తాడేపల్లి: ఏడాది కాలంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికరంగం తిరోగమనంలో ఉందని వైయస్ఆర్‌సీపీ నాయకుడు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురాలేక, గతంలో వైయస్ జగన్ హయాంలో సాధించిన ప్రగతిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుపుల కోసం పరిశ్రమలపై కూటమి నేతల రౌడీయిజం కారణంగా కొత్త పరిశ్రమలు రాకపోవడంతో పాటు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచి పారిపోతున్నాయని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే.... ప్రతిసారీ చంద్రబాబు తన మేనిఫేస్టోలో అబద్దాలే చెప్పుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు గతం, వర్తమానం, భవిష్యత్తు అంతా ఒక అబద్దం. 1999 ఎన్నికల ప్రచారంలో ఇదే చంద్రబాబు కోటి ఉద్యోగాలు కల్పిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. వాటిల్లో కనీసం లక్ష ఉద్యోగాలు అయినా కల్పించారా? ఆయనకు దమ్ముంటే వెల్లడించాలి. అలాగే 2014-19 మధ్య 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించకుంటే నిరుద్యోగభృతి కింద ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.2000 ఇస్తానని హామీ ఇచ్చారు. వీటిల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అలాగే 2024లో ఏకంగా అయిదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని, లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు తీసుకువస్తానని, నిరుద్యోగులకు నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగభృతి ఇస్తానంటూ గొప్పగా వాగ్ధానాలు చేసి యువతను నమ్మించారు. ఏడాది కాలంగా ఈ మూడింటిల్లో ఏ ఒక్కటైనా ముందుకు తీసుకువెళుతున్నారా? 1.50 కోట్ల మంది నిరుద్యోగులకు న్యాయం చేయండి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు గత ఏడాది నిరుద్యోగభృతిని ఎగ్గొట్టేశారు. చంద్రబాబుకు నిత్యం భజనచేసే ఈనాడు పత్రికలోనే రాష్ట్రంలో 1.50 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని, వారంతా ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని రాశారు. ఏ జిల్లాలో ఎంత మంది ఉన్నారో కూడా వివరాలు వెల్లడించారు. మరి వీరందరికీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఏ మేరకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారో చెప్పాలి. మాయమాటలు చెప్పడం, గిమ్మిక్కులతో రాజకీయం చేయడం, రాని పెట్టుబడులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చేసినట్లు ప్రజలను ఎప్పటికప్పుడు మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారు. ట్రెండింగ్‌లో ఉన్న నాలుగు మాటలు గుర్తు పెట్టుకుని వాటిని పదేపదే చెబుతూ తానో విజనరరీని అని చాటుకుంటూ ఉంటారు. సెల్‌ఫోన్‌ను తానే కనిపెట్టాను అని, ఐటీకి తానే ఆద్యుడినని, ఏకంగా హైదరాబాద్‌ను తానే నిర్మించానంటూ నిస్సిగ్గుగా అబద్దాలను గొప్పగా చెప్పుకుంటారు. ఇవన్నీ నిజమేనంటూ ఆయనకు బాకా ఊదే ఎల్లో మీడియా దానిపై పుంఖానుపుంఖాలుగా కథనాలు రాస్తోంది. వైయస్ జగన్ హయాంలో పెట్టుబడుల వెల్లువ వైయస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన అనేక కంపెనీలను, రూ.లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను తానే తీసుకువచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నాడు. దావోస్‌కు వెళ్లి చంద్రబాబు, లోకేష్‌లు ఉత్తి చేతులతో తిరిగి వచ్చిన మాట వాస్తవం కాదా? ఒక్క రూపాయి అయినా వారిని నమ్మి ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారా? జగన్ గారి హయాంలోనే 2023లో ఎన్‌టీసీపీ తొలిసారిగా 1.10 లక్షల కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేసుకునేందుకు విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకుంది. దానికి అన్ని అనుమతులు, భూబదలాయింపులు కూడా వైయస్ జగన్ ప్రభుత్వంలోనే జరిగాయి. అలాగే గ్రీన్ ఎనర్జీ రంగంలో వైయస్ జగన్ రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. కాకినాడలో గ్రీన్‌కో, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ తో ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే దావోస్ లో వైయస్ జగన్ పర్యటనలో ఆర్సల్ మిట్టల్ గ్రూప్ ద్వారా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్‌ను తీసుకువచ్చారు. కానీ చంద్రబాబు వీటన్నింటినీ తానే సాధించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో అశోక్ లేలాండ్ ఏపీలో 2021లో ఉత్పత్తి ప్రారంభించామని, స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్టింగ్ అయినట్లుగా వారు చెబుతుంటే, దానిని లోకేష్ 2025లో ప్రారంభించినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. రూ. 