైన్ వుంటే డబ్బులివ్వక్కర్లేదు, తీసుకో అక్కర్లేదు"
"డబ్బులు ఇయ్యాల్సిన పనిలేదా? అయితే తొందరగా ఆ లైన్ లో నన్ను నిలబెట్టండి"
బాబు తలగోక్కొని ఆన్ లైన్ అంటే నిలబడే లైన్ కాదు. అది బ్యాంక్ అకౌంట్ అన్నాడు
"బ్యాంకిలు నాకెందుకు సామీ, ఏ రోజు బియ్యం ఆ రోజు కొనుక్కొని తిని బతికేదాన్ని"
అందుకే ఇలా చెట్టుకింద వున్నావు. వెంటనే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చెయ్యి. ఇలాంటి కార్డు ఇస్తారు
"ఈ కార్డుంటే ఆకు వక్క, కొనుక్కోవచ్చా?"
'ఏమైనా కొనుక్కోవచ్చు"
"అయితే తొందరగా తీసియండి సామీ'' 
నేను తీసిచ్చేది కాదు. నువ్వు డబ్బు కట్టి బ్యాంకులో అకౌంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇస్తారు
"అదేదో సామెత చెప్పినట్టు, డబ్బులే వుంటే ఇట్లా చెట్టుకింద ఎందుకుంటా సారూ. తిండి గింజలకే డబ్బులు లేకపోతే బ్యాంకులు డబ్బులు కట్టాలా?" అని బండ బూతులు తిట్టింది
"ఈ ప్రజలకి ఏమీ అర్థం కాదు అన్నాడు" బాబు పిఏతో 
"వాళ్లకి అన్నీ అర్థమైతాయి. కానిది మీకే. వెనకటికి రైతుల్ని మరిచి కంప్యూటర్లు అని అరిచి పదేళ్లు ప్రతిపక్షంలో వున్నారు. ఇప్పుడు గాడి తప్పిన పాలనని లైన్ లో పెట్టకుండా, ప్రజలకి క్యూలైన్ కష్టాలు తప్పించకుండా ఆన్ లైన్, ఇ పాస్, ఇంటర్నెట్ అని అరుస్తున్నారు. 
జనానికి కావాల్సింది ఇంటర్నెట్ కాదు, ఇంట్లోకి బియ్యం. అయినా నేనో సలహా చెబుతా వినండి. వెంటనే మంచి కుర్చీకి ఆర్డరివ్వండి" అన్నాడు పీఏ.
"కుర్చీ ఎందుకు?" అడిగాడు బాబు
"త్వరలోనే ప్రతిపక్షంలో కూర్చోడానికి"
Back to Top