కూటమి పాలనలో అధోగతిలో వ్యవసాయ రంగం

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం

రాయచోటిలోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి.

ఏడాదిన్నరలో రాష్ట్రంలో రైతు కన్నీరు పెట్టని రోజు లేదు

వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఉద్ధరింపు మాటలా? 

రైతన్నా మీకోసం.. అంటే చేసిన దారుణాలను మర్చిపోతారనా?

సూటిగా ప్రశ్నించిన జి.శ్రీకాంత్‌రెడ్డి

ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రైతులకు ఒక్క రూపాయి చెల్లించలేదు  

కిలో మామిడికి రూ.4 చొప్పున ఎంత మందికి చెల్లించారు? 

కేంద్రానికి లేఖలు రాసేసి వదిలేస్తే సరిపోతుందా?

దాంతో సమస్యలన్నీ పోయి, రైతులకు మేలు జరిగినట్లేనా?  

ప్రెస్‌మీట్‌లో సీఎంను నిలదీసిన జి.శ్రీకాంత్‌రెడ్డి  

రాయచోటి:  టీడీపీ కూటమి ఏడాదిన్నర పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా అధోగతి పాలైందని, సీఎం చంద్రబాబు వ్యవసాయ వ్యతిరేక విధానాలకు రైతన్న కన్నీరు పెట్టని రోజే లేదని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.     వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందే కాకుండా రైతన్నా మీకోసం.. పంచసూత్రాలు తీసుకొచ్చానని చెప్పినంత మాత్రాన చంద్రబాబుని ఎలా నమ్ముతారని రాయచోటిలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రశ్నించారు. అధికారులు, కూటమి ఎమ్మెల్యేల కాలర్‌ పట్టుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితం మొత్తం చూస్తే ఆయన ఎప్పుడు సీఎంగా చేసినా ఆ కాలమంతా రైతుల పాలిట శాపంగా మారుతోందని గుర్తు చేశారు.
    గడిచిన ఐదేళ్ల వైయస్‌ జగన్‌ పాలనలో వ్యవసాయం పండగలా సాగితే చంద్రబాబు సీఎం అయ్యాక దండగలా మార్చేశాడని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతుల పక్షాన ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మాట్లాడినప్పుడల్లా మొక్కుబడిగా కేంద్రానికి లేఖలు రాసేసి చేతులు దులిపేసుకోవడం తప్ప, రైతులకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. మామిడి రైతులకు ప్రభుత్వం తరఫున ప్రతి కిలోకు రూ.4 చొప్పున ఎంత మందికి చెల్లించారో వివరాలు వెల్లడించాలని కోరారు. మంగళవారం నాడు జగన్‌గారు, పులివెందులలో పర్యటించి, ఇటీవలి వర్షాలకు నేలమట్టమైన అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారని జి.శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు.
ప్రెస్‌మీట్‌లో జి.శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఒక్క రైతును ఆదుకున్న పాపాన పోలేదు:
    కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం పూర్తిగా అధోగతి పాలైంది. చంద్రబాబు రైతులను పూర్తిగా గాలికొదిలేశాడు. ఏడాదిన్నర పాలనలో ఏ ఒక్క రోజూ రైతులకు ఎలా మేలు చేయాలన్న ఆలోచన చేసింది లేకపోయినా, అన్నీ చేసేశామని చెబుతూ మభ్య పెట్టమని ఎమ్మెల్యేలను రైతుల వద్దకు పంపుతున్నాడు. 
    అన్నమయ్య జిల్లాలో ఖరీఫ్‌ రెండు సీజన్‌లు చూస్తే సాగు విస్తీర్ణం సాధారణంతో పోల్చితే కనీసం 10 నుంచి 15 శాతం కూడా సాగవ్వడం లేదు. పండ్ల తోటల పరిస్థితి చూస్తే ఇంకా ఘోరంగా ఉంది. మామిడి, టమాట, అరటి రైతులకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. చివరకు రైతులకు పెట్టుబడి సాయంలోనూ చంద్రబాబు మోసం చేశారు. రెండేళ్లలో ప్రతి రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.10 వేలు మాత్రమే కొందరు రైతుల ఖాతాల్లో జమ చేసి చేతులు దులుపేసుకున్నారు. కౌలు రైతులను ఈ ప్రభుత్వం అసలు రైతులుగానే పరిగణించడం లేదు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఆర్బీకే సెంటర్లు విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉండి ఆదుకుంటే ఇప్పుడు ధాన్యం కొనే దిక్కులేదు. తేమ శాతం పేరుతో దళారులు రైతులను దోచుకుంటున్నారు. 
    అప్పులపాలవుతున్న అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో వారు చెప్పిన ధరకు పంటలను తెగనమ్ముకోవాల్సిన దుస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. నాడు జగన్‌గారి పాలనలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సకాలంలో అందజేస్తే నేడు కనీసం యూరియా కూడా దొరకడం లేదు.  

ఏడాదిన్నరలో వ్యవసాయం విధ్వంసం:
    రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న విచక్షణ చంద్రబాబుకి లేదు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా రైతులను కష్టాలే పలకరిస్తున్నాయి. ఆయన సీఎంగా ఉన్నన్నాళ్లు రైతు కంట నిత్యం కన్నీరే. రైతులను ఆదుకోవడంలో అన్నివిధాలుగా విఫలమై కూడా అన్నీ చేసేసినట్టు ఆడంబరపు మాటలు చెప్పడం సిగ్గుచేటు. కనీసం కరువు మండలాల రైతులకు కూడా ఒక్క రూపాయి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చింది లేదు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో మాదిరిగా ఈ క్రాప్‌ జరగడం లేదు. ఉచిత పంటల బీమా ఊసే లేదు. ఆర్బీకే వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. అరటి రైతుల గోస ఈ ప్రభుత్వానికి అస్సలు పట్టడం లేదు.
    మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌  రైతుల కష్టాల గురించి మాట్లాడినప్పుడల్లా బొటాబొటిగా కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులిపేసుకోవడం తప్పితే, ఏడాదిన్నరలో ఏ ఒక్క రైతును ఆదుకోవడానికి ప్రయత్నించిన పాపానపోలేదు. ఇలాంటి వ్యక్తి రైతన్న మీకోసం.. అంటూ చేస్తున్న హడావుడి చేయడం చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. 

రాయచోటిలో ఆస్తుల విధ్వంసం, భూకబ్జాలు 
    రాయచోటిలో పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. ఖాళీ స్థలాలను దౌర్జన్యంగా కబ్జా చేసి లాగేసుకుంటున్నారు. రికార్డులు తారుమారు చేసి కొత్త డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. ఇదేమని అడిగితే బాధితులపై రౌడీయిజం చేస్తున్నారు. న్యాయం చేయమని కోరితే హేళనగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు అనే తేడా లేకుండా దోచేస్తున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ఎమ్మార్వో స్థాయి లేని వ్యక్తిని అధికారిగా నియమించి అడ్డగోలుగా భూముల దోపిడీ చేస్తున్నారు.
    మరోవైపు అధికారులను అడ్డం పెట్టి రాజకీయ కక్షలతో ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కూలగొడుతున్నారు. రాయచోటిలో ప్రైవేటు ఆస్తుల కూల్చివేతపై విచారణ జరిపించాలి. ఒక వంద మందితో రౌడీలు గ్యాంగ్‌గా తయారై రాయచోటిలో అలర్లు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. చివరకు పెళ్లిళ్లు కూడా ప్రశాంతంగా జరగనివ్వడం లేదని జి.శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.

Back to Top