ఏపీ సమస్యలపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నిస్తాం

కుల గణన, మహిళా బిల్లుపై కేంద్రంపై ఒత్తిడి తెస్తాం

పోలవరం, విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

ఢిల్లీ: రాష్టాన్ని విడగొట్టి తొమ్మిదేళ్లు పూర్తయినా ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఏపీ సమస్యలపై కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా పార్లమెంట్‌లో వైయస్‌ఆర్‌ సీపీ గళం వినిపిస్తుందన్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఎంపీ మార్గాని భరత్‌ మీడియాతో మాట్లాడారు. 
 
‘బీసీ రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 50 శాతం పైచిలుకు ఉన్న బీసీలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నిస్తాం. జనగణన జరుగుతున్నప్పుడు కుల గణన కూడా జరగాలి. ఇప్పటి వరకు బీసీలకు సుమారు 26 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేస్తున్నారు. జనాభాదమాషా ప్రకారం 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారు. బీసీ రిజర్వేసన్‌ బిల్లు తీసుకురావాలని పార్లమెంట్‌లో డిమాండ్‌ చేస్తాం. 

మహిళా రిజర్వేషన్‌పై కూడా పార్లమెంట్‌లో గళమెత్తుతాం. ఏపీలో సీఎం వైయస్‌ జగన్‌ మహిళలకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. లోకల్‌ బాడీ, నామినేటెడ్‌ పదవుల్లో, టెంపుల్‌ కమిటీల్లో, పదవుల్లోనూ, పనుల్లోనూ 50 శాతానికి మించి రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు. కచ్చితంగా మహిళా బిల్లు పార్లమెంట్‌లో చట్టరూపంలో తీసుకురావాలని వైయస్‌ఆర్‌ సీపీ డిమాండ్‌ చేస్తుంది.  

సీఎం వైయస్‌ జగన్‌ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రెవెన్యూ డెఫిసిట్‌ కింద రూ.10 వేల కోట్ల పైచిలుకు రాబట్టారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 12 వేల కోట్లు. 2019–20 ప్రకారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేషన్‌లో రూ.55 వేల కోట్లు పెట్టారు. కేంద్ర కేబినెట్‌ దాన్ని ఎందుకు ఆమోదించదని మా డిమాండ్‌ ఉండబోతుంది. పోలవరం ప్రాజెక్టు అతివేగంగా పూర్తికావాలంటే ఆర్‌ అండ్‌ ఆర్‌ నిధులు వెంటనే విడుదల చేయాల్సిన అవసరం కేంద్రంపై ఉంది. దీనిపై ఒత్తిడి తీసుకువస్తాం’ అని ఎంపీ భరత్‌రామ్‌ చెప్పారు. 
 

Back to Top