తాడేపల్లి: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి మంత్రులు, పార్టీ నేతలతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..
- దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించి 13 ఏళ్లు అయినా ఈరోజుకు కూడా మన మధ్యనే ఉన్నట్లు భావిస్తున్నామంటే.. ఆయన అనుసరించిన పరిపాలనా విధానమే కారణం. కోట్లాది మంది హృదయాలలో మహానేత వైయస్ఆర్ గారు నిలిచి ఉన్నారు. ఖరీదైన వైద్యం పేదలకు అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచిపోయారు. వైద్యం అందుబాటులో ఉన్నా ఖర్చులు భరించలేక ప్రాణాలు పొగొట్టుకున్న దుస్దితి ఆరోగ్యశ్రీకి ముందు ఉండేది. ఆ పరిస్ధితిలో మార్పు తెచ్చారు. అదే విధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి వారి పరిస్ధితిలో మార్పు తెచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రైతుల పరిస్ధితిలో గణనీయమైన మార్పు కనిపించింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పేద విద్యార్ధుల పాలిట వరంగా మారింది. ఫీజు రీయింబర్స్ మెంట్ ఉపయోగించుకుని ఎందరో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత స్దితికి ఎదగగలిగారు. ఇవన్నీ కూడా నేటి వైయస్ఆర్ సీపీకి సిద్ధాంతంగా మారాయి. ఈ పథకం ద్వారా రేపు సత్య నాదెళ్ళ రావచ్చు. అబ్ధుల్ కలామ్ రావచ్చు. అంబేద్కర్ లు ఎంతమందైనా రావచ్చు.
ఒక చిన్న ఆలోచన అమలులోకి రావడానికి పది, ఇరవై ఏళ్లు పడుతుంది. ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేస్తే తర్వాత 20 ఏళ్లకు గానీ దాని ఇంపాక్ట్ కనపడలేదు. ఈరోజు శ్రీ వైయస్ జగన్ పరిపాలన చూస్తే మూడేళ్లలోనే 30 ఏళ్ల అభివృధ్దిని చూపగలిగారు. వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఆలోచనలు ముందుకు తీసుకువెళ్లడానికి పట్టుదలతో ఆయన రాజకీయ వారసుడిగా జగన్ గారు ముందడుగు వేశారు. వైయస్ఆర్ ను గుండెల్లో పెట్టుకున్నవారు జగన్ గారి వెంట నడుస్తున్నారు కాబట్టే సాధ్యమైంది.
- ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తీతువు పిట్టలు అరుస్తున్నాయి. దుష్టచతుష్టయం కడుపుమంట చూస్తే వింతగా ఉంది. సెప్టెంబర్ 1వ తేదీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైమ్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి మీడియాతో పంచుకున్నాడంట. ఈ మాట అనేందుకు సిగ్గుండాలి. చంద్రబాబు ఏ విధంగా సీఎం అయ్యాయడనేది ఈ తరంకు తెలియదని భావిస్తున్నాడు. తన మామ ఎన్టీఆర్ అత్యధిక మెజార్టీతో గెలిచివస్తే ఆయనపై కుట్ర పన్ని అడ్డగోలుగా వెన్నుపోటు పొడిచి దించేశాడు. ఆరోజు ఇదే రామోజీతో అసెంబ్లీని రద్దు చేస్తాడనే పుకార్లు సృష్టించి ఎంఎల్ఏలంతా చంద్రబాబు వెంట నడిచేలా చేశారు. అంతకుముందు చాలా తక్కువ మంది ఎంఎల్ఏలు చంద్రబాబుతో ఉన్నారు. ఆ పుకార్లతో ఎంఎల్ఏలను తనవైపు తిప్పుకుని దాదాపు వారిని బంధీలుగా చేసి, గవర్నర్ ను మేనేజ్ చేసి ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆరోజు వేమూరి రాధాకృష్ణ లేడు రామోజీ ఒక్కడే కొండమాదిరి అండగా నిలబడినాడు. ఔరంగజేబు ఏం చేశాడో తెలియదు కాని చరిత్ర చూస్తే ఓ వాక్యం చదువుతుంటాం. ఆయన నాన్నను జైలులో వేసి వచ్చాడని. ఈయన ఎన్టీఆర్ ను దించి ఏకంగా ఆయన చావుకు కూడా కారణమయ్యాడు.
