తాడేపల్లి: బడుగు, బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో సరికొత్త చరిత్రను సృష్టించారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా పదవులు కేటాయించడం జరిగింది. 86 స్థానాలకు గానూ 78 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో కూర్చోబెట్టామన్నారు. 86 స్థానాల్లో 52 మంది మహిళలను మేయర్లు, మున్సిపల్ చైర్మన్లుగా ఎంపిక చేశామన్నారు. చట్టం చెప్పినదానికంటే మిన్నగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు ఇవ్వడంతో పాటు మహిళలకూ ప్రాధాన్యత కల్పించామని సగర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా స్వీప్ చేసిన వైయస్‌ఆర్ సీపీ.. అన్ని చోట్ల పాలక మండళ్లు ఏర్పాటు చేసుకుంటుంది. మైదుకూరులో జనసేన కౌన్సిలర్ తటస్థంగా ఉండటంతో ఎక్స్‌అఫీషియో మెంబర్స్‌తో కలిపి చైర్మన్, వైస్ చైర్మన్ వైయస్‌ఆర్ సీపీ గెలుచుకుంది. మైదుకూరు, తాడిపత్రిలో ప్రలోభాలకు గురిచేయడం, చంద్రబాబు హయాంలో జరిగినట్టు అధికార దుర్వినియోగానికి పాల్పడటం.. అలాంటివేవీ వైయస్‌ఆర్ సీపీ చేయలేదని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఏది జరిగినా పారదర్శకంగా, ప్రజల ఇష్టం వెనకాలే మనం ఉండాలి తప్ప.. అధికారంలో ఉన్నామని, మనకు అనుకూలంగా ఏదో చేయాలనే ప్రయత్నాలు వద్దూ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందునుంచి చెబుతున్నారు. ఏ వర్గాలు ఎక్కువ ఉంటే.. ఆ వర్గాలకు పూర్తి ప్రాతినిధ్యం ఇచ్చి.. వారే పరిపాలన చేసుకుంటే.. సంక్షేమం కిందిస్థాయి వరకు వెళ్తుందని సీఎం వైయస్ జగన్ గట్టిగా నమ్మారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 86 స్థానాలకు గానూ 78 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో కూర్చోబెట్టాం. దేశ చరిత్రలోనే ఇదో అరుదైన ఘట్టం. చట్ట ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 45 పదవులు ఇవ్వాల్సి ఉండగా సీఎం వైయస్ జగన్ 67 మందికి ఈ వర్గాల నుంచి ప్రాతినిధ్యం కల్పించారు. సగర్వంగా చెప్పుకునే ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. 70 శాతం పైగా జనాభా ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు అందుకు తగ్గట్టుగా పదవులు కల్పించాం. మాటల్లో కాకుండా చేతల్లో పూర్తిగా దేశంలో ఇంత సాఫీగా చేయగలిగిన నాయకుడు వైయస్ జగన్ అని గర్వంగా చెబుతున్నాం. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ వచ్చాకే.. మహిళలకు చట్టానికి మించి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. సంక్షేమ పథకాల్లో, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌తో సహా అక్కచెల్లెమ్మలకు పూర్తి అధికారం కల్పిస్తూ సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా హర్షించారు. 86కు గానూ 42 పదవులు చట్టప్రకారం ఇవ్వాల్సి ఉండగా 52 మందికి అంటే 60.4 శాతం మహిళా చైర్‌పర్సన్, మేయర్లను ఎంపిక చేశాం. బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు.. బ్యాక్‌బోన్ క్లాస్ అనేది సీఎం వైయస్ జగన్ నినాదం. బీసీలకు మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో చట్టానికి మించి చేశాం. మైనార్టీలతో కలిపి బీసీలకు 30 స్థానాలు ఇస్తే సరిపోతుండగా.. 86లో 52 స్థానాలు మేయర్, చైర్మన్ పదవులను సీఎం వైయస్ జగన్ ఇచ్చారు. బీసీలకు 40 స్థానాలు అంటే 46.51 శాతం, మైనార్టీలు 12 స్థానాలు అంటే 13.95 శాతం, మహిళలకు 52 మందికి అంటే 60.4 శాతం ఇవ్వడం దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా అందరూ గమనించాలి. ఎన్నికల ప్రణాళికలో కూడా మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశాం. తొలిగా ఏర్పాటైన మంత్రివర్గంలో 60 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు ఇచ్చారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారు. రాజ్యసభకు నలుగురిని పంపితే అందులో ఇద్దరు బీసీలు ఉన్నారు. ఈ మధ్య ఇచ్చిన ఆరు ఎమ్మెల్సీల్లో సింహభాగం ఈ వర్గాలే. ఆలయ ట్రస్టు బోర్డులు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు 50 శాతం ఇవ్వాలనే సూత్రాన్ని పాటించి చట్టం చేశాం. ఇవన్నీ చేసి ముఖ్యమంత్రి వైయస్ జగన్ దేశంలో సరికొత్త చరిత్రను సృష్టించారు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.