శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభా పక్ష నేత పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిది అక్రమ అరెస్టు అని వైయస్ఆర్‌సీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తేల్చి చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... సుపరిపాలన మొదటి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయని ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు తనకు తెలిసిన డైవర్షన్ పాలిటిక్స్ ను మరోసారి ప్రయోగించారని.. అందులో భాగమే వైయస్ఆర్‌సీపీ నేతల అక్రమ అరెస్టులు ఆని ఆయన తేల్చి చెప్పారు. వైయస్ఆర్‌సీపీదీ అత్యంత పారదర్శక లిక్కర్ పాలసీ కాగా... టీడీపి పాలసీలో అడుగడుగునా అక్రమాలే అని సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు నిపుణుడు వారం రోజుల క్రితం మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ సర్వే రిపోర్టు ప్రకారం... 98 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాన్ని తెలిపేలా ఓ సర్వే విడుదల అయింది. సుపరిపాలన మొదటి అడుగు పేరుతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లే ప్రయత్నంలో ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. తమను న్యాయం జరగడం లేదని నిలదీస్తున్న ప్రజలను చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుకు తెలిసిన గొప్ప రాజకీయ విద్య డైవర్షన్. దేశంలో చంద్రబాబు చేసినంత సులభంగా మరే రాజకీయ నేత ఈ విధంగా డైవర్షన్ చేయలేరు. అందులో భాగంగానే మిధున్ రెడ్డి అరెస్టు జరిగింది. అసలు ఆయన అరెస్టుకు సరైన గ్రౌండ్ లేదు. లిక్కర్ స్కాం అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎల్లో మీడియాలో మొదట లిక్కర్ పాలసీ వల్ల రూ.30 వేల కోట్లు స్కాం జరిగిందని రాశారు. ఆ తర్వాత రూ.20 వేల కోట్లు, రూ.15 వేల కోట్లు, రూ.4 వేల కోట్లు అని చివరకు రూ.2-3 వేల కోట్ల స్కాం అన్నారు. వాళ్ల మాటల మీద వాళ్లకే నిలకడ లేదు. ప్రభుత్వమే షాపులు నడిపితే స్కాం జరగదు... ప్రయివేటు వ్యక్తులకు లిక్కర్ షాపులు ఇస్తే స్కాం జరిగే అవకాశం ఉంది. వారికి లిక్కర్ షాపులు ఇచ్చేటప్పుడు ఆ టెండర్ల లోనో, పాలసీ అంశాలమీదనో, మార్జిన్ పర్సెంటేజ్ మీదో, ఇండెంట్ పెట్టినప్పుడో స్కాం జరగడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం షాపులు నిర్వహిస్తున్నప్పుడు ఆదాయం పెంచాలి, లిక్కర్ సేల్స్ తగ్గించాలన్నదే ప్రధాన ఉద్దేశం. అప్పుడు స్కాం జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉంది. ఏది స్కామ్.? ఎవరిది స్కామ్.? 