బడుగుబలహీన వర్గాల కోసమే ఇంగ్లిష్‌ మీడియం

తెలుగు రచయితల పిల్లలు ఏ భాషలో చదువకుంటున్నారు?

మాతభాషకు మేం వ్యతిరేకం కాదు

పేదల పిల్లలు ఇబ్బందులు పడకూడదనే

సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: బడుగు బలహీన వర్గాల కోసమే ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టడంపై తెలుగు రచయతలు ఆక్షేపించడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలుగు భాషకు ప్రభుత్వం ఏమాత్రం వ్యతిరేకం కాదని రాంబాబు అన్నారు. పేద పిల్లలు భవిష్యత్‌లో ఇబ్బందులు పడకూడదనే ఇంగ్లిష్‌ మీడియంపై ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందని చెప్పారు. ఇంగ్లిష్‌ మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి పిల్లలు.. ఏ భాషలో చదువకుంటున్నారో ప్రపంచానికి వివరించాలని డిమాండ్‌ చేశారు. 
చదువుకునేందుకు శక్తి లేని వారిక కోసం..
ప్రైవేటు కళాశాలల్లో చదువకునేందుకు శక్తి లేని వారి కోసమే ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెడుతోంది. ఈ నిర్ణయాన్ని బట్టి సర్కారుకు తెలుగు భాష అంటే గిట్టదని, మాతభాషను రాష్ట్రంలో నిషే«ధించినట్లు మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. పిల్లలు కాంపిటీషన్‌లో నెగ్గుకురావాలంటే తప్పనిసరిగా ఇంగ్లిష్‌పై కనీస అవగాహన ఉండాలని ఆయన చెప్పారు. పేద పిల్లలు కూడా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో నిలబడాలంటే కచ్చితంగా ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోవాలని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తప్పనిసరిగా ఇంగ్లిష్‌ను నేర్చుకోవాల్సిందే అని రాంబాబు అన్నారు.
జీవో ఇచ్చింది ఎవరు?
స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెడుతూ జీవో ఇచ్చింది ఏ ప్రభుత్వం అన్ని ఎమ్మెల్యే రాంబాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టాలని జీవో ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. తెలుగుపై అంత ప్రేమ ఉంటే ఆ జీవో ఎందుకు ఇచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్కూళ్లు, కాలేజీలు నిర్వహిస్తున్న మంత్రికి తెలుగు మీడియంలో పాఠశాలలు నిర్వహించాలని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కార్పొరేట్‌ కళాశాలలు, పాఠశాలల కోసం సర్కారు బళ్లను నిర్వీర్యం చేసింది చంద్రబాబు ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు. 
తెలుగులోనే చదువుకోవాలనే వారి  కోసం..
తెలుగులోనే చదువుకోవాలనే వారి కోసం బీఏ తెలుగు, ఎమ్మే తెలుగు కోర్సులున్నాయి కదా అని గుర్తు చేశారు. ఇంటర్‌ వరకు తప్పనిసరిగా తెలుగు సబ్జెక్టు ఉంటుందని పునుద్ఘాటించారు. 

 

Back to Top