అడ్డదారుల్ని వెతకడంలో చంద్ర‌బాబుకు పీహెచ్‌డీ ఇవ్వొచ్చు

ఓటర్ల జాబితాపై దొంగే.. దొంగ అన్నట్టు టీడీపీ అరుపులు

ఉరవకొండలో జరిగింది ప్రొసీజర్ తప్పిదాలే.., రాజకీయ జోక్యం లేదు

అక్కడ ఓట్లు తొలగింపు తప్పని ఎన్నికల సంఘం కూడా చెప్పలేదు

వైయస్‌ఆర్‌ సీపీ ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరిస్తోంది

ఉరవకొండలో అక్రమాలంటూ ఈనాడు రామోజీ తప్పుడు ప్రచారం 

దొంగ ఓట్లు చేర్పించే అలవాటు చంద్రబాబుకు, ఆయన శిష్యులకే ఉంది

రాష్ట్రంలో 60 లక్షల దొంగఓట్లు ఉన్నాయని చెప్పడంతో బాబుకు భయం పట్టుకుంది

టీడీపీ హయాంలో నంద్యాలలో ఒకే ఇంటి నంబర్‌పై 700ల‌కు పైగా దొంగ ఓట్లు

2015–17 మధ్య 50 లక్షల వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను బాబు తొలగించాడు

సేవామిత్ర యాప్‌ ద్వారా ప్రజల సమాచారాన్ని చోరీ చేసి.. నిజమైన ఓటర్లను తొలగించారు

టీడీపీ హయాంలో అన్యాయంగా తొలగించిన ఓట్లను పోరాడి చేర్పించాం

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: ఓట్ల తొలగింపుపై టీడీపీ, ఆ పార్టీని నడుపుతున్న రామోజీరావుతో పాటు మరో పత్రిక, ఇతర మీడియా సంస్థలు రంకెలు వేస్తున్నాయని, టీడీపీ క్రియేట్‌ చేస్తున్న గందరగోళం చూస్తుంటే దొంగే దొంగ.. దొంగ అన్నట్టుగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉరవకొండలో ఓట్ల తొలగింపులో సరైన ప్రొసీజర్‌ ఫాలో కాని ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడిందని చెప్పారు. ఉరవకొండలో అక్రమాలంటూ ఈనాడు రామోజీరావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తోందని చెప్పారు. తప్పుడు పనులు చేయడం తప్ప మరే అలవాటు లేని టీడీపీ.. అధికారంలో ఉండగా ఆధారాలతో సహా అడ్డంగా దొరికినవారు పతివ్రత కబ్లుర్లు చెప్పడం, అధికార వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఎదురుదాడి చేయడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోందని సజ్జల అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

‘‘టీడీపీ చేస్తున్న గోబెల్స్‌ ప్రచారం తప్పు అని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. గతంలో ఓట్ల తొలగింపులో టీడీపీ తప్పు చేస్తే.. దాన్ని సరిదిద్దింది వైయస్‌ఆర్‌ సీపీ. ఆరోజున వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఎంపీలందరూ ఢిల్లీకి వెళ్లి పిటీషన్లు వేశారు. రోజున చంద్రబాబు వైరల్‌లా పనిచేస్తూ ఓటర్ల జాబితాను మ్యానిపులేట్‌ చేసి లక్షలాది ఓట్లను ఎలా తీశారని బయటకు తీసి, జాబితాను సరిదిద్దేలా అప్పట్లో ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లి కరెక్ట్‌ చేయించగలిగాం. 

టక్కుటమార విద్యలు, సిస్టమ్స్‌ను మేనేజ్‌ చేయడం, అడ్డదారుల్లోనూ దారులు వేసుకోవడంలో చంద్రబాబుకు ఎన్ని పీహెచ్‌డీలు అయినా ఇవ్వొచ్చు, అంతర్జాతీయ అవార్డులు ఇవ్వొచ్చు. చంద్రబాబుకు పూర్తి వ్యతిరేకంగా సీఎం వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వం ఉంది. జనం కోసం నిలబడాలి, జనంతో నిలబడాలి, జనం మెప్పు పొందాలి తద్వారా ఎన్నికల పరీక్ష పాస్‌ కావాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ఫిలాసఫీ. చంద్రబాబు విద్యలు ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు తన విద్యలను అఖిల భారత స్థాయిలోనూ ప్రదర్శించారు

