<br/><br/>ఓ మత్రాల మాను ఉంది. దానికి బోలెడన్ని మాయలు తెలుసు. చంద్రబాబు స్వయంగా నీళ్లుపోసి పెంచి పెద్ద చేసిన చెట్టది. బాబుగారి కోరికలన్నీ ఆ చెట్టుకిందే తీరతాయి. ఇదేదో పల్లెల్లో పొద్దున్నే పొగాకునములుతూ ఇత్తడిచెంబుచ్చుకుని వెళ్లే చెట్టు కాదట. బాబుగారి ఆశలు, కలలు తీర్చే మహిమాన్వితమైన చెట్టన్నమాట. మరి ఈ చెట్టు ఏం చేస్తుంది...?? ఎలా ఉపయోగపడుతుంది?? దీనివల్ల లాభాలేమిటీ?చూద్దాం....విశాఖ మహానగరం నాలుగున్నరేళ్లుగా బోలెడన్ని టెక్కులు చూస్తోంది. దేశ విదేశీ ప్రతినిధులెందరికో ఆతిథ్యం ఇస్తోంది. అంటే ఎపిలో ఎ1 సిటీ కనుక ఆ మాత్రం ఉంటుందనుకోండి. అయితే ఈ టెక్కులన్నీ నగరం మొత్తానికీ కాదుమరి. నోవోటెల్ లాంటి తారాసౌధాలకే పరిమితం. మరి బాబుగారి కలలు, కల్పనలు, ఆశలు, ఆడంబరాలు తీరేవన్నీ అలాంటి చోటే కదా!! మూణ్ణాళ్ల కోసారి బాబుగారికి ముచ్చట గొల్పినప్పుడు రకరకాల టెక్కుల పేర్లు గుర్తొస్తాయి. అగ్రిటెక్కు, టెక్-2017 లాగే ఈఏడాది కూడా ఫిన్ టెక్ సదస్సు టిప్పటాపుగా జరుగుతోంది. ఇక్కడే ఉందీ మంత్రాల మర్రి చెట్టు. అయితే విశాఖలోని ఫైస్టార్ హోటల్లో ఉన్న ఈ చెట్టుకిందే నిల్చుని చంద్రబాబు గారు అమరావతి గొప్పలు కథలు కథలుగా చెబుతున్నారు... న్యాయనగరం, క్రీడానగరం, వినోద నగరం, ఆనందనగరం, ఆశ్చర్యనగరం ఇలా రకరకాల నగరాల్లో మేలిముత్యంలా అమరావతి మెరుస్తుంది అంటున్నారు. విశాఖ నగరంలో ఉండి అమరావతి నగరం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అక్కడికొచ్చిన అంతర్జాతీయ అతిథులెవ్వరూ అడక్కపోవడం ఆ మంత్రాల మాను మహిమవల్లే అనుకోవాలి. పెట్టుబడుల సదస్సులు, పారిశ్రామిక సదస్సులు, వ్యవసాయ సదస్సులు, వాణిజ్యసదస్సులు, చివరకి ఫుడ్ సదస్సులు, విహారసదస్సులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా సదస్సులు విశాఖలో ఉత్సవంలా జరిగాయి. ప్రతి ఉత్సవం ఓ అనుభవం విశాఖ వాసులకు. అయితే ఇన్ని అనుభవాలు ఎదురైనా విశాఖలోని నోవోటెల్ కు, అమరావతిలోని కన్వెన్షన్ సెంటర్లకు తప్ప రాష్ట్రానికో, ఆ నగరాలకో, ప్రజలకో పావలా లాభం చేకూరలేదు. ఇంతకీ విశాఖలోని ఈ సదస్సులకు బాబుగారి మంత్రాల మానుకూ గల కనెక్షన్ చెప్పుకోవాలిగదా??విషయం ఏమిటంటే ఎన్ని సదస్సులో మన ముఖ్యమంత్రిగారు రాష్ట్రం రెండంకెలభివృద్ధి, టెక్నాలజీ ప్రపంచంలోనే గొప్పది అంటూ చెప్పుకొస్తున్న విషయాలు ఒక్కసారైనా మనకు అనుభవంలోకి రావడం లేదు కదా? కనీసం ఫిన్ టెక్ సదస్సులో చంద్రబాబు నిల్చున్న ఫిన్ టెక్ వృక్షం అయినా ఆయన చెప్పిన అబద్ధాలను నిజం చేస్తుందేమో అనే ఓ కోరిక.