- వ్యవస్థలను ఆనాడు మేనేజ్ చేసి టీడీపీ ఆస్తిని కాజేశాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. వెన్నుపోటు పొడిచి సీఎం అయింది సెప్టెంబర్ 1న అని చెబుతుంటే ప్రస్తావించాల్సి వస్తోంది. జగన్ గారు వైయస్ రాజశేఖరరెడ్డిగారి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్తూ వివిధ రకాల పథకాలు అమలు చేస్తూ దేశంలోనే ఓ మోడల్ గా, అన్ని రకాల అవకతవకలకు, రోగాలకు పరిష్కారం చూపిస్తూ పనిచేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారం కల్పించారు. శాశ్వత ప్రాతిపాదికగా పునాది వేశారు. చంద్రబాబు ఇతర శక్తులు కూడబలుక్కుని ప్రజలను వచ్చే ఎన్నికలలో మభ్యపెట్టి జగన్ గారిని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. దీనిని సీరియస్ గా గమనించాలి. సమాచార మాధ్యమాలను మేనేజ్ చేయడం ద్వారా వ్యవస్ధలను మేనేజ్ చేయడం ద్వారా మనపై మనకే అనుమానం వచ్చే రకంగా ప్రజలను లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. దుష్టచతుష్టయం అనండి, దత్తపుత్రుడుగా చెప్పుకుంటున్న మరోనేత కానీవ్వండి, వామపక్షాలను సైతం ఉపయోగించుకుని జగన్ గారిని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి తప్పించడానికి కుట్రపూరితంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. ఇది రోజూ గమనిస్తున్నాం. వీరి కుట్రలు పారవు.
చంద్రబాబు చేసింది మోసం. రాజధాని పేరుతో భ్రమను క్రియేట్ చేశారు. లక్షకోట్లు ఇచ్చి 2050 వరకు తనకు పవర్ ఇస్తే రాజధానిని పూర్తి చేస్తానని.. ఎవడో పూర్వం అన్నట్లు కొండ ఎత్తిపెడితే మోస్తానన్నట్లుగా సింగపూర్ క్రియేట్ చేస్తానని భ్రమ కల్పించాడు. వాస్తవాన్ని విస్మరించి అడ్డగోలుగా వెళ్లి ఎన్నికలలో చావు దెబ్బతిన్నాడు. ఆయనకు తెలిసిన ఆ విద్య ద్వారానే తిరిగి ప్రజలలో భ్రమలలోకి నెట్టాలని చూస్తున్నాడు. ఆయన పప్పులు ఉడకవు. కాని ఆ ప్రయత్నాలను కూడా సాగనీయకుండా మనం దెబ్బకొట్టాల్సిన అవసరం ఉంది. మన పథకాలు చూస్తే కోటి 40 లక్షలమందికి దాదాపు మూడేళ్లకాలంలో సుమారుగా లక్షా 70 వేల కోట్లు చేరాయి. పెన్షన్ చూస్తే 63 లక్షలు మంది అందుకుంటున్నారు. చంద్రబాబు తన హయాంలో ఈ విధంగా చేయగలిగాడా... విత్తనాలు, ఎరువులు దొరికేవా... బ్యాంకు లోన్లు రీపేమెంట్ చేయకపోతే రైతులు ఇబ్బందులు పడేవారు. పాఠ్యపుస్తకాలు కూడా దొరికేవి కాదు. ప్రజలతో సంబంధం లేని పాలన సాగించేవాడు చంద్రబాబు.
