'గోడమీద బాబు'' సినిమా..!

నాలుగున్నరేళ్లుగా  తన పాలనతో ఆంధ్రప్రదేశ్ ను స్వర్గధామం చేశానంటూ ఎంత బాకా ఊదినా జనం నమ్మలేదు. ఇక లాభం లేదు అనుకుని... తప్పు నాది కాదు, నేను అభివృద్ధి చేద్దామన్నా కేంద్రం సహకరించడంలేదు అని కొత్త పల్లవి అందుకున్నాడు. కేంద్రంతో తెగదెంపుల నాటకం రక్తికట్టించడానికి విశ్వప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఏం చేసినా ప్రజలదగ్గర వర్కవుట్ కావడంలేదనుకున్నాడో ఏమో.. బాబు కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టాడు. నిన్నమొన్నటివరకు చంద్రన్నకానుక పేరుతో తన బొమ్మను జనం చేతిలో సంచిమీద వేసి, భుజాన బరువులా వేలాడేసిన చంద్రబాబు, ఇప్పుడు ఏకంకా ఊళ్లో గోడలన్నీ తనదైన రంగులతో నింపేయాలని కంకణం కట్టుకున్నాడట. అందుకే... ''నేను చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఊరూ మాట్లాడుకోవాలి. అలా చేయాలంటే మీరు ఊరూరూ తిరిగి గోడలమీద మన గొప్పతనం గురించి బ్రష్ లు అరిగిపోయేలా రాయించండి'' అంటూ అధికారులను ఆదేశించాడట. ఏ ఊరికెళ్లి ఏం రాయాలో.. ఏం రాస్తే జనం ఏం చేస్తారో అర్థంకాక వాళ్లంతా జుట్టు పీక్కుంటున్నారట. 
ఎందుకంటే...?
అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదో రాయాలి.
నిరుద్యోగులకు నాలుగున్నరేళ్లుగా చిల్లిగవ్వకూడా భృతి ఎందుకివ్వలేదో రాయాలి.
బ్యాంకుల్లో బంగారం ఇంకా ఇంటికి ఎందుకు రాలేదో రాయాలి.
పోలవరంలో అవినీతి ఎన్ని కోట్లో రాయాలి. 
రాజధాని అమరావతి ఎక్కడుందో, అక్కడ ఒక్క ఇటుక కూడా ఎందుకు పడలేదో రాయాలి. 
రైతులనుంచి లాక్కున్న భూములు, ఇవ్వని వారిపై చేసిన దౌర్జన్యాలు రాయాలి.
అవినీతిలో ఎపి నెంబర్ 1 అవ్వడానికి ఎంతగా కృషి చేశారో రాయాలి.
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లకు కొన్నారో రాయాలి.
... అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఊళ్లలో ఉన్న గోడలు, ఉత్పత్తి అయిన రంగులు కూడా సరిపోవు బాబుగారి పాలన బాగోతాన్ని లిఖించడానికి.
అందుకే పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్లకు చేతనైన అబద్ధాలు రాసేస్తే ఈజీగా అయిపోతుందని భావిస్తున్నారట.
అందుకే ఊరూరూ తిరిగి తమవాళ్ల గోడలు ఎక్కడెక్కడున్నాయో.. వాటి ఎత్తు వెడల్పు ఎంతుందో ముందు కొలుచుకుని వద్దాం అని అధికారులు అనుకుంటున్నారట. ఒకవేళ తమకు అనుకూలంగా ఉన్నవాళ్ల ఇంటికి గోడలేకపోతే వెంటనే భారీగా కట్టించి... ఆ తర్వాత రంగులేసి రాద్దామని తీర్మానించుకున్నారట. ఒకవేళ ఇల్లే లేకపోతే.. లోపలున్న గుడెసె కనబడనంత ఎత్తు గోడ కట్టేసి తమ పని కానిచ్చేద్దామని నిర్ణయానికి వచ్చారట. 
అదీ మేటరు.
అంటే ఇక ఊరూరా గోడలమీద బాబుగారి సినిమా ఆడబోతుందన్నమాట.


Back to Top