దిశ చట్టానికి, బిల్లుకు తేడా తెలియని అజ్ఞాని లోకేష్‌

దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా లోకేష్‌ వ్యాఖ్యలు

తెలుగు కూడా చదవడం రాని అజ్ఞాని బాబు పుత్రరత్నం 

మా ఏడాది పాలనపై నువ్వోడిపోయిన మంగళగిరిలోనైనా.. మీ నాన్న గెలిచిన కుప్పంలోనైనా చర్చకు సిద్ధమా..?

లోకేష్‌కు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పార్థసారధి సవాల్‌

తాడేపల్లి: తెలుగు చదవడం కూడా రాని లోకేష్‌.. తన అజ్ఞానాన్ని అంతా పోగేసి పుస్తకం విడుదల చేయడం హాస్యాస్పదమని, దిశ చట్టం, బిల్లుకు తేడా తెలియని అజ్ఞాని చంద్రబాబు పుత్రుడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి గట్టిపోటీ ఏర్పడినట్టుందని, అందుకనే హడావిడిగా వచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టాడని ఎద్దేవా చేశారు. పేదవాడికి మేలు జరిగితే సహించలేని పార్టీ టీడీపీ అని మండిపడ్డారు. లోకేష్‌ ఓడిపోయిన మంగళగిరిలోనైనా.. చంద్రబాబు గెలిచిన కుప్పంలోనైనా.. సీఎం వైయస్‌ జగన్‌ ఏడాది పాలనపై తాను చర్చకు సిద్ధమని, దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలన్నారు. వెంటనే స్పందించకపోతే లోకేష్‌ తోకముడిచి పారిపోయినట్లేనన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయే పథకాన్ని చంద్రబాబు తన జీవితంలో అమలు చేశాడా..? అని ప్రశ్నించారు. చంద్రన్న పథకాలు అమలు చేయాల్సిన కర్మ ఈ ప్రభుత్వానికి పట్టలేదన్నారు. సంక్షేమ పథకాల గురించి లోకేష్‌ మాట్లాడితే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలను పీడించిన నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీదని మండిపడ్డారు. బీసీలను తోకకత్తిరిస్తా.. తోలు తీస్తా అని చంద్రబాబు మాట్లాడిన మాటలు ఎవరూ మర్చిపోలేదన్నారు. 

కొన్ని సంక్షేమ పథకాల పేరు చెబితే దివంగత మహానేత వైయస్‌ఆర్, స్వర్గీయ ఎన్టీఆర్‌ పేర్లు గుర్తుకువస్తాయని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న అమ్మఒడి పథకం కూడా చెరగని ముద్ర వేసుకుందన్నారు. అర్హత ఆధారంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రజా ప్రభుత్వం సీఎం వైయస్‌ జగన్‌దని, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. 

అన్నదాత సుఖీభవ పథకాన్ని మార్చి.. రైతు భరోసా పథకం అమలు చేస్తున్నారని మాట్లాడేందుకు చంద్రబాబుకు సిగ్గుందా..? అని ఎమ్మెల్యే పార్థసారధి ధ్వజమెత్తారు. ప్రజా సంకల్పయాత్రకు ముందు జరిగిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశంలోనే రైతు భరోసా పథకాన్ని వైయస్‌ జగన్‌ ప్రకటించారన్నారు. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామని.. చెప్పినదానికంటే ముందుగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేసి ఐదేళ్లలో రూ.67,500 అందిస్తున్నామన్నారు. పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు దేశ చరిత్రలోనే లేవని, జూలై 8వ తేదీన సీఎం వైయస్‌ జగన్‌ 30 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు అందజేయనున్నారన్నారు. దీనిపై కూడా టీడీపీ నీచ రాజకీయం చేస్తుందని, టీడీపీకి పేదల మీద ఎంత వ్యతిరేక భావన ఉందనేది లోకేష్‌ ప్రకటన ద్వారా అర్థం అవుతుందన్నారు. 

Back to Top