అఖిల ప్రియ అరెస్టు విషయంలో మౌనం ఎందుకు బాబూ?

అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఒకలా, అఖిల ప్రియ అరెస్టు విషయంలో మరోలా ఎందుకు?

చంద్రబాబు ట్వీట్లు, ఘీంకారాలు, లోకేష్‌ కూతలు.. ఏమీ కనిపించకపోవడం ఆశ్చర్యం

వైయ‌స్ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

తాడేపల్లి: కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియ విష‌యంలో ఎందుకు మౌనంగా ఉన్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పేద కార్మికుల డబ్బును కొట్టేసిన అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడిని చంద్రబాబు, లోకేష్‌ పరామర్శించార‌ని, కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియను పరామర్శించరా? అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్ర‌శ్నించారు. పేద కార్మికులకు సంబంధించిన నిధులను కాజేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డ మాజీ మంత్రి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును  చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ పరామర్శించి, ఈ కేసును రాజకీయ ప్రతీకార కేసుగా వక్రీకరించి ప్రచారం చేశార‌ని గుర్తు చేశారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బంధువులుగా పేర్కొంటున్నవారిని  కిడ్నాప్‌చేసి అరెస్టయిన మరో మాజీ మంత్రి అఖిల ప్రియను పరామర్శించరా? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రి అయిన అఖిల ప్రియ కిడ్నాప్‌ కేసులో ఏ–2 ముద్దాయిగా అరెస్టయితే చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు నోరుమెదపడం లేద‌ని నిల‌దీశారు. అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఒకలా, అఖిల ప్రియ అరెస్టు విషయంలో మరోలా ఎందుకు వ్యవహరిస్తున్నారు. అఖిల అరెస్టుపై తేలుకుట్టిన దొంగల్లా తండ్రీ, కొడుకులిద్దరూ ఎందుకు వ్యవహరిస్తున్నారు. 
అచ్చెన్నాయుడు అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయినా, దాన్ని రాజకీయ వేధింపులు కేసుగా చిత్రీకరించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు ఆరాటపడ్డారు. దీనికోసం ఎన్నిడ్రామాలు చేయాలో, అన్ని డ్రామాలు చేశారు. అఖిల ప్రియ  అరెస్టు విషయంలో మరెందుకు మౌనంగా ఉన్నారో...? దీన్ని ఎలా అర్థం చేసుకోవాల‌ని ప్ర‌శ్నించారు. అఖిల ప్రియ అరెస్టు వ్యవహారంపై చంద్రబాబు ట్వీట్లు, ఘీంకారాలు, లోకేష్‌ కూతలు.. ఏమీ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంద‌న్నారు. అదే కిడ్నాప్‌ కేసు ఏపీలో జరిగి ఉంటే ఇదే చంద్రబాబు, లోకేష్, వారి అనుకూల మీడియా ఎలా రచ్చచేసేవారో మనం ఊహించుకోవచ్చు. తండ్రిలేని పిల్లను వేధిస్తాన్నారని, పార్టీ మారినందుకు కక్షకట్టారని.. ఇలా నాటకాలను ఆడుతూ ప్రచారాన్ని రక్తికట్టించేవారు.  టీడీపీ నాయకుల నైజానికి, వారి అధినేత చంద్రబాబు డొంకతిరుగుడు వ్యవహారానికి  టీడీపీ మాజీ మంత్రి అఖిల ప్రియ అరెస్టు వ్యవహారం ఒక పక్కా ఉదాహరణ అని అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు.

 

Back to Top