తాడేపల్లి: సీఎం చంద్రబాబు విజనరీ కాదు, విద్వాంసకారుడని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ వారికి పనులు చేయనంటూ చంద్రబాబు చేసిన దిగజారుడు వ్యాఖ్యలను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. వెంటనే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఇన్నాళ్లు వైయస్ఆర్‌సీపీపై తనలో దాచుకున్న కుట్ర, విషాన్ని చంద్రబాబు బయటపెట్టారు. అందరికీ సమన్యాయం చేస్తానని ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం సబబేనా? చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించాలి. లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసమే చంద్రబాబు తాపత్రయం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదు, విషం చిమ్మే నాయకుడు. ఆయన నిజస్వరూపం నిన్నటి జీడీ నెల్లూరు కార్యకర్తల సమావేశం సాక్షిగా బయటపడింది. తాను సీఎం స్థానంలో ఉన్నానన్న స్పృహ లేకుండా వైయస్ఆర్‌సీపీ వారికి పనులు చేయనని చెప్పడం ద్వారా ఇన్నాళ్లు తనలో దాచుకున్న ద్వేషం, కుళ్లును బయటపెట్టుకున్నారు. ఇలాంటి వ్యక్తి సీఎంగా ప్రమాణం చేసే సందర్భంలో చెప్పినట్టుగా నిష్పక్షపాతంగా రాష్ట్ర ప్రజలను సమానంగా చూస్తాడని అనుకోలేం. పొలిటికల్ గవర్నెన్స్ చేస్తానని చెప్పి తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నానని చంద్రబాబు ఒప్పుకున్నారు. మేం తలచుకుంటే వైయస్ఆర్‌సీపీ వారు రోడ్డు మీద తిరగలేరని హోంమంత్రి అనిత చెప్పడం చూస్తుంటే టీడీపీ కార్యకర్తలకు పచ్చ బిళ్ల ఇచ్చి ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు చేసి పెడతామని చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఉన్నాయి. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు పార్టీకి అనుకూలంగా పనిచేస్తామని నిస్సిగ్గుగా చెప్పడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకూడదనే లక్ష్యంతో మా పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. రెండు కులాలపై ఎందుకంత ద్వేషం? ఒకపక్క విజన్ ఉన్న నాయకుడిని అని చెప్పుకుంటూనే మరోపక్క కులాలు, ప్రాంతాలు, పార్టీలు చూసి పదవులు కేటాయిస్తున్నారు. ఆఖరుకి దళిత, రెడ్డి సామాజికవర్గాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం, అప్రాధాన్య పోస్టుల్లోకి పంపడం, సస్పెండ్ చేయడం లాంటి చర్యల ద్వారా ఆ వర్గాలకు మేం వ్యతిరేకమనే సందేశాన్ని పంపడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం. ఇది విజన్ ఉన్న నాయకుడి లక్షణమా? విధ్వంసకారుడి లక్షణమా? అన్ని కులాలు ఓటేస్తేనే సీఎం అయ్యాడనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. చంద్రబాబు తాను చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. తక్షణం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. చంద్రబాబు పార్టీలు, కులాల మధ్య చిచ్చు పెడుతుంటే పవన్ కళ్యాన్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా అశ్రద్ద పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి జీవనాడిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఈ ప్రాంతంపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఈ ప్రాంతంలో వైయస్ఆర్‌సీపీ బలంగా ఉండటమే ప్రభుత్వ వివక్షకు కారణం. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు పూర్తై, ఫినిషింగ్ వర్కులు మాత్రమే ఉన్న ప్రాజెక్టుపై చంద్రబాబు దృష్టి పెట్టడం లేదు. గతంలోనూ 14 ఏళ్లు సీఎంగా ఉండి వెలిగొండ ప్రాజెక్టు కోసం చంద్రబాబు చేసింది శూన్యం. గతేడాది బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు, ఈ ఏడాది ప్రవేశపెట్టిన రూ. 3.20 లక్షల కోట్ల బడ్జెట్‌లోనూ అరకొర నిధులే కేటాయించారు. వెలిగొండ ప్రాజెక్టుకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం చేసిన కేటాయింపులపై డిబేట్‌కు నేను సిద్ధంగా ఉన్నాను. త్వరలోనే పాదయాత్ర చేసి ప్రజలకు వాస్తవాలు వివరిస్తా. వెలిగొండ ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయంపై జిల్లా మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు స్పందించాలి. త్వరలో ఈ ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తారని సమాచారం ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పై చూపుతున్న నిర్లక్ష్యం పై ఆయనను నిలదీస్తాం.