- వైయస్ రాజశేఖరరెడ్డి కోట్లాది మంది హృదయాలలో ఉన్నారు. వైయస్సార్ సిపి ప్రస్ధానం మరో వందేళ్లపాటు ఉండేలా జగన్ గారు పునాది వేశారు. అప్రతిహతంగా ప్రస్ధానం సాగుతుంది. ఇది పొగరుతో అనడం లేదు. ప్రజలతో మమేకమైతే ఏరకంగా అక్కున చేర్చుకుంటారనేది మనం రుజువు చేసుకున్నాం. ఇది ఇలాగే కొనగాలంటే గుంటనక్కల విషపూరిత ప్రచారాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి. అప్రమత్తంగా ఉండకపోతే మళ్ళీ ఆశక్తులది పైచేయి అయ్యే అవకాశం ఉంటుంది. మనం దాన్ని కూడా గుర్తుకుతెచ్చుకోవాలి. దీనిని శాశ్వతం చేయాలంటే వారి ప్రయత్నాలను దెబ్బకొట్టాలి. 2024 ఎన్నికలలో చంద్రబాబులాంటి దుష్టశక్తులకు దెబ్బకొడితే శాశ్వతంగా రాజకీయసమాధి కట్టవచ్చు.

రాష్ర్ట రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..
వైయస్ రాజశేఖరరెడ్డి గారి గురించి తెలిసి ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకు ఈరోజు ఘన నివాళులు అర్పిస్తారన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డితో పనిచేసినప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. నిజానికి వైయస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సమయంలో తాను కూడా అదే హెలికాప్టర్ లో ఉండాల్సిందన్నారు. ఆ సమయంలో తాను చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నానని రచ్చబండ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నప్పటికి టెక్కలిలో ఉపఎన్నికల ప్రచారం కోసం తనను వైయస్సే ఆగిపొమ్మని చెప్పారని వివరించారు. పేదల పట్ల వైయస్ ఆర్ కున్న అనుబంధం,కమిట్ మెంట్,వారి అవసరాలకు అనుగుణంగా పధకాలను అమలుచేసిన ఘనత ఆయనదేనన్నారు. అలాంటివారిని భవిష్యత్తులో చూడలేమని అన్నారు. అయితే ఆయన కుమారుడు శ్రీ వైయస్ జగన్ పేదలకు అండగా నిలబడ్డారన్నారు. వారి స్దితిగతులను జీవనప్రమాణాలను పెంచేందుకు అలుపెరగకుండా పనిచేస్తున్నారని వివరించారు. శ్రీ వైయస్ జగన్ కు అండగా నిలబడటమే మన కర్తవ్యం అని అన్నారు.
రాష్ర్ట దేవాదాయ శాఖమంత్రి కొట్టు సత్యన్నారాయణ మాట్లాడుతూ..
దేశంలో వైయస్ రాజశేఖరరెడ్డికి సాటి వచ్చే ముఖ్యమంత్రి ఏ రాష్ర్టంలో లేరన్నారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక దాదాపు 800 మంది అసువులు బాశారన్నారు. ఇలాంటి పరిస్ధితిలలో వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నిలబెడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సంక్షేమపధకాలను అమలు చేస్తున్నారు. పార్టీల కతీతంగా ఈరోజు శ్రీ వైయస్ జగన్ అమలు చేస్తున్న పధకాలను అందరూ మెచ్చుకుంటున్నారని వివరించారు.వైయస్ రాజశేఖరరెడ్డితో కలసి పనిచేసే అదృష్టం తనకు కలిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ, బాపట్ల ఎంపి శ్రీ నందిగమ్ సురేష్, ప్రభుత్వ విప్ శ్రీ కరణం ధర్మశ్రీ, శాసనమండలిలో విప్ శ్రీ జంగా కృష్ణమూర్తి, శాసనమండలి సభ్యులు శ్రీమతి కల్పలతారెడ్డి, శాసనమండలి సభ్యులు శ్రీ లేళ్ల అప్పిరెడ్డి, ప్రభుత్వసలహాదారులు శ్రీ జూపూడి ప్రభాకరరావు, ప్రభుత్వ సలహాదారులు శ్రీ చల్లా మధుసూధనరెడ్డి,ఉత్తరఅమెరికాలో ప్రభుత్వ ప్రతినిధి శ్రీ పండుగాయల రత్నాకర్,నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ శ్రీ నారాయణమూర్తి,ఆప్కో ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి మోహన్ రావు,పలువురు పార్టీ నేతలు,ప్రభుత్వ కార్పోరేషన్ల ఛైర్మన్ లు,డైరక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.