డూబ్లికేట్‌ ఓట్లు, ఫేక్‌ ఓట్లు రాష్ట్రంలో దాదాపు 60 లక్షల వరకు ఉన్నాయని తెలిశాక.. వీటన్నింటినీ కంప్లీట్‌గా తొలగించే కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నుంచి మొదలైంది. 60 లక్షల బోగస్‌ ఓట్లు, డూబ్లికేట్‌ ఓట్లు ఎవరివో ఇప్పటి వరకు తెలియదు. రెండో ఓటు వేయించడం, దొంగ ఓట్లు వేయించే అలవాటు, ఆలోచన వైయస్‌ఆర్‌సీపీకి లేదు. ఎన్నికల కమిషన్‌ సమ్మరీ రివిజన్‌కు పెట్టిన ప్రొవిజన్‌ను ఆసరా చేసుకొని బూత్‌ లెవల్‌ ఏజెంట్లను పెట్టి పక్కాగా ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తే.. వాటిని తొలగిస్తే నిజమైన ఓటర్‌ ఉంటాడు.. తీర్పు కచ్చితంగా వస్తుందనేది వైయస్‌ఆర్‌ సీపీ కోరిక. 

ఇది సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు.. మా పార్టీ సీరియస్‌గా ఆ దిశగా అడుగులు వేస్తున్నప్పటి నుంచి టీడీపీ ఒంట్లో వణుకు మొదలైంది. కుప్పంలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో అందరికీ తెలుసు. విశాఖ ఈస్ట్‌లో 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఎమ్మెల్యే 30 వేల ఓట్లు చేర్పించాడు. ఒక్కసారే 30 వేల కోట్లు ఎలా వస్తాయి..? కుప్పం ఓటర్ల జాబితా దులిపితే 30–40 వేలకు పైగా దొంగ ఓట్లు బయటపడ్డాయి. చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బాబుకు తెలియకుండా అన్ని వేల ఓట్లు వస్తాయా అనేది రాష్ట్రం, దేశమంతా తెలుసు. దొంగ ఓట్లు చేర్పించే అలవాటు చంద్రబాబుకు, ఆయన శిష్యులకు ఉంది. ఈ 60 లక్షల బోగస్‌ ఓట్లు టీడీపీవే అయ్యుండాలి. 

60 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నాయని తెలిసినప్పటి నుంచి చంద్రబాబులో భయం మొదలైంది. నంద్యాలలో ఒక బూత్‌లో ఒకే ఇంటి నంబర్‌పై 700లకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయి. అవి ఇప్పటికీ ఉన్నాయి. దొంగ ఓట్ల తొలగింపునకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతుంది కాబట్టి వాటిని తొలగిస్తారు. టీడీపీ గతంలో అన్యాయంగా వైయస్‌ఆర్‌ సీపీ ఓటర్లను తీయించింది. వాటిని మళ్లీ ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లి చాలా వరకు గతంలోనే చేర్పించగలిగాం.  

ఇటీవల రామోజీరావు బ్యానర్‌ హెడ్డింగ్‌ ‘ఊరూరా ఉరవకొండలే’ అని రాశాడు. ఉరవకొండలో అధికారిని సస్పెండ్‌ చేసిన దాన్ని తీసుకొని ఓ కల్పిత కథనాన్ని రాశాడు. సున్నా డోర్‌ నంబర్‌తో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఓట్లు ఉన్నాయి. మరోసారి విలేకరుల సమావేశం పెట్టినప్పుడు వివరిస్తాను. విలేకరులకు మెటీరియల్‌ అందిస్తాం. టీడీపీ హయాంలో ఆల్ఫాబెట్‌లో మూడు అక్షరాలు తప్ప డోర్‌ నంబర్‌ ఏ నుంచి జెడ్‌ వరకు అన్నీ పెట్టారు. ఒకే ఇంటి నంబర్‌ మీద 700 ఓట్లు పెట్టారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. అలాగే వైయస్‌ఆర్‌సీపీ ఓటర్లను అన్యాయంగా తొలగించారు. 

ఉరవకొండలో ఏం జరిగిందంటే.. మొదట స్వరూపరాణి అనే మహిళా అధికారి. ఆమె 06–07–17 నుంచి 30–04–21 వరకు జెడ్పీ సీఈవోగా ఉన్నారు. ఆమె విధుల్లో ఉండగా 4,081 ఓట్లు డిలీట్‌ అయ్యాయి. తరువాత భాస్కర్‌ రెడ్డి అనే అధికారి వచ్చారు. 24–06–21 నుంచి సస్పెండ్‌ అయ్యేంత వరకు ఆయనే విధుల్లో ఉన్నారు. ఆయన హయాంలో 2,077 ఓట్లు డిలీట్‌ అయ్యాయి. దీంట్లో ప్రొసీజర్‌ ఎన్‌ల్యాప్స్‌తో 2,912 ఓట్లు డిలీట్‌ అయ్యాయని ఎలక్షన్‌ కమిషన్‌ పరిశీలన చేపట్టింది. టీడీపీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్‌ అప్లికేషన్‌ పెట్టడంతో ఇది జరిగింది. ఓట్ల తొలగింపు తప్పు అని ఎన్నికల కమిషన్‌ చెప్పలేదు.. ఓట్ల తొలగింపు నిబంధనలు సరిగ్గా పాటించలేదని వారిని సస్పెండ్‌ చేశారు. ఫామ్‌–7 వచ్చిన తరువాత ఫామ్‌–13లో కంప్లయింట్‌ ఇచ్చిన వారి సంతకం తీసుకోవడం, ఫామ్‌–14లో ఓటర్, పక్కింటి వారితో సంతకం తీసుకోవడం వీటిలో ప్రాసెస్‌ సరిగ్గా ఫాలో కాకపోవడంతో దాని గురించి యాక్షన్‌ తీసుకున్నారు. అధికారులు ఫాలో అయిన ప్రొసీజర్‌ బాగోలేదని సస్పెండ్‌ చేస్తే దీనికి ఎందుకు గగ్గోలు పెడుతున్నారు. 

