అగ్రిగోల్డ్‌ బాధితులకు వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీ నెరవేర్చారు 

3.70 లక్షల మంది అగ్రిగోల్డు బాధితులకు సాయం అందజేత

అగ్రిగోల్డు బాధితులకు రూ.1150 కోట్లు మంజూరు

చంద్రబాబు హయాంలోనే  అగ్రిగోల్డు స్కామ్‌ బయటపడింది

అగ్రిగోల్డుపై టీడీపీ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదు

వైయస్‌ఆర్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి

తాడేపల్లి: అగ్రిగోల్డ్‌ బాధితులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చారని వైయస్‌ఆర్‌సీపీ నేత, అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.అగ్రిగోల్డు బాధితులకు రూ.1150 కోట్లు విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డు బాధితులను ఆదుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులుగా ఉన్న వారికి సంబంధించి డబ్బులు చెల్లించే కార్యక్రమం మొదలుకాగా, నిన్ననే రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులకు డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. అందరికీ డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. మరో రూ.856 కోట్లను రెండో విడతగా నిధులు విడుదల చేసిందన్నారు. మొత్తంగా రూ.1150 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో వైయస్‌ జగన్‌ అంటేనే ఓ నమ్మకం, విశ్వాసం ఉందని, ప్రజలంతా భరోసాతో ఉన్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకొని ఖాళీ ఖాజానాను వైయస్‌ జగన్‌కు అప్పగించారన్నారు. అగ్రిగోల్డు బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనలతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వైయస్‌ జగన్‌ తీసుకున్న చొరవ బాధితులు ఎవరూ కూడా జీవితంలో మరిచిపోలేరన్నారు. 14 ఏళ్ల సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు, 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి ఒకసారి ఆలోచన చేయాలన్నారు.  లోకేష్‌, కొందరు మాజీ మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అగ్రిగోల్డు పుట్టిందన్నారు. బాధితులను చంద్రబాబు ఆదుకునే ఆలోచన చేయలేదన్నారు. బాధితులు ఎన్ని ఉద్యమాలు చేసినా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేశారని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డు ఆస్తులను దోచుకునేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు కుట్రలు చేశారన్నారు. అగ్రిగోల్డు పదాన్ని ఉచ్చరించే అర్హత టీడీపీ నేతలకు లేదని హెచ్చరించారు. అగ్రిగోల్డు బాధితులను ఆదుకునేందుకు వైయస్‌ జగన్‌ రూ.1150 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. అగ్రిగోల్డుబాధితులంతా కూడా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ నెల 29న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ సమావేశం ఏర్పాటు చేసి బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని అప్పిరెడ్డి పేర్కొన్నారు. 

Read Also: దాచేపల్లి ఘటనపై సీఎం సీరియస్‌

Back to Top