సాయిబాబా గుడిలో సత్య ప్రమాణానికి రావాలి

వెలగపూడి రామ‌కృష్ణ‌కు ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌

రంగా హత్య కేసులో రామకృష్ణ హస్తం, భూఆక్రమణలు ఆధారాలతో సహా నిరూపిస్తా

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ: భూఆక్రమణలు, వంగవీటి రంగ హత్య కేసులో ఎలాంటి ప్రమేయం లేదని అనుకుంటే విశాఖ ఈస్ట్‌పాయింట్‌ కాలనీలోని సాయిబాబా గుడిలో వెలగపూడి రామకృష్ణ సత్యప్రమాణం చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌ విసిరారు. వెలగపూడి అక్రమాలపై సత్యప్రమాణానికి తాను సిద్ధమన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి భూఆక్రమణలను ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. విశాఖ ఈస్ట్‌ పాయింట్‌ కాలనీలోని సాయిబాబా గుడికి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

సాయిబాబా గుడిలో సత్యప్రమాణం చేస్తానన్న రామకృష్ణ.. ఈ రోజు 12 గంటలలోపు వచ్చి ప్రమాణం చేయాలని, లేనిపక్షంలో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని రామకృష్ణ ఒప్పుకున్నట్టేనన్నారు. వెలగపూడి సవాల్‌కు సీఎం వైయస్‌ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి రావాలని షరతులు పెట్టడం అవివేకమని, అసలు సమాజంలో స్థాయి అంటూ లేని వెలగపూడి లాంటి నీచులకు తప్పని పరిస్థితుల్లో తాను సవాల్‌ చేయాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు. 

వంగవీటి మోహనరంగను చంపి తలదాచుకోవడానికి వెలగపూడి రామకృష్ణ విశాఖపట్నం వచ్చాడన్నారు. విశాఖలో సాండ్‌ మాఫియా, ల్యాండ్, లిక్కర్‌ మాఫియా, కోడి పందాలు ఇటువంటి కార్యక్రమాలు చేశాడన్నారు. వంగవీటి మోహనరంగ హత్యకేసులో వెలగపూడి హస్తం ఉందని, నిరూపించడానికి సీబీఐ వేసిన చార్జిషీట్‌తో సహా వచ్చానన్నారు. రుషికొండలో వెలగపూడి దోచుకున్న భూములకు సంబంధించిన రుజువులు కూడా ఉన్నాయన్నారు. ఇన్నీ పెట్టుకొని అన్యాయం చేయలేదని అంటే ఎవరు నమ్ముతున్నారని ధ్వజమెత్తారు. సవాల్‌ను స్వీకరించి ప్రమాణం చేయాలని, రానిపక్షంలో ఆరోపణలు అన్నీ వాస్తవమేనని ఒప్పుకుని, తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

 

Back to Top