టీడీపీ అధికారంలో ఉండగా 2015 నుంచి 2017 వరకు దాదాపు 50.525 లక్షల ఓట్లు జాబితా నుంచి తీయించేశారు. 2014 ఎన్నికలకు ముందు 3.68 కోట్ల ఓటర్లు ఉంటే.. ఆ తర్వాత (2018 నాటికి) 3.51 కోట్లకు పడిపోయాయి. మాకు అప్పుడు అలారం మోగింది. అప్పటిదాకా ఓటర్ల జాబితాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఏం అక్రమాలు చేస్తుందో తెలియదు. ఎప్పుడైతే, ఒక్కసారిగా లక్షల ఓట్లును తీయించేశారని తెలిసినప్పుడు దానిపై దృష్టిపెట్టాం. చంద్రబాబు కుట్రను ఛేదించడానికి 2018 నుంచి 2019 వరకు వైయ‌స్‌ఆర్‌సీపీ పోరాడింది.  

బ్లూఫ్రాగ్‌ అనే కంపెనీకి చంద్రబాబు గవర్నమెంట్‌లో డేటా యాక్సిస్‌ ఇచ్చారు. బ్లూఫ్రాగ్‌ ఐటీ గ్రిడ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ గ్రిడ్స్‌ అనే సంస్థ చంద్రబాబుకు, లోకేష్‌కు సన్నిహితుడైన అశోక్‌కు చెందినది తేల్చి కేసు పెట్టాం. వీరంతా కలిసి సేవామిత్ర అనే యాప్‌ రూపొందించి.. డెరెక్ట్‌గా టీడీపీ బూత్‌ కన్వీనర్లకు అటాచ్‌ చేశారు. సేవా మిత్ర యాప్‌ను రాష్ట్రమంతా టీడీపీ కార్యకర్తల చేతుల్లో పెట్టి.. బ్లూఫ్రాగ్‌ కంపెనీకి అఫీషియల్‌గా ఇచ్చిన డేటాను ఐటీగ్రిడ్స్‌ ద్వారా వారికి పంపించి.. అక్కడ నుంచి ఓటర్లను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఫామ్‌–7 ఆటోమెటిక్‌గా ఫిల్‌ అయ్యేలా చేశారు. దీంట్లో వైయస్‌ఆర్‌ సీపీ ఓటర్లను గుర్తించేందుకు డైరెక్ట్‌ క్వశ్చన్స్‌తో పాటు ఏ ఛానల్‌ చూస్తారు..? ఏ పేపర్‌ చదువుతారు అని ప్రశ్నలేసి.. సాక్షి అని చెబితే వైయస్‌ఆర్‌ సీపీ వారని తొలగించడం.. ఇలా 50 లక్షలకు పైగా ఓట్లను చంద్రబాబు తొలగించాడు. 

వైయస్‌ఆర్‌ సీపీ ఈసీ దగ్గరకు వెళ్లి పోరాడి చేయించడం ద్వారా 2019 నాటికి 31.97 వేల ఓట్లను లీగల్‌గా చేర్చగలిగాం. 2019 నాటికి మొత్తం ఓటర్లు 3.98 కోట్లకు చేరింది. ఈరోజు 3.97 కోట్లు ఉంది. 2022లో తొలగించినవి 11 లక్షలు ఉన్నాయి. దానికి కారణం కూడా ఎలక్షన్‌ కమిషన్‌ చెప్పింది. సెకండ్‌ ఓటు ఉన్నవి 10 లక్షలు, ఆధార్‌ లింక్‌ చేయడం వల్ల కొన్ని తొలగిపోయాయని ఎలక్షన్‌ కమిషన్‌ వివరణ ఇచ్చింది. 
 

Back to Top