తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పోలీసులు యథేచ్ఛగా చట్ట ఉల్లంఘన చేస్తున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ప్రైవేటు కేసులతో న్యాయస్థానంలో నిలబెడతామని వైయస్సార్‌సీపీ లీగల్‌సెల్ విభాగం అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి వెల్లడించారు. నెంబర్లు లేని వాహనాల్లో రౌడీల్లాగా పోలీసులు వస్తున్నారు. మఫ్టీలో వచ్చి వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా దళిత కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కేసులు పెట్టి జైళ్లలో మగ్గబెడుతున్నారు. బెయిల్ ఇచ్చే కేసుల్లో, 41A నోటీసులు ఇవ్వాల్సిన చోట పోలీస్ మాన్యువల్ పాటించడం లేదు. పోలీసులకు ఈ లైసెన్స్ ఎవరు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైయస్ఆర్‌సీపీ లీగల్ విభాగం అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాన్యువల్ పరిధి దాటుతున్న పోలీసులు: – రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మాన్యువల్ ప్రకారం నడుచుకోకుండా కూటమి నాయకుల ఒత్తిళ్లకు లోబడి పని చేస్తోంది. ఐజీ స్థాయి అధికారి మొదలు కిందిస్థాయి కానిస్టేబుల్ వరకు దాదాపు అందరూ అలాగే పని చేస్తున్నారు. – నెల్లూరు జిల్లాలో సివిల్ డ్రెస్‌లో, నెంబర్ ప్లేట్ లేని కారులో వెళ్లిన పోలీసులు, ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి (సోషల్ మీడియా యాక్టివిస్ట్)ని దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు. దీనిపై వైయస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా పట్టించుకోలేదు. చివరికి కారును వెంబడిస్తే అతడిని రావూరు పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. – బెయిలబుల్ కేసుల్లో 41–ఏ నోటీస్ ఇవ్వాలని, అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు పోలీసుల ఐడెంటిటీ ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా.. ఇవేవీ మన రాష్ట్ర పోలీసులకు పట్టడం లేదు. సివిల్ డ్రెస్‌లు ధరించి నెంబర్ ప్లేట్లు లేని కార్లు, బైకులపై వచ్చి దౌర్జన్యంగా తీసుకెళ్లిపోతున్నారు. – దీంతో వచ్చిన వారు పోలీసులో లేక గూండాలో కూడా అర్థం కాని దుస్థితి. వైయస్ఆర్‌సీపీలో ఉంటే మరిన్ని కేసులు పెడతామని బెదిరించే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు?. ఫిర్యాదు చేసి 15 రోజులైనా..: – చంద్రబాబు మొదలుకొని మంత్రి లోకేశ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు వంటి వారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసి 15 రోజులు గడిచినా, పోలీసులు కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. పోలీసులు బీఎన్‌యస్ యాక్ట్ ప్రకారం నడుచుకోవడం లేదు. – అరెస్ట్ చేసినప్పుడు ఎఫ్‌ఐఆర్ కాపీలు ఇవ్వడం, బంధువులకు తెలియపర్చడం, కోర్టులో ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్టు వంటివి ఏవీ ఇవ్వడం లేదు. ఒక్కసారి అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపిన తర్వాత వేర్వేరు తేదీలతో అనేక స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు. – జైళ్ల నుంచి పీటీ వారెంట్లతో అర్థరాత్రి అడ్వకేట్లు లేని సమయంలో బంధువులకు సమాచారం కూడా ఇవ్వకుండా మేజిస్ట్రేట్ ఇంటి దగ్గర హాజరు పరుస్తున్నారు. అక్కడ్నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పడం లేదు. దారుణంగా వేధిస్తున్నారు: – ఇటీవల ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ తన స్టేటస్‌లో పార్టీకి చెందిన వీడియో పెట్టుకుంటే ఆ వ్యక్తిని తీసుకెళ్లి విపరీతంగా లాఠీలతో చావబాదారు. సోషల్ మీడియా యాక్టివిస్టులతో వ్యక్తిగత కక్షలున్నట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారు. – రాజమండ్రిలో పులి సాగర్ అనే దళిత విద్యావంతుడిని పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుళ్ల ముందు అర్థనగ్నంగా నిలబెట్టి బూతులు తిట్టి బెదిరించారు. దానిపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. – కొంతమంది జైలు అధికారులు ములాఖత్‌లు నిరాకరిస్తున్నారు. ఇంకా వందల మందిని ఇరికించే కుట్రలో భాగంగా బలవంతంగా సంతకాలు పెట్టించి కన్ఫెషన్ స్టేట్‌మెంట్లు తీసుకుంటున్నారు. పోలీసులు తమ ఇష్టానుసారం స్టేట్‌మెంట్ రాసి, దానిపై బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారని ఇంటూరి రవికిరణ్ మీడియా ముందు చెప్పాడు. – కూటమి నాయకుల మాటలు విని పోలీస్ రూల్స్‌ను ఉల్లంఘిస్తున్న అధికారులను ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదు. అందరి మీదా ప్రైవేట్ కేసులు పెడతామని, వారిని కోర్టు ముందు నిందితులగా నిలబెడతామని మనోహర్‌రెడ్డి తెలిపారు.