సా...అంటే సాలు ..ఒళ్లు మండిపోద్ది

సచివాలయంలోని తన ఛాంబర్ లో కూర్చుని పేపర్లు చదువుతున్నారు చంద్రబాబు నాయుడు.
అంతలో అచ్చెంనాయుడు వచ్చాడు. నమస్తే సార్ అన్నాడు. చంద్రబాబు ఒక్క సారిగా ఉలిక్కి పడి..అచ్చెంనాయుడిపై ఒంటికాలిపై లేచారు. ఇంకో సారి ఆ  మాట అన్నావంటే ఛంపేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అచ్చెంనాయుడు బిక్క చచ్చిపోయాడు. తానేం తప్పు మాట్లాడానా అని ఒకటికి పది సార్లు మనసులోనే నెమరు వేసుకున్నాడు. ఎక్కడా తప్పు అనిపించలేదు. మరి సారేంటి ఇలా విరుచుకుపడ్డారు అనుకున్నాడు.
రెండు నిముషాలు ఆగి.. అది కాదు సార్...అని చాలా సౌమ్యంగా పలకరించబోయాడు..ఈ సారి చంద్రబాబు మరింత కోపంగా ..ఎన్ని సార్లు చెప్పాలి నీకు..అలా పిలవద్దని అని అరిచినంత పని చేశారు.
అచ్చెంనాయుడికి ఏం మాట్లాడాలో  తెలీక నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఓ మూలకి పోయి కూర్చున్నాడు.
రెండు నిముషాల తర్వాత మరో మంత్రి వచ్చాడు.ఆయన్ని చూడగానే చంద్రబాబు నాయుడు ..ఆ ఫైలు పని ఎంతవరకు వచ్చింది? అని అడిగారు.
దానికా మంత్రి సాయంత్రానికల్లా అయిపోతుంది సార్ అన్నాడు.
చంద్రబాబు మొహం కందగడ్డలా ఎర్రగా మారిపోయింది. ఇంకోసారి అలా మాట్లాడావంటే మంత్రి పదవి కాస్తా పీకి పారేస్తా అని వార్నింగ్ ఇచ్చారు.
మంత్రిగారికి షాక్ కొట్టినట్లయింది. 
ఇపుడు నేనేమన్నానని ఇలా కోపగించుకున్నార్రా దేవుడా అని మనసులోనే అనుకుని ఓ పక్కకి పోయి కుర్చీలో కూర్చున్నారు.
చంద్రబాబుకి చికాగ్గా ఉంది.
సచివాలయం నుంచి హోటల్ కిపోతేనే కాస్త రిలీఫ్ గా ఉంటుందని లేచి హోటల్ కి బయలు దేరారు.
కొంత దూరం వెళ్లాక ఓ పెద్దాయన ఫోను చేసి మా అమ్మాయి సంగీత విభావరి ఉందండి ఓ సారి ఫలానా థియేటర్ కి రండి అని పిలిచారు.
సరేలే అనుకుని చంద్రబాబు నాయుడు ఆ థియేటర్ కి వెళ్లారు.
అక్కడ  ఆ అమ్మాయి సా..రీ..గా..మా..పా.. అంటూ  రాగయుక్తంగా అందుకుంది.
చంద్రబాబు నాయుడు తన పక్కనే బాంబు పడ్డట్టు ఉలిక్కి పడ్డారు.
ఇంకో సారి ఈ వెధవ పాట పాడావంటే నిన్నీ రాష్ట్రంలో మళ్లీ పాడకుండా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి కోపంగా తన కారు వైపు బయలు దేరారు.
ఆ అమ్మాయి భయపడిపోయింది.ఆమె తండ్రికి ఏం జరిగిందో అర్ధం కాక ఇంచుమించు పిచ్చి పట్టినట్లయింది.
హోటల్ కి వెళ్లిపోయారు చంద్రబాబు. డీలక్స్ సూట్ లో భార్య భువనేశ్వరితో కూర్చుని హైదరాబాద్ విశేషాలేంటి అని ప్రశాంతంగా అడిగారు.

" ఏం ఉందండీ.. నిన్న  ఏమీ తోచకపోతేనూ సాలార్ జంగ్ మ్యూజియానికి వెళ్లాను. చాలా బాగుందండీ ..ఇంకో సారి మనం ఇద్దరం వెళ్దాం " అన్నారు భువనేశ్వరి.
చంద్రబాబు వణికిపోయారు.
నీక్కూడా బుద్దిలేదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇంకో సారి ఇలా మాట్లాడావంటే పుట్టింటికి పంపించేస్తా  జాగ్రత్త" అని సీరియస్ అయిపోయారు. ఎక్కడా ప్రశాంతంగా ఉండనివ్వరు అని తనలోనే గొణుక్కుని చిట పట లాడుతూ బెడ్ ఎక్కి కళ్లు మూసుకుని విశ్రాంతిలోకి జారుకున్నారు.
భువనేశ్వరికి భయం వేసింది.
ఏంటిది? ఎన్నడూ లేనిది ఈయన ఇలా కోపంగా మాట్లాడ్డమేంటి? అయినా నేనేం తప్పు మాట్లాడానని? అని తనలోనే తర్కించుకుని కంగారుగా ఫ్యామిలీ డాక్టర్ కీ..లోకేష్ బాబుకీ ఫోన్లు చేసి అర్జంట్ గా రమ్మనమన్నారు భువనేశ్వరి.
డాక్టర్ , లోకేష్ వచ్చారు. జరిగిందంతా చెప్పి ఈయనకి ఏదో తేడా చేసింది. ఏమైందో అర్ధం కావడం లేదు మీరే చూడాలి అని డాక్టర్ తో చెప్పుకుని భోరున విలపించారు.
డాక్టర్ కి జాలేసింది. మీరేం కంగారు పడకండమ్మా నేను చూస్తా కదా...అని చెప్పి లోకేష్ ను తీసుకుని పక్కగదిలోకి వెళ్లారు.
మీ నాన్న గారు ఈ రోజంతా ఏమేం చేశారో ఎవరెవరితో ఏమేం మాట్లాడారో  తెలుసుకుని చెప్పండి అన్నాడు డాక్టర్.
లోకేష్ వెంటనే  అచ్చెంనాయుడికి ఫోన్ చేసి నాన్నగారు ఇవాళ మీతో ఏమన్నా మాట్లాడారా ? అని అడిగాడు.
అచ్చెంనాయుడికి హుషారొచ్చింది. హమ్మయ్య అనుకుని అవును లోకేష్ బాబూ. నమస్తే సార్ అన్నానంతే నాపై కారాలూ మిరియాలూ నూరేశారు అన్నాడు.
తర్వాత.. అన్నాడు లోకేష్ బాబు.
తర్వాతేముంది బాబూ.. ఇంకో మంత్రి తో కూడా ఇలాగే జరిగింది. ఆయనేదో పని చెబ్తే సాయంత్రం చేస్తానన్నాడు అంతే ఆయన పైనా మండి పడ్డారు అన్నాడు.
అంతలోనే  ఓ పెద్దాయన వచ్చి లోకేష్ బాబును కలిసి అయ్యా మావల్ల ఏమన్నా తప్పు జరిగి ఉంటే క్షమించమనండి కానీ..ఏ తప్పూ చేయకుండానే మీ నాన్నగారు మా అమ్మాయి పై సీరియస్ అయిపోయారు అని జరిగిందంతా చెప్పారు.
అందరు చెప్పింది విన్న డాక్టర్ కీ ఏమీ అర్ధం కాలేదు.
వెంటనే ఓ మానసిక వైద్యునికి ఫోను చేసి జరిగిందంతా చెప్పి విషయం ఏంటంటారు అని అడిగాడు.
దానికి సైకాలజిస్ట్ నవ్వేసి  మరేం లేదు.. ఆయనకి సా  ..అన్న అక్షరం వినిపిస్తేనే ఒళ్లంతా భయంతో నిండిపోతోంది. అదే సమస్య అన్నాడు.
ఆ అక్షరమంటేనే ఎందుకంత భయం అని లోకేష్ బాబు అడిగాడు.
దానికి డాక్టర్  మరేం లేదు బాబూ..బహుశా మీ నాన్నగారి అక్రమాలు..మీ అక్రమాల గురించి రోజూ సాక్షి పేపర్ లోనూ సాక్షి టీవీలోనూ వస్తూ ఉంటాయి కదా. అందుకోసమే కదా సాక్షి టీవీని ఏపీలో బంద్ చేయించారు. సాక్షి టీవీ   ప్రసారాలను ఏపీలో ఆపేసినా ..డిష్ యాంటిన్నాలు ఉన్న ఇళ్లల్లో సాక్షి ప్రసారాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో ఏపీ ప్రభుత్వం చేస్తోన్న  దారుణాల గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇలా దేశ వ్యాప్తంగా తెలుగు వాళ్లందరికీ తన నిజ స్వరూపాన్ని తెలియ జేస్తోన్న సాక్షి మీడియా గ్రూప్ అంటేనే ఆయనకు భయంగానూ..కోపంగానూ ఉంది.
అందుకే  సా అంటే చాలు ఆయన వెన్నులోంచి భయం జర జర జారిపోతోంది. ఆ భయంలోంచే ఆయనలో కోపం తారాస్థాయికి చేరుకుంటోంది. అని వివరించాడు డాక్టర్.
మరి దీనికి మందులేదా అని అడిగాడు లోకేష్ బాబు.
డాక్టర్ ఒక్క నిముషం ఆలోచించి. 
రెండే మార్గాలు బాబూ.
మొదటిది తప్పులు చేయడం మానేయాలి.
రెండు సాక్షి పై అక్రమంగా విధించిన నిషేధాన్ని ఎత్తివేసి క్షమాపణ చెప్పేయాలి.
అపుడు ఈ సమస్య కొంతయినా తగ్గుతుంది. లేదంటే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది మానసిక జబ్బు. అని హెచ్చరించాడు.
లోకేష్ బాబు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు.

Back to Top