న్యూఢిల్లీ: సినిమాటోగ్రాఫ్ బిల్లుపై పార్లమెంట్‌లో మాట్లాడితే కోట్ల రూపాయలకు పడగలెత్తిన కొందరు హీరోలు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారోనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. సినిమా పైరసీని అరికట్టడం ఎంత అవసరమో, సినీ కార్మికుల సంక్షేమం, సినీ పరిశ్రమలో పనిచేసే మహిళల భద్రత కూడా అంతే ముఖ్యమని, ఉన్నమాటంటే ఉలుకెందుకని ప్రశ్నించారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.
``సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది.``
``కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలైతే ఉచితంగా నటిస్తూ.. లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్`` చెబుతూ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.