2014-19 చంద్రబాబు సారధ్యంలో 4380 లిక్కర్ షాపులు ఉండేవి. అవి అన్నీ ప్రయివేటు షాపులు చేతుల్లో ఉండేవి. అంటే వాళ్లందరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానే ప్రభుత్వంలో భాగమే. ఆ షాపుల సంఖ్యకు సమానంగా పర్మిట్ షాపులు ఉండేవి. రాష్ట్రంలో 40 వేల పైగా బెల్టుషాపులు ఉండేవి. వీటిన్నింటికీ మద్యం సేకరణ కోసం 20 డిస్టిలరీలు ఉంటే... కేవలం 5 డిస్టలరీలకే 70 శాతం మద్యం కొనుగోళ్లకు ఆర్డర్స్ ఇచ్చారు. మిగిలిన 15 డిస్టలరీలు అన్నింటికీ కలిపి కేవలం 30 శాతం ఆర్డర్లు ఇచ్చేవారు. కేవలం 5 డిస్టలరీలకు 70 శాతం ఆర్డర్లు ఇవ్వడం స్కామా.? లేదంటే 20 డిస్టలరీలకు వాళ్ల డిమాండ్ ను బట్టి అందరికీ సమానంగా ఆర్డర్లు ఇవ్వడం స్కామా.? ఇది చంద్రబాబు గారి పాలసీకి, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలసీకి తేడా. ప్రజలందరూ ఈ విషయాలను గమనించాలి. లిక్కర్ స్కామ్ ప్రభుత్వ సృష్టి. ఇవాళ చంద్రబాబు ఏరికోరి, ఎంచుకుని నియమించుకున్న అధికారులతో కూడిన సిట్ .. కొంతమంది డిస్టలరీలు తమకు ఎక్కువగా ఆర్డర్స్ రాలేదని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రధానమైన లిక్కర్ బ్రాండ్స్ కాకుండా ఇతర బ్రాండ్లకు ఆర్డర్లు ఇచ్చారు అది తప్పు అని ఫిర్యాదు చేశారు. 2024 ఆగష్టు 26వ తేదీన టీడీపీ సానుభూతిపరుడు.. లిక్కర్ పాలసీ వల్ల అక్రమాలు జరిగాయని రెవెన్యూ సెక్రటరీకి ఫిర్యాదు చేశాడు. ఆయన విచారణకు ఆదేశిస్తే... లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని విచారణ కమిటీ పొందుపరుస్తే.. వాటిని ఆధారంగా చేసుకుని సుమారు నెల రోజుల వ్యవధిలో సెప్టెంబరు 24వ తేదీన అదే రెవెన్యూ సెక్రటరీ సీఐడీకి లిఖిత పూర్వతంగా ఫిర్యాదు చేశారు. ఇక్కడే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని మనకు అర్ధం అవుతుంది. కేవలం 28 రోజుల్లో ఒక స్టోరీని మసాలా వేసి దట్టించి వండి... ఒక ప్రణాళిక ప్రకారం ఫిర్యాదు చేయించి, విచారణ కమిటీ వేసి... రెవెన్యూ సెక్రటరీ సిఐడికి ఫిర్యాదు చేశారు. 2019-24లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మద్యపాన నియంత్రణ లక్ష్యంగా పనిచేసింది. ప్రభుత్వ ఆదాయం తగ్గిపోకుండా.. అమ్మకాలు, వినియోగాన్ని తగ్గించాలన్నది లక్ష్యం. అందుకోసం 4300 లిక్కర్ షాపులుంటే వాటిని 2900 కు తగ్గించాం. పర్మిట్ రూములను రద్దు చేశాం. బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేశాం. మద్యం సేకరణ కూడా ఏపీఎస్ బీ సీఎల్ డిమాండ్ ను బట్టి చేశారు. లిక్కర్ షాపు దగ్గర అమ్మే ప్రతి లిక్కర్ బాటిల్ ను స్కాన్ చేసి అమ్మకాలు జరిపేవారు. అప్పటిలో 20 డిస్టలరీలు ఉండేవి.. వీటిలో ఏ ఒక్కదానికి కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనుమతులు ఇచ్చినవి కావు. ఇందులో 14 డిస్టలరీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుమతి ఇవ్వగా...మిగిలినవి వివిధ సందర్భాలలో అనుమతులు ఇచ్చినవి. అదే టైంలో బాటిల్ ధర కూడా చంద్రబాబు హయాంలో ఎంత ధర నిర్ణయించారో... అదే ధరకి అత్యంత పారదర్శకంగా ప్రొక్యూర్ మెంట్, సేల్ చేశారు. ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలో హై ఎండ్ బ్రాండ్స్ ఉద్దేశపూర్వకంగా అమ్మలేదని.. ఇతర బ్రాండ్ల తయారీ దారుల దగ్గర కమిషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చారని ఉంది. వాస్తవానికి హై ఎండ్ లిక్కర్ కంపెనీల డిస్టలరీలకు చంద్రబాబు టైంలో అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి ప్రోక్యూర్ చేసుకునేవారు. ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం అలా చేసింది. అది స్కామ్ కాదా వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అలా అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వడం కుదరదని చెప్పింది. అందరు ఎలా సరఫరా చేస్తున్నరా మీరు కూడా అలా చేయాలని చెప్పింది. మీ బ్రాండ్స్ మూవ్ అయితే ఆటోమేటిక్ గా ఇండెంట్స్ ప్లేస్ చేస్తామని చెప్పింది. ఏది స్కాం అవుతుంది. అడ్వాన్స్ పేమెంట్స్ సేల్ తో సంబంధం లేకుండా ఇవ్వడమా.. అందరితో పాటు మీక్కూడా విధానం ఉంటుంది, ప్రత్యేకంగా ఉండదు అని చెప్పింది. దీంతో హై ఎండ్ బ్రాండ్స్ కంపెనీలు మాకు బకాయిలు చెల్లించాలని పట్టుబడ్డారు. అవీ పే చేయము అని చెప్పాం. అవన్నీ చంద్రబాబు టైం నుంచి ఉన్న పెండింగ్ బకాయిలు. కొంత కాలానికి వారి బకాయిలు అన్నీ మా ప్రభుత్వ హయాంలో చెల్లించాం. ఆ తర్వాత మరలా వాళ్లు అడ్వాన్స్ పేమెంట్ కోసం పట్టుబట్టారు. ఆ విధానం చెల్లదని చెప్పాం. దీనిమీద వాళ్లు (కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) సీసీఐ లో కేసు వేశారు. వాళ్లు కూడా ప్రభుత్వం తప్పులేదని చెప్పింది. ఇంత పారదర్శకంగా జరిగితే... ఈ ప్రభుత్వం భయంకరమైన కక్ష సాధింపు చేస్తోంది. మీడియా ట్రయిల్స్- అసత్య కథనాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎల్లోమీడియాలో ముందే రాస్తారు. ఏకంగా బిగ్ బాస్ అని రాశారు. ఛార్జ్ షీట్ లో ఏం ఉందో ఎవరికీ తెలియదు. కోర్టులో ఏం ప్రెజెంట్ చేస్తారో ఎవరికీ తెలియదు. ఎల్లో మీడియాలో రాస్తారు. దాన్ని బేస్ చేసుకుని అధికారులు దాన్ని కోర్టులో సమర్పిస్తారు. ఏ రకమైన ప్రపంచంలో మనం ఉన్నాం. మీడియాలో జరుగుతున్న ఈ అసత్య ప్రచారాలు ఏమిటి?. ఈ మీడియా ట్రయిల్స్ ఏంటి. చంద్రబాబు చేస్తున్న ఈ రకమైన దుష్టసంప్రదాయం అనేక పరిణామాలకు దారితీస్తుంది. ఆయన వేసిన విష విత్తనం అనేక రకాల పరిణామాలకు దారి తీస్తుంది.ఈ విషయం గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. మీడియా ట్రయిల్స్ లో ఎన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు అంటే రూ.30 వేల కోట్ల దగ్గర మొదలు పెట్టి రూ.2 వేల కోట్ల దగ్గరకి తీసుకొచ్చారు. ఇంత పెద్ద స్కాం జరిగితే ఎక్కడైనా రికవరీ జరిగిందా? ఏమైనా ఆధారాలున్నాయా ? సిట్ ఛార్జ్ షీట్ - రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే నిన్న ఛార్జ్ షీట్ సబ్‌మిట్ చేశారు. అందులో నిందితుల నుంచి తీసుకున్న వాంగ్మూలాలు అని పొందుపరిచారు. ప్రధానమైనది ఏబీఎస్ బీ సీ ఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిగారు స్టేట్మెంట్ ఉంది. ఆయన స్టేట్మెంట్ కు ఏమైనా విలువ ఉంటుందా.? ఆయన్ను ఏ-1 చేర్చి అరెస్టు చేస్తున్నప్పుడు ఆయన సంతకం పెట్టడానికి నిరాకరించాడు. సిట్ అధికారులు వేధిస్తున్నారని వాసుదేవరెడ్డి మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించాడు. ఫలానా రకంగా స్మేట్మెంట్ ఇవ్వాలని బలవంతం పెడుతున్నారు, వాళ్లే స్టేట్మెంట్ తయారు చేసి దానిమీద సంతకం పెట్టమని నన్ను బలవంతం పెడుతున్నారని హైకోర్టును ఆశ్రయించిన మాట వాస్తవం కాదా.? వాళ్ల కుటుంబ సభ్యులనూ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఆయన డిప్యూటేషన్ రద్దు చేసుకుంటే రిలీవ్ చేయకుండా వేధించారు. చివరకు ఆయన రాజీపడి సిట్ అధికారులు తయారు చేసిన స్టేట్మెంట్ మీద సంతకం పెట్టాడు. దానికి ఏమైనా విలువ ఉంటుందా? దాన్ని ఆధారంగా చేసుకుని ఈ కేసు నడిపిస్తున్నారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ వాళ్లే రాసుకున్నారు, తప్పుడు సాక్షులను వాళ్లే సృష్టించుకున్నారు. తప్పుడు కధనాలు వాళ్లే రాసుకున్నారు. లేని స్కామ్ ని సృష్టించి ఈ రోజు ఇంత హంగామా చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ గమనించమని కోరుతున్నాను. ఇదంతా లోకేష్ గొప్పగా చెప్పుకునే రెడ్ బుక్ రాజ్యాంగంలో బాగంగా ఆయన కనుసన్నల్లో జరుగుతుంది. ఆయన ఒక్కో పేజీలో కొన్ని పేర్లు రాసుకున్నారు. దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు. ఇంత అరాచక పాలన దేశంలో ఎక్కడా ఉండదు. మిధున్ రెడ్డిది అక్రమ అరెస్టే మిధున్ రెడ్డిగారిని అరెస్టు చేశారు. ఆయనకు ఈ కేసుతో ఏం సంబందం. ఒక ఎంపీగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో ఏం పాత్ర ఉంటుందని నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అరెస్టు వారెంటు జారీ చేయండని సిట్ ఏసీబీ కోర్టులో వేస్తే.. కోర్టు దాన్ని కూడా నిరాకరించింది. ఇన్ని జరుగుతున్నా ఎవరి కళ్లల్లో సంతోషం చూడ్డానికని, ఎవరినో సంతృప్తి పరచడానికని.. ఎవరినో డీమోరలైజ్ చేయడానికి చేస్తున్న అక్రమ అరెస్టులు తప్ప మరొక్కటి కాదు. ఐపీసీ 409 సెక్షన్ నమోదు చేశారు. అంటే క్రిమినల్ కాన్స్ ప్రసీ అంటే నేరపూరితమైన కుట్ర అని అర్ధం. ఇందులో అసలు కుట్ర ఎక్కడ ఉంది. పాలసీ అత్యంత పారదర్శకంగా ఉంది. ముఖ్యంగా హై ఎండ్ లిక్కర్ కంపెనీలను సంతృప్తి చేయడానికి పాలసీ చేయలేదు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ప్రొక్యూర్ మెంట్ నుంచి సఫ్లై, సేల్ అన్నీ డిజిటల్ పేమెంట్స్ చేస్తూ.. షాపులు తగ్గించాం. అదే టైంలో ప్రబుత్వ ఆదాయం పెరిగింది. పన్నులు పెంచి ప్రభుత్వ ఆదాయాలు పెంచామే తప్ప అమ్మకాలు పెంచి ఆదాయం పెంచలేదు. 2014-19 వరకు చంద్రబాబు హయాం చూస్తే.. లిక్కర్ అమ్మకాలు పెరుగుతూనే ఉంటాయి. చివరి సంవత్సరంలో లిక్కర్ మీద ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.13వేల కోట్లు చూపించారు. మన ప్రభుత్వ హయాంలో చూస్తే అమ్మకాలు క్రమేణా తగ్గుతూ వస్తాయి. కానీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2023-24 సంవత్సరానికి రూ.26వేల కోట్లు వచ్చింది. అమ్మకాలు తగ్గించి టాక్స్ లు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయానికి పెంచే కార్యక్రమం చేస్తే దాన్నే స్కామ్ అంటున్నారు. 2014-19లో మీరు మీ సొంత మనుషులకి ప్రయివేటు షాపులు కట్టబెట్టారు. పర్మిట్ రూములు, బెల్టుషాపులు కట్టబెట్టారు.మీకు నచ్చిన డిస్టలరీ కంపెనీలకు 70 శాతం ఆర్డర్లు కట్టబెట్టారు. అది స్కామ్ కాదా? ఆకస్మాత్తుగా ఆర్థికశాఖ అనుమతులు లేకుండా ప్రివిలైజ్ ఫీజులు కట్ చేశారు. దానివల్ల ప్రభుత్వానికి రూ.1300 కోట్లు ఏడాదికి నష్టం వచ్చింది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి మీరు చేసిన నష్టం అది. ఈ విషయం కాగ్ చెప్పింది. మేం కాదు. ప్రభుత్వానికి ఏకంగా రూ.4-5 వేల కోట్లు నష్టం చేశారు. ఏది స్కామ్?. రెడ్ బుక్ తో పరిశ్రమలు వెనక్కి.. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయడం లేదు. కంపెనీలకు భూములిచ్చే విషయంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. వందల కోట్ల విలువైన భూములను లులూ మాల్ కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని దేశాల్లో ఇలాంటి మాల్స్ ఉన్నాయి. వాల్ మార్ట్ ఎక్కడైనా ప్రభుత్వాన్ని మాకు భూములు చౌకగా ఇవ్వండని అడుగుతున్నారా? ఎందుకు ఇలా రూ.1కే ఎకరా భూమి అప్పగిస్తున్నారు. అది స్కీమా స్కామా రూ.99 పైసలకే ఎకరా భూమి ఇస్తామంటున్నారు. 2029 తర్వాత గ్రౌండ్ చేస్తామని మీతో ఎంఓయూ కుదుర్చుకుంటున్నారు. మీ పరిపాలన చూసి పారిశ్రామికదారులు భయపడుతున్నారు. ప్రభుత్వంలో ఒంటెద్దు పోకడలతో ఏకపక్షంగా అక్రమ అరెస్టులు, అన్యాయంగా కేసుల్లో ఇరికించే పరిస్థితి ఉంటే.. రేపు ప్రభుత్వం మారితే మా పరిస్ధితి ఏంటనే భయాందోళనలు ఎవరికైనా ఉంటాయి. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో ఏ పరిశ్రమలు రాష్ట్రానికి రావడం లేదు. పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. మేం తీసుకొచ్చిన పరిశ్రమలు ప్రారంభిస్తున్నారే తప్ప కొత్తవి మీరు తీసుకుని రావడం లేదు. రెడ్ బుక్ కుట్రలు తక్షణమే ఆపాలి. లోక్ సబా పక్ష నేతను అరెస్టు చేయడం అక్రమం. అదే టైంలో మాకు అంబేద్కర్ రాజ్యాంగం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఈ అక్రమ కేసులు నిలబడే పరిస్థితి ఉండదు. మీ హయాంలో జరిగిన స్కాంలో మీరు బెయిల్ తెచ్చుకున్నారు. మీరు వేసిన విత్తనం మొక్కై, వృక్షమై, మహా వృక్షమై అది ఏ స్ధాయికైనా వెళ్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబుకి డాక్టర్ సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. చంద్రబాబుకి మీకిదే చిట్టచివరకి అవకాశమని.. దాన్ని ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించాలని హితవు పలికారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ... మంత్రి అచ్చన్నాయుడు తమ నాయకుడ్ని సంతృప్తి పరచడానికే నాసిరకం మద్యం తాగి మా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ట్వీట్ చేసినట్లుంది. మంత్రివర్గంలో త్వరలో మార్పులు జరిగితే అచ్చన్నాయుడు పదవి పోతుందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో... ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి చౌకబారు ట్వీట్లతో గౌరవం పోగోట్టుకోవద్దని సీదరి అప్పలరాజు హెచ్చరించారు.