నారా వాకిట్లో నయీం చెట్టు

చాలా కాలమైందని... మీడియా సంపాదకులందరినీ  గెట్ టుగెదర్ కి పిలిచారు చంద్రబాబు నాయుడు.
అందరూ కూడా   చంద్రబాబు చెప్పిన స్టార్ హోటల్ కి వచ్చి చేరారు.
అందరూ కూర్చున్నాక చంద్రబాబు వచ్చారు. అందరినీ పేరు పేరునా పలకరిస్తూ.. షేక్ హ్యాండ్ ఇస్తూ ..చిరునవ్వులు చిందిస్తున్నారు బాబు.
ఇంతలో ఓ  టీవీ చానెల్   అధిపతి చంద్రబాబు దగ్గరకు వచ్చి ఓ బొకే ఇచ్చారు.
చంద్రబాబు సుతారంగా దాన్ని తీసుకుని..బలవంతంగా ఓ నవ్వు నవ్వి...ఏంటి విశేషం? అని అడిగారు.
దానికా అధిపతి  ఏంటంటారేంటండీ..మీకు తెలీదా ఏంటి?  పి.వి.సింధు రజిత పతకం సాధించింది కదా. అప్పట్లో మీరు క్రీడారంగానికి చేసిన సహాయ సహకారాల వల్లనే కదా..గోపీ చంద్ అకాడమీ పెట్టారు. గోపీ చంద్ అకాడమీ పెట్టారు కాబట్టే కదా సింధు అక్కడ చేరింది.
సింధు అక్కడ శిక్షణ తీసుకుంది కాబట్టే కదా ఆమె రజిత పతకాన్ని సాధించింది. అంటే ఇది మీరు నాటిన విత్తనమే కదా అందుకే ఈ బహుమతి మీకోసం అన్నాడా చానెల్ అధిపతి. చంద్రబాబు నాయుడు బాగా సంతోషించారు.
నిజం చెప్పారు బ్రదర్. మనం ఇపుడు కష్టపడితే దాని ఫలాలు ఎప్పటికో ఒకప్పుడు వచ్చి తీరతాయని నమ్ముతాను నేను. అందుకోసరమే ఆనాడు... గోపీ చంద్ అడగ్గానే అయిదెకరాలు ఇచ్చాను అన్నారు.
ఇంకో ఎడిటర్ కల్పించుకుని అవునండీ సిఎం గారూ..మీరా రోజున అయిదెకరాలూ ఇవ్వకపోతే గోపీ చంద్ అకాడమీయే ఉండేది కాదు. కానీ దాని కోసం అయిదు కోట్లు ఇమ్మనమని మీరు ఓ రాయబారిని పంపించి అడిగారని రెండు మూడు రోజుల నుంచి లోకమంతా కోడై కూసేస్తోందండీ అన్నారు.
చంద్రబాబు నొచ్చుకుని.. ఓ మంచి పని చేసినపుడు ఇలాంటివి సహజమేలే అన్నారు మొకం  కోపంగా పెట్టుకుని.
చంద్రబాబు బాధపడ్డారని గమనించిన మరో ఎడిటర్.. జోక్యం చేసుకుని అయిదు కోట్లు తీసుకుంటే మాత్రం.. ఆ అయిదెకరాల విలువ దానికి ఎన్నో రెట్లు ఎక్కువే ఉంటుంది కదా? గోపీ చంద్ అయినా  ఆ మాత్రం కృతజ్ఞత లేకుండా అయిదు కోట్లు అడిగిన సంగతి లీక్ చేయడం కరెక్ట్ అనిపించడం లేదు అన్నారు.
దానికి చంద్రబాబు చాలా ఆనందించారు.
టీవీ ట్రిపుల్ నైన్  అధినేత  ఆకాష్  లేచి.. మీరు   ముఖ్యమంత్రిగా ఉండగా ఐటీ రంగంలో చేసిన కృషి వల్లనే కద సార్.. ఈరోజు మైక్రో సాఫ్ట్ కంపెనీకి సత్యనాదెళ్ల సిఇవో కాగలిగారు అన్నారు.
ఆకాష్ మాటలకు చంద్రబాబు ప్రసన్న హృదయుడై ప్రశాంతంగా నవ్వారు.
ఆకాష్ వెనకనే ఉన్న మరో టీవీ చానెల్  ఎడిటర్ కి ఆకాష్ కాకా నచ్చలేదు. వీడికి రాజ్యసభకి వెళ్లిపోవాలని ఉన్నట్లుంది. ఊరికే వీపు గోకేస్తున్నాడు. వీడికే ఇంతుంటే మరి నాకెంత ఉండాలి? అని లోలోనే అనుకుని పళ్లు పట పట కొరికాడు.
రాజకీయాలకు అతీతంగా ఉండే మరో ఎడిటర్ లేచి  ఈ నయీం    సంగతేంటండీ బాబూ. వీడు జగత్ కిలాడీలా  ఎంత దోచేశాడో?  ఎన్ని హత్యలు చేశాడో? వీడ్ని తగలెయ్యా.. వీడు మామూలు మడిసి కాదండీ బాబూ అన్నాడు.
చంద్రబాబుని అమితంగా అభిమానించే ఓ యువ ఎడిటర్ లేచి.. మరదే  చంద్రబాబుగారి  ప్రజ్ఞ అంటే.  సింధులు.. సత్య నాదెళ్లలే కాదండోయ్.. అసలు చంద్రబాబుగారే లేకపోతే  నయీం   ఎక్కడి నుంచి  వచ్చేవాడు? నక్సలైట్లను దెబ్బ తీయడానికి చంద్రబాబు గారే నయీమ్  ను వాడుకోమని పోలీసులకు చెప్పారు. ఆ పని అయిపోయాక నయీమ్ ను  రియల్ ఎస్టేట్ దందాలకు వాడుకున్నారు. చంద్రబాబు  ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే నయీం  అంత పెద్ద   సామ్రాజ్యానికి నాయకుడు కాగలిగాడు. ఆ మాటకొస్తే దావూద్ ఇబ్రహీం కన్నా కూడా నయీమే  గొప్పోడు. మరి అంతటి గొప్పోణ్ని తయారు చేసిన చంద్రబాబు ను మాత్రం ఎవరూ మెచ్చుకోవడమే లేదు. మెచ్చుకోవడమే కాదు..కనీసం గుర్తించడమే లేదు అని ఆగ్రహంతో కూడిన ఆవేదనతో ఆక్రోశం వ్యక్తం చేశాడు.
ఎవరంటేనూ భయం లేని ఓ ముసలి ఎడిటర్  బయలు దేరడానికి లేచి నిలబడి నారా వారి వాకిట్లో నయీం  చెట్టన్నమాట అని వెటకారంగా నవ్వేసి కదిలారు.
చంద్రబాబు నాయుడు బిగుసుకుపోయారు.
Back to Top