విశాఖపట్నం: పరిపాలన సౌలభ్యం కోసమే నూతనంగా మరో 13 జిల్లాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేశారని, సీఎం నిర్ణయాన్ని ప్రజలంతా సంతోషంతో స్వాగతిస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చంద్రబాబుకు రుచించడం లేదని, ప్రజలంతా సంతోషంగా ఉంటే బాబు మాత్రం బాధపడుతున్నాడన్నారు. విశాఖపట్నంలోని వైయస్‌ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రాంతాల పరిస్థితులు, ప్రజల మనోభావాలకు అనుగుణంగా 26 జిల్లాలు ఏర్పాటయ్యాయన్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఆరు జిల్లాలు ఆవిర్భవించాయన్నారు. గతంలో మారుమూల ప్రాంతాల నుంచి ప్రజల విశాఖపట్నంలోని జిల్లా అధికార యంత్రాంగాన్ని కలవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి అనేక ఇబ్బందులుపడేవారని, నూతన జిల్లాల ఏర్పాటుతో ఆ సమస్యలు తీరుతాయని, పరిపాలన ప్రజలకు మరింత చేరువ అవుతుందన్నారు. ప్రజలకు మంచి జరగడం చంద్రబాబుకు రుచించడం లేదని ఎమ్మెల్యే అమర్ మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక చక్కదిద్దుతామని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చక్కదిద్దడం మానేసి.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం కల్పిస్తే.. వారికి పరిపాలన చేరవ చేయాలి, అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన చేయకుండా మళ్లీ అధికారంలోకి వచ్చాక చక్కదిద్దుతామని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఇంకా చంద్రబాబు పగటికలలు కంటున్నాడని చురకలంటించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలనే ఆలోచన చంద్రబాబు ఏనాడూ చేయలేదన్నారు. చంద్రబాబు రాసిన లేఖను, ఆ ప్రాంత ప్రజల మనోభావాలు పరిగణలోకి తీసుకొని కుప్పంను సీఎం వైయస్ జగన్ రెవెన్యూ డివిజన్ చేశారన్నారు.