తాడేపల్లి: కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆ లేక టీడీపీ నాయకుడా? అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని, సోషల్ మీడియాలో గొంతెత్తకూడదని, రాజ్యాంగ హక్కులను, చట్టాలను కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులు కూటమి ప్రభుత్వమే శాశ్వతంగా ఉంటుందనుకుంటున్నారా అని నిలదీశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చట్ట ప్రకారం ముందుకెళ్ళాలి, అలాగే మాపై దారుణంగా, అసభ్యంగా పోస్టులు పెడితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కానీ మా సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు మీ తప్పులు ఎత్తిచూపితే మాత్రం దుర్మార్గంగా కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు, పోలీసుల అత్యుత్సాహం ఎక్కువైందని విరూపాక్షి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్ఆర్ జిల్లాలో వర్రా రవీంద్రారెడ్డిని ఈ నెల 5 న అరెస్ట్ చేశారని, కానీ అతన్ని ఇన్ని రోజులు హింసించి హింసించి ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టారన్నారు. వర్రాను ఉగ్రవాదిగా మాస్కు వేసి మీడియా ముందు చూపారు (కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రెస్ మీట్ ఫోటోను ప్రెస్‌మీట్‌లో చూపారు) ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేరిస్తే ఎవరూ ప్రశ్నించరు కదా, అధికారం మీకు శాశ్వతం కాదు గుర్తు పెట్టుకోండని ఆయన హితవు పలికారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ అధికారిలా కాకుండా టీడీపీ నాయకుడిలా మాట్లాడుతున్నారు, ఐపీఎస్ లో ఇదేనా మీరు చదువుకున్నదని ఎమ్మెల్యే నిలదీశారు. తప్పు చేసిన వారిని శిక్షించండి, మేం కాదనం, కానీ సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఇలా ప్రవర్తించడం చాలా దారుణమన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి దారుణాలు చూడలేదు, కానీ ఏపీలో చూస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వపు రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారన్న ఆయన నాడు వైయస్ జగన్ ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విరూపాక్షి హెచ్చరించారు.