రూట్ క్లియర్

చంద్రబాబు విదేశీ పర్యటనలకు బయలు దేరారు. వల్డ్ మాప్ లో వివిధ దేశాలను చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలో సెలెక్ట్ చేసుకునేముందు ఎందుకు వెళ్లాలో కూడా డిసైడ్ చేసుకోవాలి గదా అనుకున్నారు. లేదంటే మీడియా ప్లస్ సోషల్ మీడియా రాతలతో ఏకి, ఈకలు పీకి కానీ విడిచి పెట్టదని చంద్రబాబుకు తెలుసు. కాసేపు గడ్డం బరుక్కుని ఆలోచించాడు. ఒకె ఇలా చెబుదాం అని డిసైడ్ అయ్యాడు. కారణాలు సెలక్ట్ అయిపోయినాయి, ప్రయాణాలే ఖరారు కావాలి అనుకున్నాడు. 
పెద్ద గ్లోబును తెప్పించాడు. దాన్ని సర్రున రెండుసార్లు తిప్పాడు. గిర్రున గుండ్రంగా తిరగడం మెదలెట్టాక వేలితో ఒక చోట ఆపాడు. ఎస్ ఇక్కడికి వెళదాం ముందు అనుకున్నాడు. 
అధికారులను పిలిచాడు. తన విదేశీ ప్రయాణానికి ఏర్పాట్లు చేయమన్నాడు. అక్కడ ప్రముఖులతో సమీక్షలు, సమావేశాలు, చర్చలు, చిట్ చాట్ లు అరేంజ్ చేయమన్నాడు. తన పర్యటన వివరాలు చెప్పేందుకు అర్జంట్ గా మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టమన్నాడు. 
ప్రెస్ మీట్ లో కూర్చున్నాడు బాబు. మిత్రులారా రాష్ట్ర శ్రేయస్సుకోసం 28 గంటలూ కష్టపడుతున్నాను. రాజధాని కోసం నా చెమటను చిందిస్తున్నాను. తెలుగు నేలను అభివృద్ధి చేయడానికి దేశదేశాలూ తిరగబోతున్నాను అన్నాడు.
మీరు దేశాలు పట్టుకు తిరగితే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది సర్…అడిగారు విలేకరులు.
అయిన వెళితేనే కదయ్యా రాష్ట్రం అభివృద్ధి చెందేదీ…ఉన్నన్నాళ్లూ కాదు అన్నాడు ఇంకో విలేకరి గుసగుసగా.
ఈలోపు చంద్రబాబు గొంతు సవరించుకున్నాడు.
నాకు తెలుసు మీరిలాంటి చచ్చు పుచ్చు ప్రశ్నలేస్తారని. అందుకే ప్రిపేరయ్యే వచ్చా. ముఖ్యంగా మూడు ముఖ్య విషయాల గురించి ఈ విదేశీ టూర్లు సారీ పర్యటనలు చేయదలిచాను.  
పెట్టుబడుల ఆకర్షణ కోసం సోమాలియాకు వెళ్లబోతున్నా.
రాజధాని నిర్మాణం ఖరారు చేయడానికి ఇస్లామాబాద్ వెళ్తున్నాను.
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుందామని అంటార్కిటికా వెళుతున్నాను.
రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఆ విధంగా ముందుకు పోతాను చెప్పాడు బాబు.
నిరుడే కదా పెట్టుబడులు తెస్తాను అని  రష్యా, కజకిస్తాన్ వెళ్లారు ఒక్క సంస్థైనా వచ్చిందా అడిగాడో విలేకరి.
పెట్టుబడులు ఆకర్షించడానికి స్విడ్జర్ లాండ్ వెళ్లారు కదా ఆకర్షించారా అడిగారు ఇంకొకరు.
చైనా, సింగపూర్, లావోస్ పర్యటనల ఫలితాలేమిటి మరొకరి సూటి ప్రశ్న.
దిక్కులు చూశాడు చంద్రబాబు. 
అవి వర్కౌట్ అవలేదనే కదా సారు మళ్లీ ప్రయాణాలు చేస్తున్నారు అని చెప్పి ప్రెస్ మీట్ కి పులిస్టాప్ పెట్టేశారు అధికారులు.
 జామ్ జామ్ అని స్పెషల్ ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయాడు చంద్రబాబు.

Back to Top