మోసగాళ్లను నమ్మకండి

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

కాపులకు 5 శాతం చట్టబద్ధత కల్పిస్తామంటున్నారు 

పసుపు–కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నారు

నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు.

ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ మిన్నా అన్నది చంద్రబాబు కాదా? 

టీడీపీ, జనసేనతో కలిసి అఖిలపక్షంతో పాల్గొనబోము

చంద్రబాబుతో అర్ధరాత్రి లగడపాటి, రాధాకృష్ణ మంతనాలు

 

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు  మండిపడ్డారు. హోదాను పోగొట్టిన చంద్రబాబు మళ్లీ అఖిలపక్షం అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టారని, మోసగాళ్లను ఈ రాష్ట్రం నమ్మదని ఆయన స్పష్టం చేశారు. చట్టాన్ని వక్రీకరిస్తూ కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు డ్రామాకు తెర లేపారని విమర్శించారు. విభజన హామీలపై ఉండవల్లి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో టీడీపీ, జనసేన సమక్షంలో మేం కూర్చొని చర్చించలేమన్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు, టీడీపీ అనేక కొత్త వాగ్ధానాలు చేస్తున్నారని చెప్పారు. కొన్ని చేశామనే భావన కల్పించే వి దంగా డ్రామాలాడుతున్నారన్నారు. కాపులకు ఐదు శాతం చట్టబద్ధత కల్పిస్తామని, అలాగే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా, విభజన హామీలపై పోరాటం చేస్తున్నట్లు చెప్పడాన్ని ఆయన ఖండించారు.  

కాపులను మరోసారి మోసం చేసేందుకు సిద్ధం
కాపు రిజర్వేషన్లపై ఒక చట్టబద్ధత తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నానని, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని బాబు డ్రామాలాడుతున్నారని అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. రిజర్వేషన్లు అనుభవించని ఓసీ కులాలకు ఈ రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం భావించిందన్నారు. ఇందులో 5 శాతం కాపులకు ఇస్తానని చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం  వల్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే చట్టాలను వక్రీకరించి చట్ట వ్యతిరేకంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్లు కుల ప్రాతిపాదికన ఇవ్వరని, ఆదాయంపై మాత్రమే ఇస్తారన్నారు. ఈ రిజర్వేషన్లపై చట్టబద్ధత తీసుకువస్తామని చంద్రబాబు చెప్పడం కాపులను మోసం చేయడమే అన్నారు. చంద్రబాబు నాటకాలను మేధావులు, కాపులు గమనించాలన్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలని ఓ ఉద్యమం సాగుతుంటే చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. 

పోస్టు డేటెడ్‌ చెక్కులు అప్పుగా ఇస్తే ఉపయోగమేంటి?
పసుపు–కుంకుమ పేరతో డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.   రూ.10 వేల పోస్టు డేటెడ్‌ చెక్కులు ఇస్తారట అని విమర్శించారు. ఈ చెక్కులు ఎన్నికల సమయంలో చెల్లవని, అప్పుగా ఇచ్చే ఈ చెక్కులతో మహిళలను మోసం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. మొన్న ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు. వైయస్‌ జగన్‌ నవరత్నాల్లో స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల నాటికి ఎంతైతే అప్పు ఉందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మాఫీ చేసి నేరుగా మీ చేతుల్లో పెడతామని మహిళలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 

ప్రజల్ని మోసం చేయడం కోసమే ధర్మ పోరాట దీక్షలు
చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పోగొట్టుకున్న ప్రత్యేక హోదా కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామనడం బాధాకరమన్నారు. సెప్టెంబర్‌ 8, 2016న ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ అద్భుతంగా ఉందని ఆ రోజు చంద్రబాబు చెప్పారన్నారు. మీరు పోగొట్టి రేపు మమ్మల్ని అఖిలపక్షానికి పిలుస్తారా అని నిలదీశారు. హోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబు ప్యాకేజీని స్వాగతిస్తు అసెంబ్లీలో తీర్మానం చేశారని,ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను శాలువాలతో సన్మానించారన్నారు. విచిత్రమైన డ్రామా చేస్తుంటే అందులో వైయస్‌ఆర్‌సీపీ పాల్గొనదని, అఖిలపక్ష సమావేశానికి మేం హాజరుకామని తేల్చి చెప్పారు. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే జైల్లో పెట్టింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. విభజన హామీలపై అఖిలపక్షం అంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసి, ప్యాకేజీ గొప్పదని చెప్పి, హోదా అవ సరం లేదని చెప్పి..ఇవాళ పోరాటం చేస్తున్నారంటే నమ్మి నీ చెంతకు చేరేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరన్నారు.

ఆంధ్రులను మోసం చేసిన టీడీపీ, జనసేన మధ్యలో కూర్చోలేం
ఇవాళ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఈ సమావేశానికి హోదా రాకుండా సర్వనాశనం చేసిన టీడీపీ, ఆ పార్టీ అధికారంలోకి రావడానికి సపోర్టు చేసిన జనసేన పార్టీలు హాజరవుతున్నాయని, అయితే వారి మధ్య కూర్చోలేమన్నారు. అసెంబ్లీని ఆకలింపు చేసే విధంగా సర్వనాశనం చేసిన టీడీపీ సమక్షంలో మేం కూర్చొని చర్చించేందుకు మేం సిద్ధంగా లేమన్నారు. ఉండవళ్లి అరుణ్‌కుమార్‌కు మేం వ్యతిరేకం కాదని తెలిపారు.

బోగస్‌ సర్వేల పేరుతో కుట్రలు
బోగస్‌ సర్వేల పేరుతో వైయస్‌ఆర్‌సీపీని దెబ్బతీయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు గొప్పగొప్ప విచిత్ర ప్రయత్నాలు చేస్తుంటారని అంబటి విమర్శించారు. ప్రజల మైండ్‌ సెట్‌ మార్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వీటన్నింటిని మేం ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.లగడపాటి రాజగోపాల్, ఓ పత్రికా చానల్‌ అధిపతితో కలిసి నారా చంద్రబాబుతో రాత్రి మంతనాలు జరిపారన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బతీయడమే వారిధ్యేయం.

లగడపాటి రాజగోపాల్‌ తెలంగాణలో చంద్రబాబును భుజాన పెట్టుకొని మహా కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారన్నారు. లగడపాటి సర్వే తెలంగాణలో అట్టర్‌ఫ్లాప్‌ అయ్యిందని తేలిందన్నారు. ప్రజలకు భ్రమలు కల్పించి వైయస్‌ఆర్‌సీపీని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. ముద్రగడ పద్మనాభం ఓ మీటింగ్‌ పెడితే అనుమతించలేదన్నారు. ఎన్నికలకు ముందు అనేక మోసపూరితమైన ఆలోచనలు చేస్తున్న చంద్రబాబును నమ్మొద్దని సూచించారు. గత ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి వాగ్ధానాలు అనేకం చేశారని, వాటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఈ ఐదేళ్లలో ఏం చేశారో..ఆ అభివృద్ధిని చూసి ఓట్లు అడిగే దమ్ముందా అని ప్రశ్నించారు. మోసగాళ్లను ఈ రాష్ట్రం నమ్మదని పేర్కొన్నారు. 

 

Back to Top