ఓటరు జాబితాలతో ఇంటింటికీ వైయస్ఆర్ కాంగ్రెస్

హైదరాబాద్ : సాధారణ ఎన్నికలకు ముందు ఓటరు జాబితాల్లో తమ పేరు ఉందో లేదో అన్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో భాగంగా అధికార దుర్వినియోగంతో ప్రతి నియోజకవర్గంలోనూ సగటున అయిదు నుంచి పదివేల వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ సానుభూతి పరుల పేర్లను అక్రమంగా తొలగించిట్లుగా ఆరోపణలు ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రెండు రోజులక్రితం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలను నియోజకవర్గాల వారీగా జిల్లా కార్యాలయాల నుంచి మండల స్థాయి వరకు అందచేయనున్నామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు ఈ నెల 17 వ తేదీ నుంచి పోలింగ్ బూత్ కన్వీనర్లతో సమన్వయం చేసుకుంటూ, తొలగించిన అర్హులైన వారి పేర్లును గుర్తించడం, తిరిగి వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పించే ప్రక్రియతోపాటు, అనర్హులైన వారి పేర్లను తొలిగించే వంటి చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆయన పేర్కొన్నారు.

అత్యంత కీలకమైన ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, రానున్న పక్షం రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యేట్లుగా చూడాలని ఆయన పార్టీ పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలకు సూచించారు. ఎన్నికల్లో అర్హులైన అందరి పేర్లు ఓటర్ల జాబితాల్లో ఉన్నాయో లేదో సరి చూసుకోడానికి ఇదే చివరి అవకాశమని ఆయన పేర్కొన్నారు.

Back to Top