మున్సిపల్‌ ఉప ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీ విఫలం

వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు ధ్వజం

ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి పార్టీల దారుణం

యథేచ్ఛగా దాడులు, కిడ్నాప్‌లు. అరాచకపర్వం

అప్రజాస్వామిక విధానాలతో దౌర్జన్యకాండ

బాధ్యత మర్చిన పోలీసులు చోద్యం చూస్తున్నారు

ప్రెస్‌మీట్‌లో కొమ్మూరి కనకారావు ఆక్షేపణ

తాడేపల్లి: రాష్ట్రంలో జరుగుతున్న 10 మున్సిపల్‌ ఉప ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఘోరంగా విఫలమైందని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు ఆక్షేపించారు. హిందూపూర్‌ మున్సిపాలిటీలో వైయ‌స్ఆర్‌సీపీకి 30 మంది సభ్యుల బలమున్నా, ఆరుగురు మాత్రమే ఉన్న టీడీపీ ఛైర్మన్‌ పీఠం కైవసం చేసుకోవడం చూస్తే ప్రజాస్వామ్య విలువలు ఈ స్థాయిలో పతనమయ్యాయో అర్థం అవుతుందని ఆయన ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కూటమి నాయకులు వైయ‌స్ఆర్‌సీపీ సభ్యుల ఆస్తులను ధ్వంసం చేసి బెదిరింపులకు దిగడం, కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేయడం ద్వారా అరాచకాలు సృష్టిస్తున్నా, పోలీసులు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో బీసీ మహిళ అయిన మేయర్‌ శిరీషపై, దళిత ఎంపీ గురుమూర్తిపై దాడులు చేయడం హేయమన్నారు. రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు, ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కి  వైయ‌స్ఆర్‌సీపీ నుంచి గెలిచిన సభ్యులను బెదిరించి లాక్కోవడం కక్కిన కూటికి ఆశపడటమేనని దుయ్యబట్టారు.సోమ‌వారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కొమ్మూరి కనకారావు మీడియాతో మాట్లాడారు.

క‌న‌కారావు ఏమ‌న్నారంటే..

  • రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లు, అయిదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు జరుగుతున్న డిప్యూటీ మేయర్, ఛైర్‌పర్సన్స్, వైస్‌ ఛైర్‌పర్సన్లకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి వ్యవహరిస్తున్న తీరు మొత్తం ఎన్నికలను అపహాస్యం చేసేలా ఉంది. 
  • హిందూపూర్‌ మున్సిపాలిటీలో వైయ‌స్ఆర్‌సీపీకి 30 మంది కౌన్సిలర్ల బలం ఉన్నా, ఛైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడం చూస్తుంటే ఎన్నికల కమిషన్‌ విఫలమైందని చెప్పడానికి ఇంతకన్నా ఆధారం మరోటి అవసరం లేదు.
  • హిందూపూర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేసి, మా పార్టీ తరఫున ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన కౌన్సిలర్లను బెదిరించి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. 
  • ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఘోరంగా విఫలమైంది. పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లను బెదిరిస్తున్నా, కిడ్నాప్‌ చేస్తున్నా, వారిపై దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.
  • కూటమి నాయకుల చర్యలను ముందే పసి గట్టి ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని నిన్న (ఆదివారం) వైయ‌స్ఆర్‌సీపీ ఎస్‌ఈసీకి విన్నవించడం జరిగింది. అయినా పట్టించుకోకపోవడం దౌర్భాగ్యం.  
  • ప్రజా ప్రతినిధులైనప్పటికీ వెనుకబడిన కులాలకు చెందిన వారికి ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది. బీసీ మహిళ, తిరుపతిలో మేయర్‌ శిరీష.. బస్సులో వెళ్తుండగా టీడీపీ గూండాలు దాడి చేశారు. మా పార్టీ ఎంపీ గురుమూర్తి మీద దాడి యత్నం జరిగింది. 
  • నిత్యం అడ్డదారుల్లో, ఇతర పార్టీల మద్దతుతో గెలుస్తున్న చంద్రబాబుకి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గౌరవం లేదని ఈ ఎన్నికలే నిరూపిస్తున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ నుంచి ఫ్యాన్‌ గుర్తు మీద గెలిచిన అభ్యర్థులను లాక్కోవడం చూస్తుంటే కక్కిన కూటికి చంద్రబాబు ఆశ పడినట్లు భావించాల్సి వస్తుందని కొమ్మూరి కనకారావు స్పష్టం చేశారు.
Back to Top