3079 కోట్లతో ఏటీసీ టైర్స్ 2020లో ఆమోదముద్రపడి, 2021లో పనులు ప్రారంభించి, 2022లో దీనిని సీఎంగా వైయస్ జగన్ ప్రారంభించారు. అలాగే శ్రీసిటిలో డైకిన్ సంస్థ 2022లోనే ఉత్పత్తి ప్రారంభించారు. సత్యసాయి జిల్లాలో భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రక్షణ పరికరాల తయారీకి ఒప్పందం చేసుకుంది వైయస్ జగన్ ప్రభుత్వంలోనే. దక్కన్ ఫైన్ కెమికల్స్ కూడా వైయస్ జగన్ గారి హయాంలోనే వచ్చింది. పియుఆర్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్, జూపిటర్ రెన్యూవల్ ,బ్లూజెట్ హెల్త్‌కేర్ లిమిటెడ్, రామభద్రా, మోహన్ స్పిన్ టెక్స్, విన్‌టెక్ మోబైల్ కమ్యూనికేషన్స్, నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్, దేశ్ రాజ్ సోలార్, ఎంప్లాస్ ఎనర్జీ లిమిటెడ్, వరుణ్ హాస్పటాలిటీ ఇలా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వైయస్ జగన్ హయాంలోనే వచ్చాయి. వీటిపై కూటమి ప్రభుత్వంతో బహిరంగ చర్చకు సిద్దం. ఇటీవల జూన్ 23న ఇచ్చిన ఒక ప్రజెంటేషన్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రూ.9.03 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు, 8.5 లక్షల ఉద్యోగాలను కల్పించినట్లుగా చెప్పుకున్నారు. ఇవన్నీ గత ప్రభుత్వంలో వైయస్ జగన్ చొరవతో వచ్చినవి అని నిజం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్‌లో కొన్ని మార్పులు చేసి, ఈ మొత్తం క్రెడిట్ అంతా నాదేనని ప్రచారం చేసుకుంటున్నారు. వేరే వారు చేసిన కృషిని తన ఖాతాలో వేసుకుంటున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో పారిశ్రామికవేత్తలు బెంబేలు రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, పారిశ్రామికవేత్తలపై వాటాలు, కమిషన్లు, ముడుపుల కోసం దాడులు చేస్తుండటంతో వారంతా రాష్ట్రం వదిలి పారిపోతున్న విషయం నిజం కాదా? రాష్ట్రంలో భయానక వాతావరణంలో చంద్రబాబు, లోకేష్‌లను చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారా? ఈ రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు వారి కాంట్రాక్ట్‌లను ఖచ్చితంగా కూటమి నేతలకే ఇవ్వాలనే బెదిరింపులతో వారంతా రాష్ట్రం వదలి పారిపోతున్నారు. వైయస్ జగన్‌పై ఉన్న కక్షతో ప్రముఖ అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్‌లో పూర్తిస్థాయి డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్పను లేని లిక్కర్ స్కామ్‌లో ఇరికించారు. 165 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ వికాట్ కంపెనీకి భారతీ సిమెంట్స్‌లో యాబైఒక్క శాతం వాటా ఉందనే దుగ్ధతోనే గోవిందప్పపై అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులను ఇలా తప్పుడు కేసుల్లో ఇరికిస్తుంటే ఇక ఏ పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రానికి వస్తారు? ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పై ఇలానే వేధింపులకు పాల్పడటంతో ఆయన మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి, మహారాష్ట్రంలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. అల్ట్రాసిమెంట్స్ ప్లాంట్‌పై తాడిపత్రిలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దాడులు చేసి భయోత్పాతం సృష్టించిన మాట వాస్తవం కాదా? గండికోట రిజర్వాయర్‌పై నిర్మిస్తున్న ఆదానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌పై ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడులకు పాల్పడ్డారు. పల్నాడులో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్థానికంగా ఉన్న భవ్య, అంజనీ సిమెంట్స్ ప్లాంట్‌లపై దాడులు చేసి, ముడుపులు డిమాండ్ చేయడంతో ఆ ప్లాంట్‌లు మూతపడ్డాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత శ్రీకాకుళంలోని యూబీ బీర్ల ప్లాంట్‌పై బీజేపీ ఎమ్మెల్యే తనకు ప్రతి లారీకి వెయ్యి రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి, రౌడీయిజం చేసిన మాట వాస్తవం కాదా? జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌ల కోసం ఎంపీ సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి వర్గీయులు కర్రలు, రాళ్ళతో నడిరోడ్డుపై దాడులు చేసుకున్నారు. దాల్మియా, మైహోం సిమెంట్స్ ప్లాంట్‌లపై అనేక వేధింపులకు పాల్పడ్డారు. తాడేపత్రిలో సిమెంట్ కంపెనీకి ఫ్లైయాష్ సరఫరా కోసం జేపీ ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు పోటీపడి పరస్పరం దాడులకు సిద్దమైతే, దానిని పంచాయతీ చేసింది సీఎం చంద్రబాఉబ కాదా? కృష్ణపట్నం పోర్ట్ సెక్యూరిటీ మీద టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనకు వాటాలు ఇవ్వడం లేదని దాడులకు పాల్పడ్డారు. కాకినాడ పోర్ట్‌పై టీడీపీ సానుభూపరుడు కేవీ రావుతో అరబిందో ఫార్మాపై తప్పుడు కేసులు పెట్టి, శరత్చంద్రారెడ్డిపై వేధింపులకు పాల్పడ్డారు. రామాయపట్నం పోర్ట్‌లో వాటాలు ఇవ్వలేదని పోర్ట్‌కు వెళ్లే మెటీరియల్‌ను కందుకూరి టీడీపీ ఎమ్మెల్యే అడ్డుకోవడం నిజం కాదా?ఈ పంచాయతీ కూడా సీఎం కార్యాలయానికికే వచ్చింది. సత్తెనపల్లిలో షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న టీడీపీ నేత గ్రానైట్ రవాణా కోసం బలవంతంగా ముడుపులు వసూలు చేస్తున్నారు. శ్రీకాకుళంలో ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు తనకు ముడుపులు ఇవ్వని కంపెనీలను 'సీజ్ ద కంపెనీ' అంటూ బెదిరిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇలాంటి వ్యవహారాలు చేస్తుంటే ఏ విధంగా ఏపీకి పెట్టుబడులు వున్నాయో చంద్రబాబు చెప్పాలి. ఉద్యోగాల కల్పన ముసుగులో బినామీలకు రూ.వేల కోట్ల భూమి ఉద్యోగాల కల్పన చేస్తామని చంద్రబాబు విలువైన భూములను తమ బినామీ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో ఎకరం రూ.50 కోట్ల విలువైన భూములను అడ్రస్ లేని కంపెనీలకు కట్టబెడుతున్నారు. ఆ భూములను ఏకరం 99 పైసలకే ఇచ్చేస్తున్నారు. ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నంలోని విలువైన భూములను ఎవరి ప్రయోజనాల కోసం ఇస్తున్నారో చెప్పాలి. లీజులకు భూములు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా, అతి తక్కువకు ప్రైవేటు కంపెనీలకు ఏకంగా అన్ని హాక్కులతో అమ్మేస్తున్నారు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటీ? ప్రముఖ కంపెనీలను ముందు పెట్టి, బోగస్ కంపెనీలకు పెద్ద ఎత్తున భూములను అప్పగిస్తున్నారు. విశాఖలో టీసీఎస్‌కు రూ.1058 కోట్ల విలువైన భూములు ఇస్తున్నారు. దానికి గానూ వారు పెట్టే పెట్టుబడి ఎంత అంటే రూ.1370 కోట్లు. అంటే ఒక్కో ఉద్యోగంకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.8.75 లక్షలు. అలాగే ఉర్సా క్లస్టర్ అనే పేరూ, ఊరు లేని ఒక బోకస్ కంపెనీ రూ.5000 కోట్లు పెట్టుబడి పెట్టి, 2500 ఉద్యోగాలు కల్పిస్తానంటే, ఆ కంపెనీకి ప్రభుత్వం ఇస్తున్న భూమి విలువ రూ.3000 కోట్లు. ఈ లెక్కన ఒక్కో ఉద్యోగంకు ప్రభుత్వం చేస్తున్న వ్యయం రూ.1.20 కోట్లు. కాగ్నీజెంట్ పెట్టుబడి రూ.1583 కోట్లు, వారు కల్పించే ఉద్యోగాలు 8వేలు, కానీ కూటమి ప్రభుత్వం వారికి ఇస్తున్న భూమి విలువ రూ.1050 కోట్లు. అంటే ఒక్కో ఉద్యోగానికి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది రూ.13.12 లక్షలు. అలాగే విశాఖలోనే లులూ సంస్థకు 99 ఏళ్ళ లీజుకు ఎకరానికి ఏడాదికి రూ.50 లక్షలు చెల్లించేలా రూ.2000 కోట్ల విలువైన భూమిని ఇస్తోంది. ఆసంస్థ పెట్టే పెట్టుబడి రూ.2200 కోట్లు, వారు కల్పించే ఉద్యోగాలు 7,000. ఇందుకోసం రూ.170 కోట్లు రాయితీల రూపంలో కూడా ఆ సంస్థకు లబ్ధి చేకూరుస్తోంది. అంటే ఒక్కో ఉద్యోగానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.28.57 లక్షలు. దీనిని బట్టి చూస్తే చంద్రబాబు రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించాలి, పెట్టుబడులను ఆకర్షించాలనే ముసుగులో తన బినామీలకు వేల కోట్ల విలువైన భూములను దారాదత్తం చేసి, దాని ద్వారా తాను లబ్ధి పొందాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది.