ఎన్నికల సంఘంలో టీడీపీ కోవర్టులు ఉన్నారు

చంద్రబాబు ట్వీట్‌ను ఈసీ ఉద్యోగులు ప్రమోట్‌ చేశారు

టీడీపీ మొదటి నుంచి ఎలక్షన్‌ కోట్‌ ఉల్లంఘిస్తూనే ఉంది

అన్ని అధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం

వైయస్‌ఆర్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి

 

విజయవాడ: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రరాష్ట్రంలో అధికార పార్టీ కోడ్‌ ఉల్లంఘించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి వైయస్‌ఆర్‌ సీపీ ఎన్నికల అధికార ప్రతినిధిగా ఉన్ననని, మొదటి నుంచి చంద్రబాబు, టీడీపీ కోడ్‌ ఉల్లంఘిస్తూనే ఉన్నారన్నారు. విశాఖ మీటింగ్‌లో సొంత డబ్బులు ఇవ్వడానికి అడ్డుపడుతున్నారు కాబట్టి ప్రభుత్వ డబ్బులు పంచుతున్నానను ఓటేయండి అని చంద్రబాబు మాట్లాడారని గుర్తు చేశారు. 

ఎన్నికల సంఘంలోనే తెలుగుదేశం పార్టీ కోవర్టులు ఉన్నారని ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. ఎన్నికల సంఘంలో పర్మిషన్‌ తీసుకొని వాహనంలో నెల్లూరు వెళితే.. కొవ్వూరు నియోజకవర్గంలో ఒక ఎస్‌ఐ వచ్చి నాలుగు గంటలు ఆపేశారని, వారికి తాను అదే రూట్లో వస్తున్నానే సమయం ఎలా వచ్చింది. ఎందుకు నాలుగు గంటలు ఆపేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు కూడా చేశామన్నారు. ఎన్నికల కమిషన్‌ సోషల్‌ మీడియా కోసం కొంత మంది వలంటీర్స్‌ను తీసుకున్నారని,  చంద్రబాబు తక్కువ కొటేషన్‌ వేసి టీడీపీ కార్యకర్తలను అందులో జొప్పించారన్నారు. రాష్ట్రంలో 92,000 ఈవీఎంలు పనిచేస్తే అందులో 440 ఈవీఎంలు మాత్రమే మొరాయించాయి. వాటిని కూడా పోలింగ్‌ రోజు 10 గంటల్లోపు సరిచేశారు. 30 శాతం ఈవీఎంలు మొరాయించాయని చంద్రబాబు ట్వీట్‌ చేస్తే.. ఎన్నికల సంఘంలో ఉన్న ఉద్యోగస్తులు దాన్ని ప్రమోట్‌ చేశారు. దీనిపై కూడా ఫిర్యాదు చేశామని నాగిరెడ్డి అన్నారు. 

 

Back to Top