‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ సీపీ హవా

‘పశ్చిమ’ జెడ్పీ పీఠంపై గంటా పద్మశ్రీ 

మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జెడ్పీ చైర్‌పర్సన్‌గా బీసీ మహిళ ఎన్నిక... గంటా పద్మశ్రీ ప్రమాణస్వీకారం

నర్సీపట్నం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బోడపాటి సుబ్బలక్ష్మి 

ధర్మవరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా కాచర్ల లక్ష్మి 

ఆయా జిల్లాల్లో ఎన్నికైన వారందరూ వైయ‌స్ఆర్‌ సీపీకి చెందిన వారే

అమ‌రావ‌తి : గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో ఏర్పడిన ఖాళీలకు గురువారం జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గత నెల 31న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఆయా స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు జరిగాయి.  

♦ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఏలూరులో ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. అనంతరం పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహించిన కవురు శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి వరించడంతో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠానికి ఖాళీ ఏర్పడింది. దీంతో బీసీ మహిళగా ఉన్న గంటా పద్మశ్రీను ఈ పదవి వరించింది.

జిల్లా పరిషత్‌ ఏర్పడిన అనంతరం బీసీ మహిళగా పద్మశ్రీ మొట్టమొదటి చైర్‌పర్సన్‌ కావడం.. మహిళకు జిల్లా పరిషత్‌ పీఠాన్ని అందించడం పట్ల పార్టీ శ్రేణులు, ప్రజలు సైతం హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సుపరిపాలన అందిస్తానని చెప్పారు. ఇక పద్మశ్రీకి మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వాసుబాబు, వెంకట్రావు, అబ్బయ్యచౌదరి, ఎమ్మెల్సీలు వంకా రవీంద్ర, కవురు శ్రీనివాస్‌ అభినందనలు తెలిపారు.  

♦ ఏలూరు జిల్లా నూజివీడు పురపాలక సంఘం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా 22వ వార్డు వైయ‌స్ఆర్‌ సీపీ కౌన్సిలర్‌ కొమ్ము వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌ చైర్మన్‌ పదవికి గత నెలలో షేక్‌ అమీరున్నీసా­బేగం రాజీనామా చే­య­­డంతో మళ్లీ ఎన్నిక అనివార్యమైంది.  

♦ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలిగా వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీటీసీ ముప్పిడి సరోజని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్‌ ప్రత్యేకాధికారి జీవీకే మల్లికార్జునరావు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.  

♦నర్సీపట్నం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా వైయ‌స్ఆర్‌ సీపీకి చెందిన (ఎస్సీ మహిళకు రిజర్వు) బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్‌ చైర్మన్‌గా కోనేటి రామకష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఇరువురికీ శుభాకాంక్షలు తెలిపారు.  

♦ విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌–1గా ముచ్చు లయయాదవ్‌ (వైయ‌స్ఆర్‌ సీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1వ డివిజన్‌ కార్పొరేటర్‌ అయిన ఆమెను ప్రత్యేక సమావేశంలో సభ్యులంతా ఎన్నుకున్నారు.  

♦ విజయనగరం జిల్లా ఎల్‌.కోట మండల పరిషత్‌ రెండో వైస్‌ ఎంపీపీగా భీమాళి ఎంపీటీసీ (వైయ‌స్ఆర్‌ సీపీ) సభ్యుడు ముధునూరు శ్రీనివాసవర్మరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌ ఎంపీపీగా పనిచేసిన దండేకర్‌కుమారి మరణించడంతో ఎన్నిక అనివార్యమైంది.  

♦గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్‌ రెండో వైస్‌ చైర్‌పర్సన్‌గా 40వ వార్డు వైయ‌స్ఆర్‌ సీపీ కౌన్సిలర్‌ అత్తోట నాగవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ ప్రకటించి, ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.  

♦ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా చేనేత వర్గానికి చెందిన కాచర్ల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, స్థానిక సంస్థలకు సంబంధించి బత్తలపల్లి ఎంపీపీగా అప్పరాచెరువు ఎంపీటీసీ సభ్యురాలు బగ్గిరి త్రివేణి, చెన్నేకొత్తపల్లి వైస్‌ ఎంపీపీ–1గా చెన్నేకొత్తపల్లి–2 ఎంపీటీసీ సభ్యురాలు పి.రాములమ్మను ఎన్నుకున్నారు. ఇక అనంతపురం జిల్లా విడపనకల్లు మండల ఉపాధ్యక్షురాలు–2గా హాంచనహాళ్‌ ఎంపీటీసీ రాకెట్ల పుష్పావతి ఎంపికయ్యారు. కోరం లేకపోవడంతో రాయదుర్గం వైస్‌ ఎంపీపీ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. అన్నిచోట్ల ఎన్నిక ఏకగ్రీవం కాగా, అందరూ వైఎస్సార్‌సీపీకి సంబంధించిన వారే కావడం గమనార్హం. 

♦అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీపీగా జల్లా పద్మావతమ్మ ఎంపికయ్యారు. ఎంపీపీ జల్లా సుదర్శన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో గరిగుపల్లె ఎంపీటీసీ సభ్యురాలు జల్లా పద్మావతమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. 

Back to Top