న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించి, కేంద్రానికి పంపిన "దిశ" బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలంటూ.. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి వైయస్ఆర్‌సీపీ మహిళా ఎంపీలు వినతిపత్రం అందజేశారు.బుధవారం న్యూఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో వారు మర్యాదపూర్వకంగా కలిసి దిశ చట్టంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో దిశ దిశా చట్టానికి అసెంబ్లీలో 2019 డిసెంబర్‌లో ఆమోద ముద్ర పడింది. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై నేరాలు చేసే వారికి ఈ చట్టం కింద 21 రోజుల్లో శిక్ష విధించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్టానికి కొత్త రూపంగా వచ్చిన దిశా చట్టానికి ఇప్పటికే ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టానికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉందని వైయస్ఆర్సీపీ మహిళా ఎంపీలు వంగా గీత, బీవీ సత్యవతి, జి. మాధవి, చింతా అనురాధ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కోరారు.