వైయ‌స్ఆర్‌ ‘లా నేస్తం’ ఇకపై ఏడాదికి రెండుసార్లు

 వైయస్‌ఆర్‌ లా నేస్తం కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

 వైయ‌స్‌ఆర్‌ లా నేస్తం – వరుసగా నాలుగో ఏడాది.

జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లోకి రూ.కోటి 55 వేలు జమ చేసిన సీఎం వైయస్‌ జగన్‌ 

ప్రతి జూనియర్‌ న్యాయవాదికి మూడేళ్లపాటు నెల‌కు రూ.5 వేల చొప్పున సాయం

వరుసగా నాలుగో ఏడాది రాష్ట్రంలోని 2,011 మంది లాయర్లకు నగదు జమ

అడ్వకేట్ల కోసం రూ.100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు

 తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌ ‘లా నేస్తం’ ఇకపై ఏడాదికి రెండుసార్లు అమ‌లు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకే వైయస్‌ఆర్‌ లా నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. లా డిగ్రీ అందుకున్న విద్యార్థులు న్యాయవాదిగా స్థిరపడేందుకు లా నేస్తం కచ్చితంగా ఉపయోగపడుతుందని తెలిపారు. గత మూడేళ్లుగా లా నేస్తం నిధులు విడుదల చేస్తున్నామని, మూడున్నరేళ్లలో 4,248 మంది లాయర్లకు లా నేస్తం అందించామని పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం వైయస్‌ఆర్‌ లా నేస్తం పథకం ద్వారా నిధులను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో రూ.1,00,55,000ను క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి విడుదల చేసిన సీఎం వైయస్‌.జగన్‌. ఈ సందర్భంగా వర్చువల్‌గా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూనియర్‌ లాయర్లతో మాట్లాడారు. 


ఈ సందర్భంగా సీఎం  వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:
దేవుడి దయతో మంచి కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా న్యాయవాదులకు తోడుగా ప్రభుత్వం ఉందన్న సంకేతాన్ని గట్టిగా చెప్పడం కోసం ఈ రోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాను.

వృత్తిలో ఊతమిచ్చేందుకే లా నేస్తం....
న్యాయవాది వృత్తిని ఎంచుకుని, మన రాజ్యాంగాన్ని, చట్టాన్ని చదువుకుని న్యాయవాదులుగా స్ధిరపడడానికి... తొలుత మూడు సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్నది నా పాదయాత్రలో చాలా సందర్భాలలో నా దృష్టికి తీసుకొచ్చారు. వీళ్లంతా వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే ఒక గొప్ప వ్యవస్ధ. వీళ్లు బాగా ఉండి, మంచి న్యాయవాదులుగా స్ధిరపడితే న్యాయవృత్తిలో వీళ్లకు మంచి జరిగితే.. ప్రభుత్వం చేసిన ఈ మంచి ద్వారా వాళ్ల మనసుల్లో ఒక స్ధానం ఏర్పడుతుంది. ప్రభుత్వం తోడుగా నిలబడ్డం వల్ల డబ్బులేని పేదవాడికి సహాయం చేయగలుగుతారనే విశ్వాసం ఉంది. ప్రభుత్వం కూడా మనకి ఈ మాదిరిగానే తోడుగా నిలబడింది కదా.. మనం కూడా అలా పేదవాడికి సాయం చేయాలన్న తలంపు మనసులో రావాలన్నది మన ఆరాటం. 

చదువు పూర్తిచేసుకుని న్యాయవృత్తిలోకి వచ్చిన తర్వాత తొలి మూడు సంవత్సరాలు... వారు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తోడుగా ఉందనే భరోసా ఇవ్వడం కోసం ఈ లా నేస్తం అనే పథకాన్ని తీసుకొచ్చాం. ఇది వాళ్ల వృత్తిలో ఊతమివ్వడంతో పాటు స్ధిరపడ్డానికి కూడా సహకరిస్తుంది. 

మూడున్నరేళ్లలో 4,248 మందికి లబ్ధి....
ఈ పథకం ద్వారా ఈ మూడున్నరేళ్లలో దాదాపు 4,248 మంది లాయర్లను మనం ప్రతినెలా ఆదుకున్నాం. రూ.35.40 కోట్లు సహాయంగా అందించాం. 
ఈ రోజు 2011 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదులు ఈ పథకంలో కొనసాగుతున్నారు. వీరికి ఇవాళ దాదపు రూ.1 కోటికి పైగా జమ చేస్తున్నాం. వీళ్లమీద మరింత దృష్టి పెట్టడంతో పాటు ప్రభుత్వం తోడుగా ఉందన్న భావన వీళ్లకు రావాలని ఉద్దేశ్యంతో ఈ పథకంలో కొన్ని మార్పులు తీసకువచ్చాం. ఆరు నెలలకు ఒకసారి, సంవత్సరానికి రెండు దఫాలుగా ఇచ్చేటట్టుగా నిర్ణయించాం. ఒకేసారి పెద్ద అమౌంట్‌ ఇస్తే వాళ్ల అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆలోచనతో మార్పులు చేస్తున్నాం. 

రూ.100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌...
మరో గొప్ప అడుగు న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో లాయర్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశాం. కోవిడ్‌ సమయంలో కూడా కార్పస్‌ ఫండ్‌ అందుబాటులో ఉన్న నేపధ్యంలో.. దాదాపుగా రూ.25 కోట్ల మేరకు మంచి చేయగలిగాం. ఇందులో ఆడ్వొకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్‌ సెక్రటరీలు సభ్యులుగా ఉంటూ అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ట్రస్టీని నిర్వహిస్తున్నారు. దీనికోసం లా సెక్రటరీకి నేరుగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో లా సెక్రటరీ మెయిల్‌ ఐడీకి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. sec_law@ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా లా నేస్తం పథకానికి కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో... దానికోసం కూడా పారదర్శకంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ysrlawnestham.ap.gov.in
వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.
 
దరఖాస్తు చేసున్నవారి వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి శాచ్యురేషన్‌ విధానంలో ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదన్న తపనతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ పథకంలో కూడా అంతే పారదర్శకంగా అడుగులు వేసే కార్యక్రమం చేస్తున్నాం. అందుకనే సంవత్సరానికి రెండు దఫాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మంచి జరగాలనే తపన, తాపత్రయంతో పాదయాత్రలో మాట ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాం.

పేదవాడి పట్ల అంకిత భావం చూపాలి....
ఈ సందర్భంగా ప్రతి న్యాయవాదికి కూడా నేను ఒక మాట చెప్పాలి. న్యాయవాది చేతిలో ఉన్న ఆయుధం.. సైనికుడి చేతిలో ఉన్న తుపాకీ వంటిది, హంతకుడు చేతిలో ఉండే బాకు లాంటిది కాదని అంటారు. నేను మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు ఈ పథకం ద్వారా ఎవరైతే ప్రభుత్వం చేస్తున్న మంచిని పొందుతున్నారో వాళ్లు దాన్ని జ్ఞాపకం పెట్టుకుని.. ఇదే అంకిత భావాన్ని పేదవాడి పట్ల చూపాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇంకా మంచి జరగాలని మీ వృత్తుల్లో మీరు ఇంకా రాణించాలని, దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న లా సెక్రటరీ జి సత్య ప్రభాకరరావు, బెజవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రగిరి విష్టువర్ధన్, ఇతర ఉన్నతాధికారులు, జూనియర్‌ న్యాయవాదులు.
 

Back to Top