తాడేపల్లి: విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అని,దాన్ని అమ్మె అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ ఉంటుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాజకీయాలు కాదన్నారు. విశాఖ స్టీల్స్‌పై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు అని, కుట్రలు ఆపకపోతే ప్రతిపక్షాలు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తాడేపల్లిలోకి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బాధాకరం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చాలా బాధాకరమని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పెద్ద ఎత్తున ఉద్యమం సాగింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్‌పై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వల్లే అనేక మందికి ఉపాధి దొరికిందన్నారు. ప్రైవేటీకరణ అంశంపై పునరాలోచించాలని కేంద్రంపై అందరం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని రాజకీయ పార్టీలు పాకులాట విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కొన్ని రాజకీయ పార్టీలు పాకులాడుతున్నాయని వైయస్ఆర్‌సీపీ అధినేత ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. బీజేపీతో కలిసి నడిచేది ఎవరని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ వెళ్లింది విశాఖ ఉక్కు కోసమా..? తిరుపతి సీటు కోసమా అని నిలదీశారు. విశాఖ స్టీల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమ్ముతుందని ప్రశ్నించారు. కొందరు కామన్‌సెన్స్ లేకుండా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు సీఎం అయ్యాక విశాఖ స్టీల్ నష్టాల బాట.. చంద్రబాబు ముఖ్యమంత్రిఅయ్యే వరకు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ లాభాల్లో ఉండేదని, ఆయన అధికారంలోకి వచ్చాకే నష్టాల బాట పట్టిందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు.2015 వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉండేదన్నారు.2018లో కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని ప్రకటించినప్పుడు చంద్రబాబు ఆ రోజు ఏం చేశారని నిలదీశారు. ఫాస్కో సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు పలుమార్లు భేటీ అయ్యింది ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని మండిపడ్డారు. చంద్రబాబుకు ఆ రోజు విశాఖ ఉక్కు కనిపించలేదని, సుజనా స్టీల్స్ మాత్రమే కనిపించేవన్నారు. ఆయన చుట్టూ బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన సుజనా చౌదరి, రాయపాటి, లగడపాటి వంటి నేతలే ఉంటారని తెలిపారు. చంద్రబాబు బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని అంబటి రాంబాబు సూచించారు. కేంద్రం నిర్ణయం పునరాలోచించాలని సీఎం వైయస్ జగన్ లేఖ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం నిర్ణయం పునరాలోచించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారని అంబటి రాంబాబు తెలిపారు. ఆ లేఖలో కేంద్రానికి పలు సూచనలు చేశారని గుర్తు చేశారు. సొంత గనులు కేటాయిస్తే స్టీల్ ప్లాంట్‌కు లాభాలు వస్తాయని సూచించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం వైయస్ జగన్ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు పాకులాడుతున్నాయని మండిపడ్డారు. టీడీపీకి పది పంచాయతీలు కూడా రాలేదు పంచాయతీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి పట్టుమని పది పంచాయతీలు కూడా రాలేదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు అబద్ధాలు చెప్పి..అవే నేర్పిస్తున్నారన్నారు. మంగళగిరిలో గెలవలేకపోయిన లోకేష్ ..ఎవర్నో గెలిపిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీకి 90 శాతం సీట్లు వచ్చాయని, భవిష్యత్‌లో రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలు వస్తాయన్నారు. వైయస్ జగన్ చేస్తున్న మంచి పాలనను రాష్ట్ర ప్రజలు మెచ్చి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తున్నారని చెప్పారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుంది చంద్రబాబు తీరు అని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి చేయకుండా జనసేన మాపై విమర్శలు చేయడం సరికాదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని, చంద్రబాబు, పవన్‌లు బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని అంబటి రాంబాబు సూచించారు.